Roulapalli: సంతానం లేనివారికి..విద్యార్థులకు అమ్మవారు వరం... దర్శించుకున్నవారికే ఆ అదృష్టం

ఒడిశాలోని రౌలపల్లి అష్టభుజ దుర్గాదేవి ఆలయం సంతాన భాగ్యం, విద్యా విజయం, వ్యాపారాభివృద్ధి కోరుకునే భక్తులకు ప్రసిద్ధి. ఈ పవిత్ర క్షేత్ర విశేషాలు, పూజా విధానాలు, ఉత్సవాల గురించి తెలుసుకుందాం.

Balachander
Published on: 3 July 2026 12:13 PM IST
Roulapalli: సంతానం లేనివారికి..విద్యార్థులకు అమ్మవారు వరం... దర్శించుకున్నవారికే ఆ అదృష్టం
X

Roulapalli: కలియుగంలో భక్తుల కష్టాలను తీర్చి, కోరిన కోర్కెలు నెరవేర్చే ప్రత్యక్ష దైవం అమ్మవారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన ఆ ఆదిపరాశక్తిని దర్శించుకుంటే చాలు జన్మ ధన్యమౌతుంది. అలాంటి మహిమాన్విత శక్తిస్వరూపిణిగా వెలిసిన క్షేత్రమే ఒడిశా రాష్ట్రం, గంజాం జిల్లాలోని రౌలపల్లి గ్రామ అష్టభుజ దుర్గాదేవి ఆలయం. పచ్చని ప్రకృతి ఒడిలో, ప్రశాంతమైన కొండపై కొలువుదీరిన ఈ అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు కష్టాల నుంచి విముక్తి, సంతాన భాగ్యం, విద్యార్థులకు విద్యాప్రాప్తి కలుగుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం.

ఆలయ విశేషాలు .... రూప విశిష్టత

రౌలపల్లి కొండపై వెలిసిన ఈ దుర్గాదేవి విగ్రహం ఎంతో ప్రత్యేకమైనది. అమ్మవారు ఇక్కడ 8 చేతులతో భక్తులకు దర్శనమిస్తారు. ఆరు చేతులలో ఐదు రకాలైన శక్తివంతమైన ఆయుధాలను ధరించి శతృసంహారకురాలిగా కనిపిస్తే...మిగిలిన రెండు చేతులతో భక్తులను ఆశీర్వదిస్తూ అభయాన్ని ఇచ్చే ప్రశాంతమూర్తిగా దర్శనమిస్తారు. ఇలా ఒకే విగ్రహంలో అమ్మవారు రెండు రకాలుగా కనిపించడం విశేషం. ఇక్కడ మరో అద్భుతం ఏమంటే... ఎత్తైన ఈ కొండపై ఉన్న మెట్లు ఎక్కాలంటే ఎవరికైనా కష్టమే. కానీ, అమ్మనామాన్ని స్మరిస్తూ, జపిస్తూ మెట్లు ఎక్కేస్తారు. ఎంతటి వృద్ధులైనా, కాళ్లు నొప్పులు ఉన్నవారైనా సరే అమ్మనామాన్ని జపిస్తూ ఎక్కితే... కాళ్లునొప్పులు, అలసట కనిపించదు.

నమ్మకాలు ... విశేష ఫలాలు

స్థానికులతో పాటు దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఈ ఆలయం ఒక కల్పవల్లి. ముఖ్యంగా ఇక్కడ మూడు ప్రధాన నమ్మకాలు ప్రగాఢంగా ఉన్నాయి. సంతానంలేని దంపతులు ఈ ఆలయంలో వరుసగా 9 శుక్రవారాలు నిష్టతో దీపారాధన చేస్తే అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా ఆ భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. అంతేకాదు, చదువులో వెనుకబడిన విద్యార్థులు, పోటీ పరీక్షల్లో విజయం సాధించాలనుకునేవారు అమ్మవారికి మంగళహారతి మొక్కుగా చెల్లించుకుంటే విద్యాబుద్దులు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. ఇకపోతే, వ్యాపారంలో నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు కూడా ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేయిస్తారు. మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా చేయడం వలన చిక్కులు తొలగిపోయి లాభాలు పొందుతారని స్థానిక వ్యాపారుల అనుభవం.

పండుగలు ... విశేష ఉత్సవాలు

రౌలపల్లి గ్రామస్తులు ఈ అమ్మవారిని తమ ఇంటి దేవతగా కొలుస్తారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొదటి పత్రిక అమ్మవారికే సమర్పిస్తారు. ప్రతి ఏడాది చైత్రమాసంలో జరిగే జాతర, పల్లకీ సేవను చూసి తీరాల్సిందే. అదేవిధంగా ఆషాఢమాసంలో అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. కళ్యాణోత్సవం వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఆశ్వయుజమాసంలో జరిగే దేవీ నవరాత్రుల్లో ఈ క్షేత్రం భక్తజన సందోహంగా మారుతుంది. ఈ సమయంలో సాధువులు, తాంత్రిక విద్యా ఉపాసకులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక సాధనలు చేస్తారు. మహిళలు తమ మాంగళ్యం నిరంతరం వర్ధిల్లాలని కోరుకుంటూ ప్రతి శుక్రవారం ఇక్కడ పెద్ద ఎత్తున కుంకుమార్చనలు, పుష్పార్చనలు నిర్వహిస్తారు. భక్తులు అమ్మవారికి పానకం, బెల్లం, కొబ్బరికాయలు, పట్టువస్త్రాలు కానుకలుగా సమర్పిస్తారు. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవలసిన పవిత్ర శక్తిపీఠం ఈ రౌలపల్లి అష్టభుజ దుర్గాదేవి ఆలయం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story