Trimbakeshwar Diamond: బ్రిటీషర్ల చేతికి త్రయంబకేశ్వరుని వజ్రం...మహబూబ్‌ నగర్‌ నుంచి ఇంగ్లాండ్‌ వరకు

సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించేవాడు త్రయంబకేశ్వరుడు. ఆయన కిరీటంలో మకుటంగా వెలసిన నాసిక్‌ వజ్రం కొన్ని కారణాల వలన దేశం సరిహద్దులు దాటి వెళ్లిపోయింది.

Balachander
Published on: 12 Jun 2026 9:37 AM IST
Trimbakeshwar Diamond: బ్రిటీషర్ల చేతికి త్రయంబకేశ్వరుని వజ్రం...మహబూబ్‌ నగర్‌ నుంచి ఇంగ్లాండ్‌ వరకు
X

Trimbakeshwar Diamond: భారతదేశంలో పవిత్రమైన 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో నాసిక్ సమీపంలోని 'త్రయంబకేశ్వరం' అత్యంత విశిష్టమైనది. గోదావరి నది జన్మస్థానమైన ఈ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికతకే కాదు, అపారమైన చారిత్రక సంపదకు కూడా నిలయం. ఒకప్పుడు మన మహబూబ్‌నగర్ మట్టిలో దొరికి... పరమశివుని కిరీటాన్ని అలంకరించిన సుమారు 90 క్యారెట్ల అరుదైన 'నాసిక్ వజ్రం' మూడో ఆంగ్లో-మరాఠా యుద్ధం తర్వాత బ్రిటీషర్ల చేతికి చిక్కి ఇంగ్లాండ్‌కు తరలించబడింది. లండన్ చేరిన మన దేశ సంపదను తిరిగి భారత్‌కు తీసుకురావడానికి ప్రస్తుతం ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ వజ్రం వెనుక ఉన్న చరిత్రను, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ అవతరణ గాథను తెలుసుకుందాం.

మహబూబ్‌నగర్ టు ఇంగ్లాండ్ ... 90 క్యారెట్ల వజ్రపు కథ

నాసిక్ నగరానికి కేవలం 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రయంబకేశ్వర ఆలయంలో ప్రతి సోమవారం మధ్యాహ్నం అభిషేకం అనంతరం స్వామివారికి విశేష అలంకరణ చేస్తారు. ద్వాపర యుగంలో పాండవులు సమర్పించారని నమ్మే బంగారు కిరీటాన్ని, వజ్ర వైడూర్యాలు పొదిగిన వెండి తొడుగును ఈ సందర్భంగా ఈశ్వరుడికి ధరింపజేస్తారు. పూర్వం ఈ కిరీటంలోనే నీలి రంగు కాంతితో మెరిసే 90 క్యారెట్ల ప్రసిద్ధ 'నాసిక్ వజ్రం' ఉండేది. తెలంగాణలోని మహబూబ్‌నగర్ ప్రాంతంలో లభించిన ఈ దివ్య మణిని నాటి రాజులు భక్తితో స్వామివారికి కానుకగా ఇచ్చారు. అయితే, బ్రిటీషర్లు భారతీయుల నమ్మకాలను, సంపదను దోచుకునే క్రమంలో ఈ అపురూప వజ్రాన్ని ఇంగ్లాండ్‌కు తరలించారు.

జ్వాలాస్తంభం టు జ్యోతిర్లింగం .. పురాణ గాథ

శివపురాణం ప్రకారం, సత్యయుగంలో బ్రహ్మ, విష్ణువుల మధ్య 'ఎవరు గొప్ప' అనే వివాదం చెలరేగింది. వారి అహంకారాన్ని అణచడానికి పరమశివుడు ఆది అంతం లేని ఒక అఖండ జ్వాలాస్తంభంగా అవతరించాడు. ఆ స్తంభం మొదలును చూడటానికి విష్ణుమూర్తి వరాహ రూపంలో భూమిలోకి, కొనను చూడటానికి బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆకాశంలోకి వెళ్లారు. సత్యం తెలుసుకోలేక అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుడిని భూలోకంలో పూజలు లేకుండా శివుడు శపించాడు. నాడు విష్ణువు కోరిక మేరకు విశ్వంలో వెలసిన 64 జ్యోతిర్లింగాలలో, ఆదిశంకరాచార్యుల చేత 12 ప్రధాన లింగాలుగా స్తుతించబడిన వాటిలో త్రయంబకేశ్వరం కూడా ఒకటి.

బ్రహ్మగిరి పర్వతం... ఏకైక విశిష్ట పూజలు

సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని బ్రహ్మగిరి కొండ పాదాల వద్ద ఈ ఆలయం ఉంది. ఇక్కడి గోముఖం నుండి బొట్టుబొట్టుగా గోదావరి నది ఉద్భవించి ప్రవహిస్తుంది. ఈ ఆలయంలో కొన్ని విశేషమైన పూజలు జరుగుతాయి. అందులో ఒకటి నారాయణ నాగబలి పూజ. పితృదోష, వంశవృద్ధి, అకాల ఆరోగ్య సమస్యల నివారణ కోసం ఈ పూజలు చేస్తారు. ఇక కాలసర్ప, మృత్యుంజయ హోమం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహిస్తారు. జాతక దోషాల్లో సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి కాలసర్ప, మృత్యుంజయ హోమం జరిపిస్తుంటారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story