Varalakshmi Vratam: వరలక్ష్మీ పూజా రహస్యం... కష్టాలతో పాటు ఈ సమస్యలకు అమ్మవారి పరిష్కారం
శ్రావణమాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీవ్రతం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారిని ఇతోధికంగా పూజించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
Varalakshmi Vratam: సనాతన ధర్మంలో స్త్రీలు ఆచరించే అత్యంత పవిత్రమైన నోములు, వ్రతాలలో 'వరలక్ష్మీ వ్రతం' అగ్రస్థానంలో నిలుస్తుంది. కోరిన వరాలను తక్షణమే అనుగ్రహించే కల్పవల్లిగా వరలక్ష్మీ దేవిని భక్తులు ఆరాధిస్తారు. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించే ఈ వ్రతం వెనుక లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు, దైవిక శక్తులు దాగి ఉన్నాయి.
అష్టలక్ష్ముల రూపమే వరలక్ష్మి
వరలక్ష్మీ వ్రతం కేవలం ఒక ఒక్క లక్ష్మీరూపానికి మాత్రమే పరిమితం కాదు. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజ లక్ష్ములు అనే అష్టలక్ష్మీ స్వరూపాలన్నింటినీ కలిపి వరలక్ష్మీ దేవిగా కొలుస్తారు. అందువల్ల ఈ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే గృహాలలో దారిద్య్రం తొలగిపోయి, ఐశ్వర్యం వికసిస్తుందని శాస్త్రప్రమాణం చెబుతోంది.
వ్రత విధానం ... పవిత్ర నియమాలు
ఈ దివ్య వ్రతాన్ని ఆచరించే మహిళలు సూర్యోదయానికి ముందే మేల్కొని తలస్నానం ఆచరించాలి. ఇల్లు, పూజాగృహాన్ని పవిత్రంగా శుభ్రపరుచుకుని బియ్యపు పిండితో పద్మ ముగ్గులు వేయాలి. అనంతరం పీఠంపై నూతన వస్త్రం పరిచి, దానిపై బియ్యం పోసి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశంపై కొబ్బరికాయను ఉంచి, అమ్మవారి ముఖపద్మాన్ని ప్రతిష్ఠించాలి. ఆ తరువాత ప్రథమంగా విఘ్నేశ్వరుడి పూజ పూర్తి చేసిన పిదప, షోడశోపచారాలతో వరలక్ష్మీ దేవిని అర్చించాలి. అనంతరం భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రత కథను పఠించి, నివేదన సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి పాదాల చెంత ఉంచిన పవిత్ర తోరణాన్ని ధరించడం వల్ల రక్ష కలుగుతుంది. భక్తులు తమ వీలును బట్టి లఘు లేదా షోడసోపచార పూజలు నిర్వహిస్తారు.
సమస్యలకు అమ్మవారి దివ్య పరిష్కారం
దక్షిణాది పండుగలలో విశేష ఆదరణ కలిగిన ఈ వ్రతం మనస్సులోని నెగటివ్ ఆలోచనలను తుడిచిపెడుతుంది. గృహంలో ఎన్నో రోజులుగా వేధిస్తున్న ఆర్థిక సంక్షోభాలు, వ్యాపారంలో నష్టాలు, నిత్య కలహాలు, సంతాన లేమి వంటి క్లిష్టమైన సమస్యలకు ఈ వ్రతాచరణ ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. భక్తితో సమర్పించే చిన్న పూవునైనా స్వీకరించి, లక్ష్మీదేవి తన భక్తులకు కష్టాల నుంచి గట్టెక్కించే మార్గాన్ని చూపుతుంది. ఈ మహోన్నత వ్రతాన్ని ఆచరించడం ద్వారా గృహంలో నిత్యం శాంతి, సంతోషాలు విలసిల్లుతాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలు శ్రీమహాలక్ష్మీదేవి వ్రతాన్ని విధిగా నిర్వహిస్తారు.




