Tirumala Netra Darshanam: తిరుమల వెళ్తున్నారా...శ్రీవారిని ఇలా దర్శించుకున్నవారిదే అదృష్టం..ఎవరైనా ఇలా చేశారా?

తిరుమలలో గురువారం మాత్రమే లభించే శ్రీవారి నేత్ర దర్శనం విశిష్టత ఏమిటి? ఆభరణాలు లేకుండా, కిరీటం లేకుండా స్వామివారి నిజరూప దర్శనం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటో తెలుసుకుందాం.

Balachander
Published on: 24 Jun 2026 9:32 AM IST
Tirumala Netra Darshanam: తిరుమల వెళ్తున్నారా...శ్రీవారిని ఇలా దర్శించుకున్నవారిదే అదృష్టం..ఎవరైనా ఇలా చేశారా?
X

Tirumala Netra Darshanam: కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రం నిత్యకళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఆ కోనేటిరాయుడిని దర్శించుకుని తరిస్తుంటారు. సాధారణంగా శ్రీనివాసుడు రకరకాల పూలమాలలు, కోట్లాది రూపాయల విలువైన స్వర్ణాభరణాలతో అలంకారప్రియుడిగా భక్తులకు సాక్షాత్కరిస్తాడు. అయితే, సర్వాభరణ భూషితుడైన స్వామివారిని కాకుండా, ఎలాంటి ఆభరణాలు లేని ఆయన ‘నిజరూపాన్ని’, మోహన నేత్రాలను దర్శించుకోవడం అత్యంత అరుదైన అదృష్టం. వారంలో కేవలం ఒక్క గురువారం నాడు మాత్రమే లభించే ఈ విశేష దర్శనం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం, ఆ విశిష్టతలేంటో తెలుసుకుందాం.

గురువారం నాటి విశేషాలు ...నేత్ర దర్శన భాగ్యం

గురువారం వేకువజామున జరిగే రెండవ అర్చన తర్వాత శ్రీవారి మూలవిరాట్టును అత్యంత నిరాడంబరంగా, ఏకాంత రూపంలో సిద్ధం చేస్తారు. ఆ సమయంలో స్వామివారి అలంకరణలో మూడు ప్రధాన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇందులో మొదటిది నేత్ర దర్శనం. స్వామివారి నొసటన నిత్యం పెద్దగా ఉండే పచ్చకర్పూరపు నామాన్ని గురువారం నాడు బాగా తగ్గిస్తారు. నామం పరిమాణం తగ్గడం వల్ల, అప్పటివరకు దాగి ఉన్న స్వామివారి దివ్య నేత్రాలు భక్తులకు స్పష్టంగా కనిపిస్తాయి. విశ్వాన్ని వీక్షించే ఆ కళ్లను చూడటమే ‘నేత్ర దర్శనం’. రెండోది కిరీటంలేని రూపం. గురువారం నాడు స్వామివారికి స్వర్ణ కిరీటధారణ ఉండదు. దానికి బదులుగా శ్రీవారి తల చుట్టూ పట్టువస్త్రాన్ని చుడతారు. దీనిని పరివీటం లేదా పరివేష్ఠనం అంటారు. ఇక ముచ్చటగా మూడోది ఆభరణాల తొలగింపు. గురువారం రోజున శ్రీవారి ఒంటిపై ఉండే నగలన్నింటినీ తీసివేస్తారు. కేవలం పట్టుధోవతిని కట్టి, పైపైన పల్లేవాటు వేస్తారు. మెడలో కేవలం కంటెలను మాత్రమే ఉంచి, బుగ్గన పచ్చకర్పూరపు చుక్కను దిద్దుతారు. ఇలా మూడు మార్పులు చోటు చేసుకున్న ఆ స్వామిని దర్శించుకుంటే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదని అంటారు. మిగతారోజుల కంటే తిరుమలలో గురువారానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.

నిరాడంబర రూపంలో జగన్నాథుడు

ఆడంబరాలన్నీ పక్కన పెట్టి, కేవలం పట్టువస్త్రాలతో, చిరునవ్వులు చిందించే నగుమోముతో శ్రీవారు దర్శనమిచ్చే ఈ రూపం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. గురువారం రోజంతా స్వామివారు ఇదే నేత్ర దర్శన రూపంలో భక్తులకు కటాక్షిస్తారు. సకల ఆభరణాలను తీసివేసినా సరే, ఆ నిరాడంబర రూపంలోనే స్వామివారు కోటి సూర్యప్రభలతో వెలిగిపోతుంటారు. తిరుమల వెళ్లే భక్తులు గురువారం నాడు లభించే ఈ అపురూప నేత్ర దర్శన భాగ్యాన్ని అస్సలు వదులుకోవద్దు. ఈ రూపాన్ని ఒక్కసారి కళ్లారా చూస్తే చాలు, జీవితంలోని కష్టాలన్నీ తీరిపోతాయని భక్తుల నమ్మకం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story