Chandi Mata Temple Mystery: ఈ ఆలయాన్ని మనుషులు కాదు...చీమలే నిర్మించాయి...
దేశంలో అత్యంత రహస్యమైన ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని చండీమాత ఆలయం. ఈ ఆలయాన్ని అమ్మవారి పర్యవేక్షణలో చీమల నమూనాతో నిర్మించబడినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. పిల్లలు లేనివారికి ఇది పుత్రసౌభాగ్యాన్ని కలిగిస్తోంది.
Chandi Mata Temple Mystery: భారతదేశంలో ఎన్నో మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కానీ, హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక దివ్యాలయం గురించి తెలిస్తే మాత్రం ఎవరైనా సరే ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకోవాల్సిందే! ఎందుకంటే, అక్కడ కొలువైన చండీమాత విగ్రహాన్ని గానీ, ఆలయ నమూనాను గానీ మనుషులు చెక్కలేదు... కోట్లాది చీమలు కలిసి ఆ తల్లి విగ్రహాన్ని, ఆలయ ప్లాన్‌ను నిర్మించాయి. హిమగిరుల్లోని కర్సోగ్ కొండల్లో వెలిసిన ఈ ‘చండీమాత ఆలయం’ అంతుచిక్కని ఒక దైవిక రహస్యం. మరి ఈ దైవిక రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందామా.
చీమలు గీసిన నమూనా ... అమ్మవారి పర్యవేక్షణ
సిమ్లా వెళ్లే మార్గంలో కర్సోగ్ అనే ప్రాంతం నుండి 13 కిలోమీటర్ల లోపలికి వెళ్తే దట్టమైన కొండల మధ్య ఈ చండీమాత క్షేత్రం కనిపిస్తుంది. స్థానిక కథనాల ప్రకారం... పూర్వం అమ్మవారు స్వయంగా ఒక చిన్న కన్య రూపంలో ఇక్కడ సాక్షాత్కరించింది. ఆ సమయంలో కోట్లాది చీమలు కలిసి ఒకచోట చేరి, ఎనిమిది చేతులతో మహిమాన్వితంగా ఉండే చండీమాత రూపాన్ని, ఆలయ నమూనాను తయారు చేశాయి. ఆ తరువాత అమ్మవారు ఆ ఆలయ ప్రధాన పూజారి కలలోకి వచ్చి, చీమలు సిద్ధం చేసిన ఆ నమూనా ప్రకారమే ఆలయాన్ని, పక్కనే ఉన్న కోనేరును నిర్మించాలని ఆదేశించింది. అలా అమ్మవారి ప్రత్యక్ష పర్యవేక్షణలోనే ఈ దివ్యాలయం రూపుదిద్దుకుంది.
ఆలయ విశిష్టత ... సంతాన భాగ్య ప్రదాత
ఈ ఆలయం పూర్తిగా హిమాలయ సాంప్రదాయ శైలిలో, అద్భుతమైన చెక్క నైపుణ్యంతో నిర్మించబడింది. బయటి నుండి చూస్తే ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ ఆలయ పైకప్పులపై అనేక దేవతా మూర్తుల ప్రతిమలు కొలువై ఉన్నాయి. సంతానం లేక దశాబ్దాలుగా అల్లాడిపోయే దంపతులు ఈ ఆలయానికి వచ్చి, అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే దేశవిదేశాల నుండి వేలాది మంది దంపతులు ఇక్కడికి వస్తుంటారు.
రాజును హెచ్చరించిన అమ్మవారి ఆగ్రహం
గతంలో సుకేత్ సామ్రాజ్యానికి చెందిన లక్ష్మణ్ సేన్ అనే రాజు, ఈ విగ్రహ మహిమను చూసి ఆ విగ్రహాన్ని రాజధాని అయిన సుందర్ నగర్‌కు తరలించాలని ప్రయత్నించాడు. కానీ, విగ్రహాన్ని ఆలయ సరిహద్దు దాటించగానే... ఆ అద్భుత రూపం ఒక్కసారిగా నల్లగా మారిపోయింది! అంతేకాదు, అమ్మవారి ఆగ్రహం వల్ల ఆ రాజు అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. తప్పు తెలుసుకున్న రాజు, అమ్మవారికి క్షమాపణలు చెప్పి విగ్రహాన్ని యథాస్థానంలో ఉంచడంతోనే ఆయనకు ప్రాణభిక్ష లభించింది. మనుషుల అహంకారాన్ని అనిచి, ప్రకృతిలోని చిన్న జీవుల ద్వారా తన ఉనికిని చాటుకున్న చండీమాత దర్శనం జన్మధన్య జేస్తుంది. హిమాచల్ ప్రదేశ్ వెళ్లినవారు తప్పకుండా దర్శించవలసిన ఆలయాల్లో ఇది ప్రధానమైనది.




