Hindu Festivals: సెప్టెంబర్ 2026ః వినాయక చవితితో పాటు పండుగులు, పర్వదినాలు ఇవే
సెప్టెంబర్ 2026లో శ్రావణమాసం ముగింపుతో పాటు గణపతి నవరాత్రులు కూడా ప్రారంభం అవుతాయి. అదేవిధంగా ఈ మాసం ముగింపులో పితృపక్షాలు ప్రారంభం అవుతాయి.
Hindu Festivals: హిందూ విశ్వాసాల ప్రకారం సెప్టెంబర్ 2026 మాసం అత్యంత పవిత్రమైన పర్వదినాలకు, వ్రతాలకు వేదికగా నిలుస్తోంది. ముఖ్యంగా భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితితో పాటు ఏకాదశి వ్రతాలు, ప్రదోష పూజలు, పౌర్ణమి మహోత్సవాలు ఈ నెల ఆధ్యాత్మిక శోభను రెట్టింపు చేయనున్నాయి. శ్రావణ అమావాస్యతో ప్రారంభమై భాద్రపద పౌర్ణమి వరకు సాగే ఈ పవిత్ర రోజుల్లో దైవారాధన చేయడం వల్ల సకల విఘ్నాలు తొలగి, శ్రేయస్సు కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక ఈ సెప్టెంబర్ 2026లో రానున్న ముఖ్యమైన ఆధ్యాత్మిక పండుగలు, పర్వదినాలు, జాతీయ దినోత్సవాల సమగ్ర జాబితాను తెలుసుకుందాం.
మొదటి వారం... ఆధ్యాత్మిక వ్రతాలు, పర్వదినాలు
సెప్టెంబర్ 4 శుక్రవారం రోజున కాలాష్టమి, మాసిక కృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటారు. ఈరోజు కాలభైరవుడితో పాటు శ్రీకృష్ణుడి జన్మదినాన్ని కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇక సెప్టెంబర్ 5 శనివారం రోజున గురుపూజోత్సవం లేదా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. సెప్టెంబర్ 7 సోమవారం అజ ఏకాదశి. ఈరోజున శ్రీమహావిష్ణువు కృపకోసం పవిత్రమైన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు.
రెండవ వారం... ప్రదోషం నుంచి వినాయక చవితి వరకు
సెప్టెంబర్ 8 మంగళవారం రోజు భౌమ ప్రదోష వ్రతం, కృష్ణ దామోదర ద్వాదశిని జరుపుకుంటారు. ఇక సెప్టెంబర్ 9 బుధవారం రోజున మాస శివరాత్రి. ప్రతిమాసంలో వచ్చే శివరాత్రి రోజున మహాశివుడికి అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక సెప్టెంబర్ 10న అన్వాధానం, సెప్టెంబర్ 11 శుక్రవారం శ్రావణ అమావాస్య. దీంతో శ్రావణమాసం ముగుస్తుంది. సెప్టెంబర్ 12 నుంచి భాద్రపదమాసం ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ 14 సోమవారం వినాయక చవితిని జరుపుకుంటారు. ఈరోజు నుంచే నవరాత్రులు ప్రారంభం అవుతాయి. ఇదే రోజున హిందీ దివస్‌ని కూడా జరుపుకుంటారు.
మూడవ వారం ... కన్యా సంక్రమణం,రాధా అష్టమి
సెప్టెంబర్ 16 బుధవారం రోజున స్కంద షష్టి. బలరామ జయంతి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరోజున ఇతోధికంగా ఆరాధిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కావడి ఉత్సవం కూడా జరుగుతుంది. అంతేకాదు, అదే రోజున బలరామ జయంతిని కూడా విశేషంగా జరుపుకుంటారు. ఇక సెప్టెంబర్ 17 గురువారం కన్యా సంక్రమణం జరుగుతంది. అంటే ఆరోజున సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం. సెప్టెంబర్ 19 శనివారం రోజు మాసిక దుర్గాష్టమి, రాధాష్టమిని జరుపుకుంటారు. శ్రీకృష్ణుడి ప్రియసఖి రాధ జన్మదినం సందర్భంగా శ్రీకృష్ణ ఆలయాల్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు.
నాలుగో వారం.. పౌర్ణమి,సంకష్టహర చతుర్థి
సెప్టెంబర్ 22 మంగళవారం రోజున పార్శ్వ ఏకాదశి, కల్కి ద్వాదశి. పార్శ్వ ఏకాదశి రోజు అంటే శ్రీమహావిష్ణువు శయన ఏకాదశి అనంతరం పక్కకు తిరిగే పవిత్రమైన రోజుగా చెబుతారు. ఇక సెప్టెంబర్ 24 గురువారం ప్రదోష వ్రతం. ఈరోజున మహాశివుడిని షోడశోపచారాలతో పూజిస్తారు. సెప్టెంబర్ 26 శనివారం భాద్రపద పౌర్ణమి. ఈరోజున పౌర్ణమి వ్రతం, పితృదేవతలకు అన్వాధానం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 26 నుంచి పితృపక్షాలు ప్రారంభం అవుతాయి. ఇక సెప్టెంబర్ 27 ఆదివారం ఇష్టి, సెప్టెంబర్ 29 మంగళవారం సంకష్టహర చతుర్థి. ఈరోజున వినాయకుడిని ఇతోధికంగా పూజిస్తారు. విఘ్నాలు తొలగిపోవాలని కోరుకుంటూ ఆరాధిస్తారు. ఈ 30 రోజుల వ్యవధిలో వచ్చే ఏకాదశులు, ప్రదోషాలు, గణేశ నవరాత్రుల పర్వదినాలలో భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు, దానధర్మాలు ఆచరించడం ద్వారా విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది.




