Sanatana Dharma: విజయానికి మూలం ఇక్కడే... సనాతన ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతున్న రహస్యం ఇదే
జీవితంలో విజయం, అపజయం, సుఖదుఃఖాలకు అసలు కారణం సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలే. దీనికి సంబంధించిన రహస్యం, సద్గురువు కృప ప్రాముఖ్యత, సనాతన ధర్మం చెప్పిన విజయ మార్గాన్ని తెలుసుకుందాం.
Sanatana Dharma: ఏ రంగంలో అయినా ఒక వ్యక్తిని మహోన్నతుడిగా నిలబెట్టేది విజయం మాత్రమే. విజయమే అన్నింటికీ కొలమానం. ఈ ప్రపంచం విజేతను మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. అయితే, జీవితంలో విజయాలు అనేవి అంత సులభంగా రావు. ఒకవేళ వచ్చినా దానిని నిలబెట్టుకోవడం కష్టం. సమస్యలు, విజయాలు, అపజయాలు వీటన్నింటకీ మూలం అన్నది ఒకటి ఉంటుంది. ఆ మూలం తెలుసుకోకుండా తాత్కాలిక విజయం లభించినపుడు పొంగిపోవడం, కష్టాలు, అపయజయాలు ఎదురవ్వగానే తల్లడిల్లిపోవడం చేస్తుంటాడు. మన సనాతన ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతున్న పరమ సత్యం ఏమిటంటే... జీవితంలో ఎదురయ్యే ప్రతి సుఖఃదుఖాలకూ, జయఅపజయాలకూ మూలకారణం మనలోనే ఉంది. మన ఆలోచనలు, మన పూర్వజన్మ సుకృత దుష్కృత కర్మలే నేడు సమస్యల రూపంలో మన ముందుకు వస్తాయి. ఈ నిజాన్ని అంగీకరించి, లోపాన్ని మనలోనే వెతుక్కున్న రోజే నిజమైన విజయానికి మొదటి అడుగు పడుతుంది.
కర్మ సిద్ధాంతం... మనకు మనమే సృష్టించుకునే భాగ్యరేఖ
భారతీయ వేదాంతంలో 'కర్మ సిద్ధాంతం' అత్యంత కీలకమైనది. ప్రతి చర్యకూ సమానమైన ప్రతిచర్య ఉంటుందనేది ప్రకృతి నియమం. మనం గతంలో చేసిన పనుల తాలూకు ఫలమే నేడు మన అనుభవంలోకి వస్తుంది. దీనిని అర్థం చేసుకోవడానికి మన శాస్త్రాలు మూడు రకాల కర్మలను పేర్కొన్నాయి. మొదటిది సంచిత కర్మ. అంటే అనంత జన్మల నుంచి మనం కూడబెట్టిన కర్మల నిధి. రెండోది ప్రారబ్ధకర్మ. సంచిత కర్మల నిధి నుంచి ప్రస్తుత జన్మలో మనం అనుభవించడం కోసం తీసుకొచ్చిన భాగం. మనకు లభించే కష్టాలు, నష్టాలు, విజయాలు దీని వలనే కలుగుతాయి. దీనిని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా అర్ధం చేసుకుంటే చాలు. ఇక మూడోది ఆగామి కర్మ. అంటే ప్రస్తుతం మన జీవితంలో మనం విచక్షణను కోల్పోయి చేస్తున్న పనుల వలన భవిష్యత్తు కోసం జమ అవుతున్న కర్మ. ఈ మూడు కాలాల కర్మల చక్రం నుండి బయటపడాలంటే, సమస్యకు మూలం నాలోనే ఉందనే 'ఎరుక' అంటే ఆత్మపరిశీలన చేసుకోవాలి. రోగానికి మూలం తెలిస్తేనే వైద్యుడు సరైన మందు వేయగలడు. అలాగే కష్టాల మూలం మన కర్మలే అని తెలిసినప్పుడు, వాటిని ఎలా అధిగమించాలో సులభంగా అర్థమవుతుంది.
గురుకృపతోనే సర్వసమస్యల నివారణ
మన జీవితం కేవలం మన స్వార్థం కోసమే కాదు, పదిమందికి ఉపయోగపడేలా ‘పరోపకారాయ పుణ్యాయ’ అనే భావనతో జీవించాలి. అన్నింటికంటే ముఖ్యంగా, సద్గురువుల ఆశ్రయం పొందాలి. ఒక పరిపూర్ణ గురువుని ఆశ్రయించి, వారి మార్గదర్శనంలో నడవడం వల్ల మన ప్రారబ్ధ కర్మల తీవ్రత కూడా తగ్గిపోతుంది. అద్దంపై ఉన్న దుమ్మును తుడిస్తేనే ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే సద్గురువుల సాన్నిధ్యంలో మన అంతరంగంలోని మాలిన్యం తొలగిపోయి, ప్రతి సమస్యకూ నిర్మలమైన పరిష్కారం లభిస్తుంది. ధర్మబద్ధమైన జీవితం, సద్గురు కృప తోడైతే ఎలాంటి కష్టాలనైనా దాటి పరమార్థాన్ని, విజయాన్ని అందుకోవడం ఖాయం.




