Lord Rama Devotee Story: అక్షరాల ఇది నిజం... వృద్ధజంట రూపంలో భక్తుడిని ఆదుకున్న రాముడి కథ ఇది

Lord Rama Devotee Story:భగవంతుడిపై మనకు అచంచలమైన నమ్మకం ఉంటే చాలు... మనకు అవసరమైన సమయంలో ఎక్కడి నుంచైనా ఏ రూపంలోనైనా సహాయం వస్తుందనే సత్యాన్ని తెలియజేసే అద్భుతమైన సంఘటన ఇది.

Balachander
Published on: 7 April 2026 3:13 PM IST
Lord Rama Devotee Story
X

Lord Rama Devotee Story 

Lord Rama Devotee Story: భగవంతుడిపై మనకు అచంచలమైన నమ్మకం ఉంటే చాలు... మనకు అవసరమైన సమయంలో ఎక్కడి నుంచైనా ఏ రూపంలోనైనా సహాయం వస్తుందనే సత్యాన్ని తెలియజేసే అద్భుతమైన సంఘటన ఇది. కష్టాలు వచ్చినపుడు దేవుడిని నిందించడం సులభం. కానీ, ఆ కష్టాల్లో కూడా ఆయన్ను నమ్మి ముందుకు సాగడమే నిజమైన భక్తి. అలాంటి భక్తికి ప్రతిఫలం ఎలా ఉంటుందో ఈ కథ స్పష్టంగా చెబుతోంది.

వారణాసి రామాలయం కథ

ఉత్తర భారతదేశంలోని పవిత్రమైన వారణాసి నగరంలో ఒక చిన్న రామాలయం ఉండేది. ఆ ఆలయాన్ని అందులోని రాములవారిని నమ్ముకొని ఓ పూజారి కుటుంబం జీవనం సాగించేది. ఆలయానికి వచ్చే ఆదాయం చాలా తక్కువ. వచ్చిన దాంట్లో తృప్తి చెందుతూ రాములవారి ఇచ్చిన దాన్నే ప్రసాదంగా స్వీకరిస్తూ భక్తిభావంతో జీవిస్తున్నారు. వచ్చినదాంట్లో సింహభాగం రాములవారి సేవకే అంకితం చేస్తూ... రాముడే అన్నీ చూసుకుంటాడు అని నమ్మి పూజారి కుటుంబం జీవనం సాగిస్తున్నది. కాలక్రమేణా పూజారి కుమార్తె పెళ్లి వయసుకు వచ్చింది. ఇదే పూజారి జీవితంలో పెద్ద సమస్యగా మారింది. చేతిలో డబ్బు లేదు, ఆస్తి లేదు. కానీ బాధ మాత్రం అపారంగా ఉంది. అయినప్పటికీ ఆయన తన ఆందోళనను ఎవరికీ చెప్పకుండా, ప్రతిరోజూ ఆలయంలో కూర్చొని శ్రీరాముడితో మాట్లాడేవాడు. “నీవే నాకు ఆశ్రయం… ఈ బాధను కూడా నీవే తీర్చాలి” అని ప్రార్థించేవాడు.

వృద్ద దంపతుల రూపంలో రాములవారు సీతాదేవి

ఒక రోజు సాయంత్రం, ఆయన ఇంటి వద్దకు వృద్ధ దంపతులు వచ్చారు. సాదాసీదా దుస్తుల్లో ఉన్న వారు, ఎంతో ప్రశాంతంగా కనిపించారు. తమకు పిల్లలు లేరని, ఎవరికైనా కుమార్తె ఉంటే పెళ్లికి సహాయం చేయాలనుకుంటున్నామని చెప్పారు. పూజారి వెంటనే తన పరిస్థితిని వివరించాడు. వారు చిరునవ్వుతో ఒక చిరునామా కార్డు ఇచ్చి, “ఈ వ్యక్తిని సంప్రదించండి… పెళ్లి ఖర్చుల గురించి ఆలోచించవద్దు” అని చెప్పారు. అదనంగా ఒక టెలిఫోన్‌ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ దంపతుల మాటలపై నమ్మకం ఉంచి పూజారి ఆ చిరునామాకు వెళ్లాడు. పూజారి చెప్పిన విషయాలు విని వివాహం చేయడానికి అంగీకరించారు. అంతేకాదు, ఆశ్చర్యకరంగా, పెళ్లి ఖర్చుల కోసం అవసరమైన డబ్బు సమయానికి అందింది. అన్ని కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పూజారి హృదయం ఆనందంతో నిండిపోయింది.

వచ్చింది సాక్షాత్తు శ్రీరామచంద్రుడే

పెళ్లి పూర్తయ్యాక, ఆ వృద్ధ దంపతులకు కృతజ్ఞతలు చెప్పాలని పూజారి ఫోన్ చేశాడు. కానీ ఫోన్ పనిచేయలేదు. మళ్లీ మళ్లీ ప్రయత్నించినా స్పందన లేదు. ఆశ్చర్యంతో ఆయన పెళ్లికి అంగీకరించిన కుటుంబాన్ని అడిగితే… “అలాంటి వారెవరూ మాకు తెలియదు” అని చెప్పారు. పూజారి ఒక్కక్షణం ఆశ్చర్యపోయాడు. తన కళ్లముందు జరిగింది సాధారణం విషయం కాదని గ్రహించాడు. వెంటనే ఆలయానికి వెళ్లి, శ్రీరాముని విగ్రహం ముందు కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నన్ను ఆదుకోవడానికి స్వయంగా నీవే వచ్చావా తండ్రి అంటూ భక్తితో కృతజ్ఞతలు తెలిపాడు. ఆ వృద్ధ దంపతులు మరెవరో కాదు… సాక్షాత్తు శ్రీ సీతారామచంద్రులే అని అర్థమైంది.

ఈ కథ చెప్పే సందేశం ఒక్కటే

భక్తి అంటే కేవలం ప్రార్థన కాదు… శరణాగతితో కూడిన పూర్తి నమ్మకం. పరిస్థితులు ఎలా ఉన్నా, భగవంతుడిని విడిచిపెట్టకుండా నిలబడగలగడం. మనం నిజంగా ఆయనను నమ్మితే, ఆయన సహాయం తప్పక అందుతుంది. అది మనకు అర్థమయ్యే రూపంలోనే వస్తుంది. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు భయపడకండి… నమ్మకం కోల్పోకండి. ఎందుకంటే, భగవంతుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు… మనం పిలిచే క్షణంలో స్పందిస్తాడు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story