Tirumala Darshan: శ్రీవారిని ఇలా దర్శించుకుంటేనే... ఆ భాగ్యం కలుగుతుంది
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అంటే మూల మూర్తిని చూసేసి మొక్కులు చెల్లించుకొని రావడం కాదు. ఇలా దర్శనం చేసుకుంటేనే స్వామివారి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
Tirumala Darshan: తిరుమల గర్భాలయంలో దివ్య మంగళకరంగా కొలువుదీరిన ఆ శ్రీనివాసుడి మూలమూర్తిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం. ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు ఆ బ్రహ్మాండ నాయకుడిని చూసి తరించేందుకు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటారు. అయితే, ఆ స్వామిని కేవలం కళ్లతో చూడటం మాత్రమే సరిపోదు. ఆయన దివ్య రూపం వెనుక దాగున్న ఆధ్యాత్మిక సత్యాలను, ఆత్మజ్ఞాన భాండాగారాన్ని హృదయంతో అర్థం చేసుకోవాలి. శ్రీవారి ప్రతి అంగమూ మానవాళిని తరింపజేసేందుకు ఒక దివ్య సందేశాన్ని అందిస్తుంది. ఆ స్వామి దివ్య రూపాన్ని ఏ విధంగా దర్శించుకోవాలో, ఎలా అర్థం చేసుకోవాలో పండితులు వివరించిన అమూల్యమైన విషయాలను తెలుసుకుందాం.
వరద హస్తం... శరణాగతి మంత్రం
స్వామివారి కుడిచేయి క్రిందికి, తన దివ్య పాదాల వైపు చూపుతూ ఉంటుంది. దీని అంతరార్థం ఏంటంటే... "నా పాదాలను ఆశ్రయించండి, మిమ్మల్ని ఈ సంసార సాగరం నుండి గట్టెక్కిస్తాను" అని అభయమివ్వడమే. సాధారణంగా మానవ జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సంసార తాపత్రయాలు మహాసముద్రమంత పెద్దవిగా అనిపిస్తాయి. కానీ, ఆ శ్రీనివాసుడి శ్రీచరణాలను గట్టిగా పట్టుకుంటే, ఆ భవసాగరం మోకాళ్ల లోతుకు తగ్గిపోతుందని స్వామి తన హస్తముద్రతో హామీ ఇస్తున్నారు.
కటి హస్తం... జీవాత్మ లయం
స్వామివారి ఎడమచేయి నాభి క్రింది భాగాన్ని చూపుతూ ఉంటుంది. ప్రాణవాయువును నాభి కింద ఉన్న మూలాధార చక్రం నుండి ఊర్థ్వముఖంగా తీసుకొని వెళ్లి, సహస్రార చక్రంలో లయం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. పామరులైన సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే... తన పాదాలను శరణు కోరిన భక్తులను స్వామి తన అక్కున చేర్చుకొని, వారి అంతరంగంలో ఉన్న దివ్య శక్తిని జాగృతం చేస్తారని దీని అర్థం.
త్రిమూర్తులు ఇమిడిన తిరునామం
సూర్యుడు, చంద్రుడు, సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు స్వామివారి నుదుటిపై ఉన్న పవిత్రమైన నామంలోనే ఇమిడి ఉన్నారు. ఈ తిరునామాన్ని చూసినంతనే మనిషిలోని అజ్ఞానం తొలగి, ఆధ్యాత్మిక వెలుగు నిండుతుంది. అందుకే స్వామివారి నామాన్ని దర్శించుకునేందుకు భక్తులు తహతహలాడుతుంటారు. కన్నులార ఆయన నామాన్ని చూసి తరించిపోతుంటారు. అంతేకాదు, స్వామి చేతిలోని సుదర్శన చక్రం మనిషిని వెన్నంటే ఉండే ప్రారబ్ద కర్మలనే శత్రువులను సంహరిస్తుంది. అజ్ఞానాన్ని నశింపజేసి భక్తుడికి పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.
మనలోని చక్రాల జాగరణ
తిరుమలేశుడి సన్ముఖంలో నిలబడినప్పుడు ఆయన శిరస్సు నుండి పాదాల వరకు ప్రతి భాగాన్ని మనసులో ధ్యానించాలి. స్వామివారి రూపాన్ని స్మరించుకోవడం వల్ల మన శరీరంలోని షట్చక్రాలు జాగృతమవుతాయని వేద పండితులు చెబుతున్నారు.కలియుగంలో భక్తులను కంటికి రెప్పలా కాపాడేందుకు వెంకటాద్రిపై నిలిచిన ఆ వేంకటేశ్వరుని రూపాన్ని ఈ ఆంతరంగిక జ్ఞానంతో దర్శించుకున్నప్పుడే, దర్శనం పరిపూర్ణమవుతుంది. జన్మ ధన్యమవుతుంది.




