True Faith in God: భగవంతుడిని సంపూర్ణంగా నమ్ముతున్నారా... ఈ కథే జీవితంలో మార్పు తెస్తుంది
భగవంతుడిని సంపూర్ణంగా విశ్వసించిన వారికి ఆయన తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాడు అనడానికి ఈ కథే ఓ నిదర్శనం. గీతలో చెప్పిన శ్లోకాన్ని ఓ వైద్యుడు తూచా తప్పకుండా పాటించాడు.
True Faith in God: మన హృదయంలో భగవంతుడి పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంటే, ఆయన మన యోగక్షేమాలను ఎలా చూసుకుంటాడో వివరించే అద్భుతమైన సన్నివేశాలు సనాతన ధర్మంలో ఎన్నో ఉన్నాయి. మన కోరికలు గుర్రాల లాంటివి. ఒక ఆశ నెరవేరగానే మరొకటి పుట్టుకొస్తుంది. కానీ, భగవద్గీతలోని 9వ అధ్యాయం 22వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ "అనన్యాశ్చింతయంతో మాం... యోగక్షేమం వహామ్యహం" అంటూ ఒక దివ్య హామీ ఇచ్చారు. అంటే తననే నమ్మి, అహంకారాన్ని వదిలి శరణు కోరిన భక్తుల బాధ్యతను ఆయనే స్వయంగా మోస్తానని అర్థం. ఈ సూత్రాన్ని తన జీవితాంతం తూచా తప్పకుండా పాటించిన ఒక వైద్యుడి సత్య కథ ప్రతి ఒక్కరిలోనూ భక్తిభావాన్ని, విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
వైద్యుడి సత్య నిష్ఠ... నిస్వార్థ జీవనం
ఉత్తర భారతదేశంలో అత్యవసర చికిత్స అందించే వైద్యుడు ఉండేవాడు. ఆయనకు కృష్ణ భగవానుడిపై అమితమైన భక్తి. గీతా వాక్యాన్ని తన ఊపిరిగా భావించేవాడు. ఆయనకు భార్య, ఒక కూతురు ఉన్నారు. రోజూ ఉదయాన్నే ఆయన భార్య ఆ రోజు ఇంటి ఖర్చులకు ఎంత కావాలో ఒక చీటీపై రాసి ఇచ్చేది. ఉదాహరణకు ఆ రోజుకు 200 రూపాయలు అవసరమైతే, రోగుల నుండి కేవలం అంతవరకే ఫీజుగా తీసుకునేవాడు. ఆ రోజుకు కావలసిన ఆ మొత్తం సమకూరగానే, ఆ తర్వాత వచ్చే ఎంతమంది రోగులకైనా ఉచితంగానే వైద్యం చేసి పంపేవాడు. "రేపటి సంగతి ఏమిటి?" అని ఆయన ఏనాడూ ఆందోళన పడలేదు. "ఈ రోజు ఇచ్చిన పరమాత్మ రేపు కూడా ఇస్తాడు, ఆయన దయామయుడు" అని విశ్వసించేవాడు.
15 ఏళ్ల తర్వాత జరిగిన దివ్య లీల
ఇలా దాదాపు 15 సంవత్సరాలు గడిచిపోయాయి. కాలం మారినా, ఖర్చులు పెరిగినా ఆయన తన నియమాన్ని వీడలేదు. ఒక రోజు ఆయన ఇంటి ముందు ఒక విలాసవంతమైన కారు వచ్చి ఆగింది. అందులో నుండి దిగిన ఒక వ్యక్తి వినయంగా నమస్కరించి, వైద్యుడిని గుర్తుపట్టారా అని అడిగాడు. 15 ఏళ్ల క్రితం తన కారు పాడైపోవడంతో ఈ ఇంటి ముందు ఆగానని, అప్పుడు మీరు నన్ను సాధరంగా ఆహ్వానించి, పిల్లలు లేని నాకు ఒక పవిత్రమైన మందు ఇచ్చారని గుర్తుచేశాడు. ఆ వైద్యం ఫలించి తనకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారని, మీ రుణం తీర్చుకోవడానికి విదేశాల నుండి ఇప్పుడు వచ్చానని చెప్పాడు. నాటి మీ చిన్న కూతురి పెళ్లి ఖర్చుల కోసం తాను నిధులు తెచ్చానని చెబుతూ ఒక భారీ డబ్బుల సంచీని అక్కడ ఉంచి వెళ్లిపోయాడు. అదే సమయంలో వైద్యుడు తన భార్య ఇచ్చిన ఆనాటి చీటీని తెరిచి చూశాడు. అందులో ఆ రోజు ఖర్చులతో పాటు చివర్లో ఒక మాట రాసి ఉంది: "మన అమ్మాయి పెళ్లి దగ్గరపడింది, మన దగ్గర 100 రూపాయలు కూడా లేవు... ఆలోచించండి" అని. తన బిడ్డ పెళ్లికి కావలసిన డబ్బును ఉచితంగా చికిత్స పొందిన వ్యక్తి ఇచ్చేసి వెళ్లాడు. తనను నమ్మిన భక్తుడి మానాన్ని, మాటను భగవంతుడు ఎలా కాపాడతాడో చెప్పడానికి ఈ ఘటన ఒక నిదర్శనం. భగవంతుడిపై భారం వేసి ధర్మబద్ధంగా జీవిస్తే, మన అవసరాలను ఆయనే సమయానికి తీరుస్తాడు.




