Vindhyachal Temple: ఇక్కడ అమ్మవారు ప్రసాదాన్ని క్షణాల్లో తినేస్తారు... హనుమంతుడితోపాటు భైరవుడూ కాపలా

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ జిల్లాలో అత్యంత శక్తివంతమైన పీఠం మీర్జాపూర్‌ అమ్మవారు. ఇక్కడ మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతి రూపాల త్రివేణి సంగమంగా చెబుతారు.

Balachander
Published on: 25 July 2026 12:01 PM IST
Vindhyachal Temple: ఇక్కడ అమ్మవారు ప్రసాదాన్ని క్షణాల్లో తినేస్తారు... హనుమంతుడితోపాటు భైరవుడూ కాపలా
X

Vindhyachal Temple: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లా వింధ్యాచల్ ప్రాంతం అత్యంత మహిమాన్వితమైన ఆధ్యాత్మిక రహస్యాలకు నిలయం. ఇక్కడి శక్తిపీఠంలో కొలువైన అమ్మవారి నోటిలో వేసే నైవేద్యం క్షణాల వ్యవధిలోనే అదృశ్యమవ్వడం భక్తులను, ఆధ్యాత్మిక వేత్తలను ఆశ్చర్యపరిచే అద్భుత ఆధ్యాత్మిక రహస్యంగా చెబుతారు.

వింధ్యాచల్ క్షేత్ర మహిమలు

వింధ్య పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్రం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాల త్రివేణి సంగమం. దుష్టశక్తుల నివారణకు, జ్ఞాన సిద్ధికి, లక్ష్మీ కటాక్షానికి ఈ క్షేత్ర దర్శనం అత్యంత శ్రేష్ఠమైనది. ఈ పుణ్యభూమిలో ఆవాసమున్న ఏడు ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలు భక్తులలో ఎంతో ఆధ్యాత్మిక ఉత్సుకతను కలిగిస్తాయి.

మహాకాళి ఆలయం ... క్షణాల్లో అదృశ్యమయ్యే నైవేద్యం వింత

రక్తబీజుడనే రాక్షసుడిని సంహరించిన అనంతరం అమ్మవారు ఇక్కడ ఖేచరీ ముద్రలో ఆసీనురాలయ్యారని పురాణాలు చెబుతున్నాయి. భక్తులు అమ్మవారి నోటిలో సమర్పించే ప్రసాదం లేదా నైవేద్యం క్షణాల్లో అదృశ్యమవుతుంది. ఆ ప్రసాదం ఏమౌతుందో ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయారు. ఇప్పటికీ ఇది రహస్యంగానే ఉండిపోయింది.

రక్షకులుగా హనుమంతుడు, భైరవుడు

ఇక ఈ శక్తి పీఠానికి కాపలాగా అడుగడుగునా పలు శక్తులు కొలువై ఉన్నాయి. అందులో ఒకటి హనుమాన్‌ ఆలయం. ఇక్కడ అమ్మవారికి ప్రధాన రక్షకుడిగా హనుమంతుడు ఉంటాడు. మంగళ, శనివారాల్లో హనుమంతుడిని దర్శించుకుంటే అడ్డంకులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. జీవితంలో ఏం సాధించాలన్నా ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని హనుమంతుడు ఇస్తాడని అంటారు. ఇక ఇక్కడే మరో అద్భుతం కూడా ఉన్నది. అదే భైవర, భైరవి సమేత ఆలయం. ప్రపంచంలోనే అరుదుగా భైరవుడు, భైరవి కలిసి ఒకే చోట కొలువైన క్షేత్రమిది. ఇక్కడ భైరవుడు, భైరవి అమ్మవారి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

ఇక్కడ మహాసరస్వతి దేవి అమ్మవారు అష్టభుజి అమ్మవారిగా దర్శనమిస్తారు. అమ్మవారిని దర్శించుకుంటే జ్ఞానం, విద్యాబుద్దులు లభిస్తాయని భక్తుల నమ్మకం. దుష్టశక్తులతో ఇబ్బంది పడేవారు మా రాథ అమ్మవారికి కేశాలను సమర్పిస్తారు. ఇలా చేయడం వలన దుష్టశక్తుల నుంచి రక్షణ కలుగుతుంది. ఇక నవరాత్రుల సమయంలో వింధ్యాచల్ ముక్కోటి దేవతల దివ్య సాక్షాత్కారంతో పరమ పవిత్ర ఆధ్యాత్మిక ధామంగా మారుతుంది. ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించి అమ్మవారిని ఆరాధించడం వల్ల సమస్త భయాలు తొలగిపోయి, జీవితంలో పూర్ణ ప్రశాంతత సమకూరుతుందని భక్తుల నమ్మకం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story