Divili Tirupati Sacred Well: సంతానభాగ్యం, వివాహయోగం పొందాలంటే...ఈ బావినీటితో సాధ్యం

Divili Tirupati Sacred Well: వివాహం, సంతానం ప్రతి మనిషి జీవితానికి చాలా అవసరం. ప్రకృతి ప్రసాదించిన పునరుత్పత్తిని ప్రతి ఒక్కరూ తప్పకుండా నెరవేర్చాలి.

Balachander
Published on: 24 April 2026 2:57 PM IST
Divili Tirupati Sacred Well
X

Divili Tirupati Sacred Well

Divili Tirupati Sacred Well: వివాహం, సంతానం ప్రతి మనిషి జీవితానికి చాలా అవసరం. ప్రకృతి ప్రసాదించిన పునరుత్పత్తిని ప్రతి ఒక్కరూ తప్పకుండా నెరవేర్చాలి. కానీ, కొందరు ఎంత ప్రయత్నించినా వివాహానికి ఏదోఒక అడ్డంకి ఏర్పడుతూనే ఉంటుంది. అదేవిధంగా, సంతానం కోసం పరితపించేవారు కోకొల్లలు. అలాంటి వారికి దివిలి తిరుపతి ఓ దివ్యౌషదంలా కనిపిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఈ క్షేత్రంలో సుమారు 2వేల సంవత్సరాల నాటి పురాతన బొటనవావి దీనికి పరిష్కారం చూపుతోంది. ఇక్కడ ఈ బావిలో స్నానం చేస్తే సకల దోషాలు తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయని, సంతానం వృద్ది చెందుతుందని అంటారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీహరి నాభినుంచి ఉద్భవించిన బొటనబావి

పురాణాల ప్రకారం శ్రీహరి నాభినుంచి ఎవరు ఆవిర్భవించారు అంటే బ్రహ్మదేవుడు అని చెబుతారు. కానీ, ఈ దివిలి తిరుపతిలో శ్రీహరి నాభి నుంచి ఎవరు ఉద్బవించారు అంటే బొటన బావి ఉద్భవించిందని చెబుతారు. నాభి నుంచి ఉద్భవించింది కాబట్టి దీనిని బొటనబావి అని పిలుస్తారు. వివాహ సంబంధాలు కుదరక ఇబ్బందిపడేవారు ఈ బావిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని మనస్పూర్తిగా మొక్కుకుంటే తప్పకుండా వివాహం నిశ్చయమౌతుంది. ఇప్పటికే ఎందరో భక్తులు స్వయంగా అనుభవించిన సత్యం ఇది. అంతేకాదు, సంతానం లేని దంపతులు భక్తితో ఇక్కడ పూజలు చేస్తే చిన్నికృష్ణుడు ఇంట జన్మిస్తాడని నమ్ముతారు.

విగ్రహంలో దాగున్న వింత రహస్యం

ఈ ఆలయంలో బావి ఒక వింతైతే... విగ్రహం మరో వింత. గర్భగుడిలోని స్వామివారి విగ్రహాన్ని మనం చూసే కోణాన్ని బట్టి ఎత్తు మారుతుంది. గర్భగుడి ముందు నిలబడి స్వామిని దర్శిస్తే ఒక ఎత్తులో కనిపిస్తాడు. అదే కొంచెం దూరంగా ఎత్తుగా ఉన్న మండపం నుంచి చూస్తే మరికొంచెం ఎత్తుగానూ, అదే మెట్లపై నుంచి చేస్తే అంతే ఎత్తుగా ఉన్నట్టుగా కనిపిస్తాడు. ఇదంతా శిల్పాన్ని చెక్కిన విధానమేనని అంటారు. ఎవరు ఎలా చూస్తే ఆవిధంగా శృంగార వల్లభుడు దర్శనం ఇస్తాడు.

క్షేత్రానికి చేరుకోవడం ఎలా?

అరుదైన, అత్యంత మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని చేరుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయి. కాకినాడ సమీపంలోని సామర్లకోట లేదా పెద్దాపురం నుంచి ఈ ఆలయానికి అత్యంత సులభంగా చేరుకోవచ్చు. శనివారం రోజున ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారాల్లో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పాదయాత్రగా వస్తారు. వివాహం, సంతానం మాత్రమే కాదు... విద్య, ఉద్యోగాల్లో రాణించాలని అనుకునేవారు కూడా ఈ బొటనబావి నీటితో స్నానం చేస్తారు. నమ్మకానికి భక్తి తోడైతే అద్భుతాలు జరుగుతాయి అనడానికి ఈ శృంగార వల్లభుడే సాక్ష్యం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story