Srirangam Temple: భక్తి ఇంతలాఉంటే... భగవంతుడే దిగొస్తాడు...శ్రీరంగమే సాక్ష్యం
భక్తి ఎంత గొప్పగా ఉండాలి అంటే శ్రీరంగంలోని తిరుపణ్ణాళ్వార్లా ఉండాలని చెబుతారు. భక్తి హృదయంలో స్థాణువులా ఉంటే చాలు... గర్భాలయంలోని శిలారూపంలో ఉన్న భగవంతుడు కరిగిపోయి భక్తుడిని చేరుకుంటాడు.
Srirangam Temple: భూలోక వైకుంఠంగా పూజలందుకుంటున్న శ్రీరంగం దివ్యక్షేత్రంలో భగవంతుడికి, భక్తుడికి మధ్య ఉన్న బంధాన్ని చాటే ఒక దివ్య లీల నేటికీ భక్తుల హృదయాలను తరింపజేస్తోంది. రంగనాథుని సుప్రభాత సేవలో భాగంగా ఏనుగు, తెల్లని అశ్వం, నల్లని ఆవును స్వామివారికి చూపుతూ నిద్రలేపడం ఇక్కడ తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. అయితే, ఆడంబర పూజల కంటే నిశ్చలమైన, నిర్మలమైన ప్రేమానురాగాల భక్తికే శ్రీరంగనాథుడు వశమవుతాడని నిరూపించే సంఘటనే 12 మంది ఆళ్వార్లలో ఒకరైన తిరుపణ్ణాళ్వార్ జీవిత చరిత్ర.
కావేరీ తీరంలో జరిగిన పొరపాటు ... స్వామికి గాయం!
పూర్వకాలంలో శ్రీరంగం ఆలయ ప్రధాన అర్చకుడిగా 'లోకసారంగముని' ఉండేవారు. ఒకరోజు ఉదయాన్నే స్వామివారి అభిషేకం కోసం కావేరీ నది నుండి నీటిని తెచ్చేందుకు వేగంగా వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఒక యువకుడు బాహ్యస్మృతి మరచి, హృదయంలో రంగనాథుడిని ధ్యానిస్తూ నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు. ఎంత పిలిచినా పక్కకు తప్పుకోకపోవడంతో, అభిషేక సమయం మించిపోతుందనే ఆగ్రహంతో లోకసారంగముని చిన్న రాయితో ఆ యువకుడి తలపై కొట్టారు. ఆ దెబ్బకు తల పగిలి రక్తం కారింది. నీటి బిందెతో ఆలయానికి చేరుకున్న అర్చకులు స్వామివారికి అభిషేకం చేయగా, ఆ జలం ఎర్రగా మారింది. రంగనాథుని శిరస్సు వెనుక భాగం నుంచి రక్తం ధారగా కారుతుండటం చూసి అర్చకులు దిగ్భ్రాంతి చెందారు. నిష్కల్మషమైన భక్తుడిని గాయపరచడం వల్లే భగవంతుడే ఆ దెబ్బను తనపై వేసుకున్నాడని గ్రహించిన లోకసారంగముని, పశ్చాత్తాపంతో దళితవాడ వైపు పరుగు తీశారు.
ముని వాహన సేవ .... గర్భాలయ ప్రవేశం
భయంతో వణుకుతున్న ఆ భక్తుడి వద్దకు వెళ్లిన లోకసారంగముని, ఎలాంటి సందేహం లేకుండా తిరుపణ్ణాళ్వార్ను తన భుజాలపై ఎక్కించుకుని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. ఒక ప్రధాన అర్చకుడే తన భుజాలపై దళిత భక్తుడిని మోస్తూ రావడం చూసి ప్రజలంతా ఆశ్చర్యపోయారు. భుజాలపై ఉన్న భక్తుడిని గర్భాలయంలోకి తీసుకెళ్లి స్వామివారి ముందు నిలబెట్టగానే, శ్రీరంగనాథుని తల నుండి రక్తం కారడం తక్షణమే ఆగిపోయింది. లోకసారంగముని అనే ముని వాహనంగా మారి భక్తుడిని మోసుకొచ్చిన ఈ సంఘటనే శ్రీరంగంలో 'ముని వాహన సేవ'గా ప్రసిద్ధి చెందింది. స్వామివారి దివ్య మంగళ రూపాన్ని కన్నులారా దర్శించిన తిరుపణ్ణాళ్వార్, మైమరచి పరమాత్మపై 10 అద్భుతమైన పాశురాలను రచించారు. ఈ పాశురాలనే నేటికీ శ్రీరంగ ఆలయంలో 'అమలనాధిపిరాన్' పేరుతో అత్యంత భక్తిశ్రద్ధలతో పఠిస్తారు. తనను నమ్మిన భక్తుడికి ఆపద వస్తే భగవంతుడే ఆ బాధను భరిస్తాడని, కులమతాలకు అతీతంగా కేవలం భక్తి మాత్రమే పరమాత్మను చేరుస్తుందని ఈ దివ్య కథనం నిరూపిస్తోంది.




