Turmeric Ganesha: వినాయకచవితి స్పెషల్ః పూజలో పసుపు గణపతిని ముందుగా ఎందుకు పూజించాలి... రహస్యం ఇదే
వినాయకచవితి పూజలో పసుపు గణపతిని ముందుగా ఎందుకు పూజిస్తారు? త్రిపురాసురుల కథ, శివుడి ఆజ్ఞ, పసుపు గణపతి ఆరాధన వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకుందాం.
Turmeric Ganesha: ఏ పూజ లేదా శుభకార్యం ప్రారంభించినా ముందుగా విఘ్నేశ్వరుడిని ఆరాధించడం మన సనాతన సంప్రదాయం. అందునా పసుపుతో చేసిన గణపతిని తయారుచేసి పూజించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఆచారం వెనుక ఒక అద్భుతమైన పౌరాణిక కథ, ఆధ్యాత్మిక రాత్రింభవాల అంతరార్థం దాగి ఉన్నాయి. త్రిపురాసురులనే రాక్షసుల సంహారం సమయంలో నందీశ్వరుడి కొమ్ము తెగిపడిన ప్రదేశంలో పండిన పసుపుతో గణపతిని చేసి పూజించాలనే శివుడి ఆజ్ఞే దీనికి ప్రధాన కారణం. ఈ ఆచారం వెనుక ఉన్న పౌరాణిక విశేషాలు, ఆధ్యాత్మిక అంతరార్థాలు ఏమిటో తెలుసుకుందాం.
త్రిపురాసురుల సంహారం ... పసుపు గణపతి ఉద్భవం
పూర్వం త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులు బ్రహ్మదేవుడి నుంచి తీవ్రమైన వరాలు పొంది ఆకాశంలో మూడు నగరాలను నిర్మించుకున్నారు. వారి వేధింపులు తాళలేక దేవతలు, మునులు పరమశివుడిని ఆశ్రయించారు. ఈశ్వరుడి ఆదేశం మేరకు నందీశ్వరుడు తన రెండు కొమ్ములతో ఆ మూడు నగరాలను ఎత్తి పట్టుకున్నాడు. శివుడు తన త్రిశూలంతో ఆ రాక్షసులను అంతం చేసే సమయంలో నంది కొమ్ములలో కొమ్ము ఒకటి తెగి కిందపడిపోయింది. గణపతి ఆ కొమ్మును వెతికి తీసుకువచ్చాడు. నంది కొమ్ము పడిన ప్రదేశంలో పండిన పసుపు కొమ్ముల చూర్ణంతో ముద్ద చేసి వినాయకుడిగా ఆరాధించాలని, అలా చేసిన వారిని నిరంతరం రక్షిస్తానని శివుడు అభయమిచ్చారు. నాటి నుంచి పసుపు గణపతి పూజ ఆనవాయితీగా మారింది.
పూజలోని శాస్త్రోక్త మంత్రాల ప్రాధాన్యత
ఏ శుభకార్యమైనా విఘ్నాలు లేకుండా సాగాలంటే వినాయకుడికి ఎదురుగా కూర్చొని ఏకాగ్రతతో పూజించాలి. పూజా సమయంలో "స్థిరో భవ, వరదో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం కురు" అని ప్రార్థిస్తారు. అంటే "హే గణపతీ! మా పూజలో స్థిరంగా ఉండు, అనుగ్రహించే వరదాతవు కా, సుప్రసన్నుడవై మా ఇంట స్థిరమైన ఆసనాన్ని అలంకరించు" అని వేడుకోవడం దీని ముఖ్య ఉద్దేశం.
ఆరోగ్య, క్రిమినాశక కోణం
కేవలం పౌరాణిక కథ మాత్రమే కాకుండా పసుపుకు అద్భుతమైన క్రిమినాశక, మంగళకరమైన గుణాలు ఉన్నాయి. పసుపుతో చేసిన వినాయకుడిని పూజించడం వల్ల ఆ ప్రదేశంలో సానుకూల శక్తి పెరిగి, సమస్త విఘ్నాలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుందని విశ్వసిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమతమ పూజా విధానంలో ముందుగా పసుపు గణపతిని ఆరాధించి ఆ తరువాత ప్రధాన పూజను నిర్వహిస్తారు. గణపతి ఆరాధన లేకుండా నిర్వహించే పూజ సంపూర్ణ ఫలితాలు ఇవ్వదని శాస్త్రాలు చెబుతున్నాయి.




