Tulsidas Hanuman Chalisa: తులసీదాస్‌ హనుమాన్‌ చాలీసా రహస్యం...భగవంతుని లీలలు ఇలానే తెలుస్తాయి

సనాతన హిందూ సాంప్రదాయంలో హనుమాన్ చాలీసాకు ఉన్న శక్తి అపారం. నిత్యం భక్తితో ఈ 40 శ్లోకాలను పఠించే భక్తుల ఇళ్లలో కష్టాలు కూడా మంచులా కరిగిపోతాయి.

Balachander
Published on: 19 May 2026 9:59 AM IST
Tulsidas Hanuman Chalisa: తులసీదాస్‌ హనుమాన్‌ చాలీసా రహస్యం...భగవంతుని లీలలు ఇలానే తెలుస్తాయి
X

Tulsidas Hanuman Chalisa: సనాతన హిందూ సాంప్రదాయంలో హనుమాన్ చాలీసాకు ఉన్న శక్తి అపారం. నిత్యం భక్తితో ఈ 40 శ్లోకాలను పఠించే భక్తుల ఇళ్లలో కష్టాలు కూడా మంచులా కరిగిపోతాయి. అయితే, కోట్లాది మంది నోళ్లలో నానిన ఈ దివ్య స్తోత్రం వెనుక ఒక ఒళ్లు గగుర్పొడిచే చారిత్రక సత్యం, ఒక పరమ భక్తుని ఆర్తి దాగి ఉన్నాయి. మహాకవి తులసీదాస్ ఈ చాలీసాను ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో కూర్చుని రాయలేదు. ఢిల్లీ సుల్తాన్ అక్బర్ చెరసాల చీకటి గదుల్లో, ఇనుప సంకెళ్ల మధ్య ప్రాణం పోసుకున్న అద్భుత సృష్టి ఇది. దీని గురించి ఎంత గొప్పగా తెలుసుకుంటే అంత గొప్పగా మన భక్తి ఆ రామబంటుపై నిలుస్తుంది. మన జీవితంలో నెలకొన్న సంకటాల సంకెళ్లు ఒక్కొక్కటిగా తెగిపోతాయి.

రాజాజ్ఞను ధిక్కరించిన రామభక్తుడు

మహాకవి తులసీదాస్ 'శ్రీరామచరిత మానస్' గ్రంథాన్ని రచించి దేశవ్యాప్తంగా అపారమైన కీర్తిని గడించారు. ఈ కీర్తిని చూసి కొందరు అసూయపరులు మొఘల్ చక్రవర్తి అక్బర్‌కు తులసీదాస్‌పై లేనిపోని మాటలు చెప్పారు. దాంతో అక్బర్ ఆయన్ను తన ఆస్థానానికి పిలిపించి, "రాముడిని కీర్తించినట్లే, నాపై కూడా ఒక ప్రశంసా కావ్యం రాయి" అని కోరాడు. దానికి తులసీదాస్ సగర్వంగా నిరసించారు. "రామనామాన్ని స్తుతించిన నా కలం, ఏ భౌతిక మానవుడిని ప్రశంసించలేదు" అని కుండబద్దలు కొట్టారు. రాజాజ్ఞను ధిక్కరించినందుకు అక్బర్ ఆగ్రహించి ఆయన్ను కఠినమైన జైలు శిక్షకు గురిచేశాడు.

చెరసాలలో పుట్టిన 40 శ్లోకాల వజ్రాయుధం

జైలులో అనుభవించిన ఆ కఠిన బాధల నుండి విముక్తి కోసం, తనను రక్షించమని రామబంటు అయిన ఆంజనేయుడిని వేడుకుంటూ తులసీదాస్ పరమ ఆర్తితో 40 ద్విపద శ్లోకాలను ఆశువుగా రచించారు. అదే మన "హనుమాన్ చాలీసా". ఆ ఇనుప కటకటాల వెనుక కూర్చుని ఆయన ఈ 40 శ్లోకాలను నిత్యం పఠించడం ప్రారంభించారు.

అక్బర్ ఆస్థానాన్ని ముట్టడించిన వానర సైన్యం

ఈ శ్లోకాల మహిమ అక్బర్ చెవిన పడటంతో, తులసీదాస్‌ను ఆస్థానానికి పిలిపించి ఆ చాలీసాను చదివి వినిపించమన్నాడు. తులసీదాస్ కళ్లు మూసుకుని, భక్తి పారవశ్యంతో హనుమాన్ చాలీసాను ఆలపించడం ప్రారంభించారు. అంతే! ఒక్కసారిగా ప్రకృతి స్తంభించిపోయింది. ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు... వందలాది, వేలాది కోతులు మొఘల్ కోటను, అంతఃపురాన్ని ముట్టడించాయి.

అక్కడ ఉన్న సైనికుల ఆయుధాలను లాక్కొని, అక్బర్ ఆస్థానాన్ని హల్చల్ చేశాయి. అక్కడ ఉన్నవారంతా భయంతో వణికిపోయారు. అది ఆంజనేయుని లీల అని గ్రహించిన అక్బర్, వెంటనే తులసీదాస్ కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. తన తప్పును క్షమించమని వేడుకుంటూ ఆయన్ను సగౌరవంగా విడుదల చేశాడు. భయాలను పోగొట్టి, శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే హనుమాన్ చాలీసా పుట్టుక వెనుక ఉన్న రహస్యం ఇది. ఎవరైతే ఈ 40 శ్లోకాలను నిత్యం నమ్మకంతో పఠిస్తారో, వారి పక్కనే హనుమయ్య రక్షగా నిలుస్తాడనేది అక్షర సత్యం. మనం కూడా నిత్యం హనుమాన్‌ చాలీసాను పఠిద్దాం. ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story