Bonam: ఆషాఢంలో మట్టికుండలోనే బోనం ఎందుకు సమర్పిస్తారో తెలుసా?
ఆషాఢంలో గ్రామ దేవతలను ఆరాధిస్తూ మట్టికుండల్లోనే బోనాలను సమర్పిస్తుంటారు. ఇలా ఎందుకు మట్టి కుండల్లోనే బోనం సమర్పించాలో తెలుసుకుందాం.
Bonam: తెలంగాణ సంస్కృతికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే పండుగ 'బోనాలు'. ఆషాఢ మాసం రాగానే పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి వీధిలోనూ అమ్మవారి శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లతో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతుంది. అయితే, ఈ పండుగలో అత్యంత కీలకమైన ఘట్టం.. అమ్మవారికి సమర్పించే బోనం నైవేద్యం. ఈ నైవేద్యాన్ని కేవలం కొత్త మట్టికుండలోనే వండటం వెనుక తరతరాల నాటి ఒక అద్భుతమైన దైవిక, శాస్త్రీయ రహస్యం దాగి ఉంది. బోనం అంటే సాక్షాత్తూ భగవంతుడికి సమర్పించే 'భోజనం'. ప్రకృతి స్వరూపిణి అయిన ఆ జగన్మాతకు, పంచభూతాలలో ఒకటైన మట్టితో చేసిన కుండలోనే పాలు, బెల్లం, కొత్త బియ్యంతో పరమాన్నం వండి సమర్పించడం సనాతన ఆచారం. వర్షాకాలం ప్రారంభంలో వచ్చే ఈ పండుగలో మట్టికుండ, పసుపు, వేపాకుల కలయిక వెనుక సమాజాన్ని కాపాడే గొప్ప ఆరోగ్య రహస్యం కూడా ఉంది. ఆ రహస్యమేంటో తెలుసుకుందాం.
పంచభూతాల సాక్షిగా.. ప్రకృతి మాతకు కృతజ్ఞత
మన శరీరం ఎలాగైతే పంచభూతాలతో నిర్మితమైందో, ఈ సృష్టి కూడా అలాగే ఏర్పడింది. అందులో మట్టి జీవకోటికి ఆధారం. లోహ పాత్రల కన్నా కొత్త మట్టికుండ అత్యంత పవిత్రమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకసారి వాడిన కుండను మరల దైవకార్యాలకు వాడరు కాబట్టి, ప్రతి ఏటా కొత్త కుండలోనే బోనం వండుతారు. గ్రామాలను చల్లగా చూసే పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, లష్కర్ మహంకాళి వంటి ఏడుగురు అక్కాచెల్లెళ్లయిన గ్రామ దేవతలకు ఈ పవిత్రమైన అన్నాన్ని సమర్పిస్తారు.
వర్షాకాలపు వ్యాధులను హరించే దైవిక వైద్యం
ఆషాఢ మాసంలోనే ఎందుకు బోనాలు చేస్తారనేదానికి ఒక బలమైన ఋతు సంబంధిత కారణం ఉంది. ఎండకాలం ముగిసి వర్షాకాలం అడుగుపెట్టే ఈ సంధి కాలంలో గాలి, నీరు కలుషితమై అంటువ్యాధులు, కలరా, మలేరియా వంటి జ్వరాలు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మట్టికుండలో వండిన ఆహారానికి రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉంది. ఈ కుండకు చుట్టూ రాసే పసుపు, కట్టే వేపాకులు, లోపల వెలిగించే కర్పూర దీపం... ఇవన్నీ అద్భుతమైన క్రిమిసంహారకాలుగా పనిచేస్తాయి. బోనంతో వీధుల్లో తిరగడం వల్ల గాలిలోని సూక్ష్మక్రిములు నశించి, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని మన పెద్దల నమ్మకం. అమ్మవారికి పవిత్రంగా బోనం సమర్పించి, ఆ కుండపై జ్యోతిని వెలిగించి తలపై ఎత్తుకుని ఆలయానికి వెళ్లే ప్రతి భక్తుడిని ఆ తల్లి కంటికి రెప్పలా కాపాడుతుంది. ఈ ఆషాఢ మాసంలో మనం కూడా ఆ పరంపరను గౌరవిస్తూ, భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలిచి సకల శుభాలను పొందుదాం.




