Vastu Kartari: వాస్తు కర్తరి రహస్యం...ఇంటి నిర్మాణం పనులు చేపట్టకపోవడానికి ఇదే కారణం
మే 4 నుండి మే 28 వరకు 'కర్తరీ' కాలం ఉంటుంది. ఈ సమయంలో భూమిని తవ్వడం, గృహ నిర్మాణ పనులు చేపట్టడం శాస్త్రరీత్యా నిషిద్ధం.
Vastu Kartari: మే 4 నుండి మే 28 వరకు 'కర్తరీ' కాలం ఉంటుంది. ఈ సమయంలో భూమిని తవ్వడం, గృహ నిర్మాణ పనులు చేపట్టడం శాస్త్రరీత్యా నిషిద్ధం. ఎందుకో తెలుసుకుందాం. మన హిందూ ధర్మ శాస్త్రాల్లో, ఆచారాల్లో ప్రతి చిన్న అంశం వెనుక ఒక లోతైన అర్థం, అంతకంటే గొప్ప సైన్స్ దాగి ఉంటుంది. అందులో ఒకటే ఈ "కర్తరీ". సాధారణంగా మనం 'కత్తెర' అని పిలుచుకునే ఈ కాలం, సూర్యుని ప్రచండ వేడికి భూమి అల్లాడిపోయే సమయం. వాస్తు శాస్త్రం ప్రకారం, సూర్యుడు భరణి నక్షత్రం 4వ పాదం నుంచి రోహిణి 1వ పాదం వరకు ప్రయాణించే ఈ 24 రోజుల వ్యవధిని 'కర్తరీ' అంటారు.
రెండు రకాల కర్తరీలు - డొల్లు, నిజ కర్తరీలు
సూర్యుడు భరణి నక్షత్రం 4వ పాదంలోకి ప్రవేశించినప్పటి నుంచి కృత్తిక నక్షత్రంలోకి వచ్చే వరకు ఉండే కాలాన్ని 'డొల్లు కర్తరీ' అంటారు. ఇక సూర్యుడు కృత్తిక నక్షత్రంలో సంచరించే కాలాన్ని 'నిజ కర్తరీ' అంటారు. ఈ సమయంలో ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తాయి. అందుకే ఈ సమయంలో గృహ నిర్మాణానికి "కత్తెర" వేయాలని శాస్త్రం చెబుతోంది.
నిర్మాణ పనులు ఎందుకు ఆపాలి?
మన పెద్దలు ఏదైనా వద్దన్నారు అంటే అందులో లోక కళ్యాణం దాగి ఉంటుంది. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఈ కారణాల్లో మొదటిది కార్మికుల క్షేమం. మే నెలలో ఎండలు సుమారు 45 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇటుకలు మోయడం, పునాదులు తవ్వడం వంటి కఠిన శ్రమ చేస్తే కార్మికలకు వడదెబ్బ తగిలి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఇంటి గోడ నిర్మాణం పనులకు ఉపయోగించే సిమెంట్ తేమగా ఉండాలి. తగినంత తేమ లేకుంటే నిర్మాణం కుప్పకూలిపోతుంది. సూర్యుడు ప్రచండ నిప్పులు కురిపించే సమయం కావడంతో నీరు త్వరగా ఆవిరై గోడలు వేడెక్కుతాయి. ఫలితంగా బీటలువారే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, భూమి విపరీతంగా వేడెక్కినపుడు దానిని తవ్వడం వలన భూగర్భంలోని జీవరాశులకు హాని జరుగుతుంది. ఫలితంగా ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. ఈ కారణంగానే ఈ కర్తరీ కాలంలో నిర్మాణ పనులు చేపట్టకూడదని అంటారు.
ఏం చేయవచ్చు? ఏం చేయకూడదు?
ఈ కర్తరీ సమయంలో కొత్తగా పునాదులు తీయడం అంటే శంకుస్థాపనలు, గోడలు లేపడం, ఇంటి పైకప్పు వేయడం, పాత ఇల్లు కూల్చడం, పెద్ద పెద్ద చెట్లను నరకడం వంటివి అస్సలు చేయకూడదు. అయితే, వివాహాలు, ఉపనయనాలు, సీమంతం వంటి శుభకార్యాలకు కర్తరీ దోషం వర్తించదు. ఇవి ఇంటి లోపల జరిగే పనులు కాబట్టి శాస్త్రం మినహాయింపు ఇచ్చింది.
మన శాస్త్రాలు కొన్ని విషయాలను చెబుతుంటాయి. అందులో ముఖ్యమైనది "ధర్మో రక్షతి రక్షితః" ఒకటి. అంటే మనం ప్రకృతిని గౌరవిస్తే, అది మనల్ని కాపాడుతుంది. కాబట్టి, ఈ కొద్ది రోజులు ఓపిక పట్టి, వాతావరణం చల్లబడే జూన్ మాసంలో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించడం ఉత్తమం.




