Maa Bagdai Temple: ఈ అమ్మవారికి ప్రసాదంగా రాళ్లు... కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

Maa Bagdai Temple: దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో భక్తులు దేవతలకు పండ్లు, పాయసం, కొబ్బరికాయలు, బలులు వంటి నైవేద్యాలు సమర్పించడం సహజం.

Balachander
Published on: 8 April 2026 8:29 AM IST
Maa Bagdai Temple
X

Maa Bagdai Temple: ఈ అమ్మవారికి ప్రసాదంగా రాళ్లు... కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

Maa Bagdai Temple: దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో భక్తులు దేవతలకు పండ్లు, పాయసం, కొబ్బరికాయలు, బలులు వంటి నైవేద్యాలు సమర్పించడం సహజం. కానీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాలో వెలసిన “మా బాగ్దాయి” అమ్మవారి ఆలయంలో మాత్రం ఒక విభిన్న ఆచారం కొనసాగుతోంది. ఇక్కడ భక్తులు ప్రసాదంగా ఐదు రాళ్లు, ఒక పువ్వు మాత్రమే సమర్పిస్తారు. ఈ విశిష్ట సంప్రదాయం వెనుక ఉన్న కథ తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది.

అమ్మవారు ఎలా వెలిశారంటే

దట్టమైన అడవుల మధ్య, ప్రకృతి నడుమ వెలసిన ఈ ఆలయం సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని స్థానికులు చెబుతారు. ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఓ పేద గొర్రెల కాపరి జీవించేవాడు. అతను రోజూ తన గొర్రెలతో అడవిలో తిరుగుతూ జీవనం సాగించేవాడు. ఒకరోజు అతనికి ఆ అడవిలో ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. ఓ దివ్యరూపం ఆయనకు కనిపించింది. అది సాధారణమైన రూపం కాదు..సాక్షాత్తు అమ్మవారే దర్శనం ఇచ్చారని గ్రహించాడు. అదేరోజు రాత్రి అమ్మవారు అతనికి కలలో కనిపించి తాను దర్శనం ఇచ్చిన చోట విగ్రహం రూపంలో వెలిశానని గుడి నిర్మించి తనను అక్కడ ప్రతిష్టించాలని పేర్కొంటుంది. వెంటనే ఆ గొర్రెల కాపరి ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా...అక్కడ అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది.

గుడి నిర్మాణం

గొర్రెల కాపరి తన వద్ద ఉన్న కొద్దిపాటి ధనంలో చిన్నపాటి గుడిని నిర్మిస్తాడు. అందులో అమ్మవారిని ప్రతిష్టించి రోజూ పూజిస్తాడు. అయితే, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడానికి, కొబ్బరికాయలు సమర్పించడానికి తగినంత ధనం లేకపోవడంతో ఆ అమ్మవారి వద్ద మొరపెట్టుకుంటాడు. అమ్మవారు మరోసారి అతనికి కనిపించి తనకు ఆడంబరాలు అవసరం లేదని, నిజమైన భక్తి ఉంటే చాలని చెబుతుంది. ఆలయం దగ్గరలో దొరికే ఐదు రాళ్లను తనకు సమర్పించాలని చెబుతుంది. అమ్మవారు చెప్పిన విధంగా రాళ్లను అతను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాడు.

రాళ్లే నైవేద్యం

ఆనాటి నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు అమ్మవారి కోసం ఐదు రాళ్లు, ఒక పువ్వు తీసుకొని వస్తారు. వాటినే అమ్మకు సమర్పిస్తారు. ఈ ఆచారం గత వందేళ్లుగా కొనసాగుతోంది. ఇక్కడ మరో విచిత్రమేమంటే కోరికను అమ్మవారికి తెలిపేందుకు వచ్చే సమయంలో ఐదు రాళ్లను తీసుకొని వచ్చి మొక్కుకుంటారు. కోరిన కోరిక తీరిన తరువాత అమ్మవారికి మరోసారి ఐదురాళ్లు, ఒక పువ్వును సమర్పిస్తారు. ఎవరైతే అమ్మవారిపై నమ్మకం ఉంచి మొక్కుకుంటారో వారి కోరికలు నెరవేరడమే కాదు... చెడు దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.

ఉత్సవాలు

ప్రతి ఏడాది చైత్రమాసం, శరన్నవరాత్రుల సమయాల్లో పెద్ద ఎత్తున జాతరను నిర్వహిస్తారు. ఆ సమయంలో అడవి మొత్తం భక్తులతో నిండిపోతుంది. అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. ప్రకృతి మధ్యలో జరిగే ఈ వేడుక భక్తులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఈ ఆలయం మనకు ఓ గొప్ప సందేశం ఇస్తుంది. భగవంతుడికి కావలసింది ధనం కాదు...మనస్పూర్తిగా భక్తి ఉంటే చాలు. పెద్ద పెద్ద నైవేద్యాలు, ఖరీదైన సమర్పణలు లేకపోయినా నిజమైన విశ్వాసం ఉంటే భగవంతుడు మనతోనే ఉంటాడని ఈ ఆలయం నిరూపిస్తుంది. దట్టమైన అడవి మధ్యలో వెలిసిన మా బగ్దాయి అమ్మవారు ఇప్పటికీ తన భక్తులను కాపాడుతూ వారి కోరికలను నెరవేరుస్తున్నారని అంటారు. ఈ ప్రాంతంలో నివశించేవారు తమ కులదైవంగా కూడా అమ్మవారిని పూజిస్తారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story