Ujjain Kal Bhairav: మద్యాన్ని స్వీకరించినా...మార్పుల్లేని విగ్రహం...కాలభైరవుడి రహస్యం

ఉజ్జయినీలోని కాలభైరవుడు రోజుకు సుమారు 200 బాటిళ్ల మద్యాన్ని సేవించినా... విగ్రహం రంగు మారకపోవడం ఆశ్చర్యం. బ్రిటీష్‌ పరిశోధకులు ఎన్నిసార్లు పరిశోధించినా మద్యం ఆనవాళ్లు కనిపించకపోవడం విశేషం.

Balachander
Published on: 19 Jun 2026 9:50 AM IST
Ujjain Kal Bhairav: మద్యాన్ని స్వీకరించినా...మార్పుల్లేని విగ్రహం...కాలభైరవుడి రహస్యం
X

Ujjain Kal Bhairav: భారతదేశంలో సనాతన ధర్మం, అపారమైన నమ్మకాలపై ఎన్నో వింతలు, విశేషాలు ఆధారపడి ఉన్నాయి. మానవ మేధస్సుకు, సైన్స్‌కు కూడా అందని ఎన్నో రహస్యాలు మన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో దాగి ఉన్నాయి. అలాంటి వాటిలో అత్యంత విస్మయకరమైన క్షేత్రం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ కాలభైరవ ఆలయం. విగ్రహం మద్యం సేవించడం, ఆ మద్యం ఎటు పోతుందో ఎవరికీ తెలియకపోవడం ఇక్కడి ప్రధాన విశేషం.

క్షేత్రపాలకుడు ... కాలభైరవుడు

ఉజ్జయినీ నగరం అనగానే అందరికీ మహాకాళేశ్వరుడు గుర్తోస్తాడు. అయితే, ఆ నగరానికి రక్షకుడిగా, క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు. ఉజ్జయినీ ముఖ్య నగరం నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో క్షిప్రా నదీ తీరాన ఈ అద్భుత ఆలయం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించుకోకుండా ఉజ్జయినీ యాత్ర పూర్తికాదని భక్తుల నమ్మకం. ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు క్షేత్రపాలకుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు.

మద్యం నైవేద్యం ... ఒక వింత ఆచారం

సాధారణంగా దేవాలయాల్లో పాలు, పండ్లు, మిఠాయిలు ప్రసాదంగా సమర్పిస్తారు. కానీ, ఈ కాలభైరవుడికి మాత్రం మద్యాన్ని నైవేద్యంగా సమర్పించడం శతాబ్ధాలుగా వస్తున్న ఆచారం. అయితే, ఇక్కడ ఓ విశేషం ఉంది. మద్యాన్ని భక్తులు నేరుగా స్వామివారికి అందించలేరు. ఆలయ పూజారులు భక్తులు సమర్పించిన మద్యాన్ని ఓ పాత్రలో పోసి దానిని స్వామివారి పెదవుల వద్ద ఉంచుతారు. ఇలా ఉంచిన సమయంలో ఆలయ పూజారులు మంత్రాలు పఠిస్తారు. పాత్రను స్వామివారి పెదవులను తాకగానే పాత్రలోని మద్యం క్రమంగా ఖాళీ అవుతుంది. స్వామివారు స్వీకరించిన అనంతరం మిగిలిన మద్యాన్ని భక్తులకు అందిస్తారు.

సైన్స్‌కు సవాల్‌ ... ఎటు పోతోంది ఆ మద్యం?

ఈ ఆలయంలో రోజుకు సగటున 200 కంటే ఎక్కువ మద్యం సీసాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఇక్కడే అసలైన రహస్యం దాగి ఉంది. ఆల్కహాల్‌లో ఉండే ఘాటైన రసాయనాల వల్ల ఏ విగ్రహమైనా కాలక్రమేణా అరిగిపోవాలి లేదా రంగు మారాలి. కానీ, వందల ఏళ్లుగా ఈ విగ్రహంలో ఎలాంటి మార్పూ రాలేదు. పూర్వం బ్రిటీష్ పాలకులు ఈ వింతను నమ్మక, ఆలయ గర్భగుడి చుట్టూ ఉన్న గోడలను, పునాదులను తవ్వి చూశారు. విగ్రహం కింద ఏవైనా పైపులు లేదా రంధ్రాలు ఉన్నాయేమోనని శోధించారు. కానీ, చుట్టుపక్కల మట్టిలో కనీసం మద్యం తేమ గానీ, వాసన గానీ వారికి లభించలేదు. అంత మద్యం ఎక్కడికి వెళ్తుందనేది ఇప్పటికీ ఒక మిస్టరీ.

భక్తుల సౌకర్యార్థం 24 గంటల దుకాణాలు

ఈ వింత ఆచారం కారణంగా ఆలయ పరిసరాల్లో అబ్కారీ శాఖ అనుమతితో 24 గంటలూ నడిచే మద్యం దుకాణాలు ఉంటాయి. ఇక్కడ పూజా సామాగ్రితో పాటు అన్ని రకాల బ్రాండ్ల మద్యం లభిస్తుంది. కేవలం పురుషులే కాకుండా, మహిళలు సైతం లైన్లలో నిలబడి స్వామివారి కోసం మద్యాన్ని కొనుగోలు చేయడం ఇక్కడి విశేషం. సుమారు 6,000 సంవత్సరాల పురాణ చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని మరాఠాల కాలంలో పునర్నిర్మించారు. భగవంతుని లీలలను సైన్స్ ఎల్లప్పుడూ నిరూపించలేదనడానికి ఉజ్జయినీ కాలభైరవ ఆలయమే ఒక నిదర్శనం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story