Bedroom Vastu Tips: వాస్తు చిట్కాలుః పడకగది ఇలా లేకుంటే...రణరంగమే

నేటి ఆధునిక కాలంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు చిలికి చిలికి గాలివానలా మారి విడాకుల వరకు వెళ్తున్నాయి. దీనికి జాతక దోషాలు ఒక కారణమైతే, మనం నివసించే ఇంటి 'వాస్తు' దోషాలు మరొక ప్రధాన కారణం.

Balachander
Published on: 11 May 2026 11:10 AM IST
Bedroom Vastu Tips:  వాస్తు చిట్కాలుః  పడకగది ఇలా లేకుంటే...రణరంగమే
X

Bedroom Vastu Tips: నేటి ఆధునిక కాలంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు చిలికి చిలికి గాలివానలా మారి విడాకుల వరకు వెళ్తున్నాయి. దీనికి జాతక దోషాలు ఒక కారణమైతే, మనం నివసించే ఇంటి 'వాస్తు' దోషాలు మరొక ప్రధాన కారణం. ముఖ్యంగా పడకగది విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ఆ ఇల్లు అశాంతికి నిలయంగా మారుతుంది. తరచు గొడవలు జరగడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.

దిశలే ప్రధానం

దంపతుల పడకగది ఎప్పుడూ ఇంటికి నైరుతి దిశలో ఉండాలి. ఇది స్థిరత్వానికి చిహ్నం. పొరపాటున కూడా ఈశాన్యం లేదా ఉత్తర దిశలో పడకగదిని ఏర్పాటు చేసుకోకూడదు. ఈ దిశలు దైవ కార్యాలకు ఉద్దేశించినవి, ఇక్కడ పడకగది ఉంటే దంపతుల మధ్య అనవసరమైన చిరాకులు, మానసిక ఒత్తిడి పెరుగుతాయి.

అద్దం - అరిష్టం

చాలామంది పడకగదిలో అలంకరణ కోసం మంచానికి ఎదురుగా పెద్ద అద్దాలను ఏర్పాటు చేసుకుంటారు. వాస్తు ప్రకారం నిద్రిస్తున్నప్పుడు మీ ప్రతిబింబం అద్దంలో కనిపించకూడదు. ఇలా జరిగితే ఆ గదిలోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి. ఇది దంపతుల మధ్య మూడో వ్యక్తి ప్రమేయానికి లేదా అపనమ్మకాలకు దారితీస్తుంది. ఒకవేళ అద్దం ఉంటే, పడుకునే ముందు దానిపై ఒక పల్చని వస్త్రం కప్పడం మంచిది.

నిద్రించే పద్ధతి

ఉత్తర దిశలో తల పెట్టుకుని నిద్రించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఉత్తరాన్ని పితృదేవతల దిశగా, అయస్కాంత క్షేత్ర ప్రభావం ఎక్కువగా ఉన్న దిశగా పరిగణిస్తారు. దీనివల్ల రక్తపోటు, నిద్రలేమి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎప్పుడూ దక్షిణం లేదా పడమర వైపు తల పెట్టుకుని పడుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.

రంగుల ప్రభావం

పడకగది గోడలకు నీలం లేదా బూడిద రంగులు వేయకండి. ఇవి ఒంటరితనాన్ని, విరాగాన్ని ప్రేరేపిస్తాయి. దీనికి బదులుగా లేత గులాబీ, క్రీమ్ లేదా తెలుపు రంగులు వేయడం వల్ల దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది. అనురాగాన్ని, ప్రేమను కలిగించడంలోనూ, పంచడంలోనూ రంగులదే ప్రధాన పాత్ర అని గుర్తుంచుకోండి.

పరిష్కారం

పడకగదిలో ఆగ్నేయం లేదా ఈశాన్యంలో శౌచాలయం ఉండకుండా చూసుకోవాలి. శౌచాలయం నుంచి వచ్చే ప్రతికూల శక్తులతో పడకగది నిండిపోతుంది. ఫలితంగా గొడవలు రావొచ్చు. ఇక ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం సమయంలో 24 సార్లు గాయత్రీ మంత్రాన్ని జపించడం వలన గదిలో ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఇక పడక గదిలో రాధాకృష్ణులు లేదా శివపార్వతుల చిత్రపటాలను ఉంచుకోవడం వలన దాంపత్య జీవితం ఆనందకరంగా ఉంటుంది. ఇల్లు మాత్రమే అందంగా ఉంటే సరిపోదు... వాస్తు ప్రకారం కూడా నిర్మించబడి ఉండాలి. అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.

గమనికః ఇక్కడ ఇచ్చిన సమాచారం మతవిశ్వాసాలు, నమ్మకాలపై ఆధారపడి ఇచ్చినది మాత్రమే.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story