Ravana Daughter Suvarnamatsya: రావణుడి కుమార్తె...విదేశాల్లో అదృష్టదేవత... హనుమంతుడిని ఎలా అడ్డుకుందో తెలుసా?
రామాయణం అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది రాముడి ధర్మం, రావణుడి అహంకారం, హనుమంతుడి భక్తి. రావణుడికి మేఘనాథుడు వంటి పరాక్రమవంతులైన కుమారులు ఉన్నారని మనకు తెలుసు
Ravana Daughter Suvarnamatsya: రామాయణం అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది రాముడి ధర్మం, రావణుడి అహంకారం, హనుమంతుడి భక్తి. రావణుడికి మేఘనాథుడు వంటి పరాక్రమవంతులైన కుమారులు ఉన్నారని మనకు తెలుసు. కానీ, రావణుడికి ఒక అందమైన కుమార్తె ఉందని, ఆమె విదేశాల్లో అదృష్ట దేవతగా పూజలందుకుంటోందని మీకు తెలుసా? వాల్మీకి రామాయణంలో కనిపించని ఈ అద్భుత గాథ ఆగ్నేయాసియా దేశాలైన థాయ్‌లాండ్, కంబోడియా రామాయణాల్లో సజీవంగా ఉంది. ఆమె పేరే 'సువర్ణమత్స్య'.
రామసేతును అడ్డుకున్న మత్స్యకన్య
శ్రీరాముడు లంకకు వెళ్లేందుకు వానర సైన్యంతో కలిసి సముద్రంపై రామసేతు నిర్మిస్తున్న సమయమది. వానరులు సముద్రంలో వేస్తున్న రాళ్లు వేస్తున్నట్టుగానే మాయమైపోతున్నాయి. ఎంత ప్రయత్నించినా వారధి ముందుకు సాగడం లేదు. అసలేం జరుగుతుందో చూడమని శ్రీరాముడు ఆదేశించగా... హనుమంతుడు సముద్ర గర్భంలోకి వెళ్తాడు. అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూసి హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. సముద్ర జీవులతో కలిసి సువర్ణ మత్స్య రాళ్లను తొలగిస్తున్న దృశ్యం కనిపిస్తుంది. శరీరమంతా బంగారంలా మెరిసిపోతు, సగం స్త్రీ రూపంలో, మరో సగం చేప రూపంలో ఉండటం చూసి ఆంజనేయుడు ఆశ్చర్యపోతాడు. ఏంటిదని ప్రశ్నించగా, తన తండ్రి రావణుడి ఆదేశానుసారం చేస్తున్నట్టు చెబుతుంది. రామసేతును అడ్డుకోవాలని తండి ఆదేశంగా చెబుతుంది.
హనుమంతుడితో యుద్ధం.. ఆపై అనురాగం
తొలుత హనుమంతుడికి, సువర్ణమత్స్యకు మధ్య తీవ్ర యుద్ధం జరుగుతుంది. అయితే హనుమంతుడి శౌర్యాన్ని, ధర్మాన్ని చూసి ఆమె ముగ్ధురాలవుతుంది. రావణుడు సీతమ్మను అపహరించి తప్పు చేశాడని, రాముడు ధర్మమూర్తి అని హనుమంతుడు ఆమెకు హితబోధ చేస్తాడు. వాస్తవాన్ని గ్రహించిన సువర్ణమత్స్య, రాళ్లను తిరిగి ఇచ్చేయడమే కాకుండా రామసేతు నిర్మాణానికి సహకరిస్తుంది. ఆంజనేయుడి శక్తిని, భక్తిని చూసిన సువర్ణమత్స్య ఆయనపై అనురాగం పెంచుకుంటుంది. రామసేతు వారధి పూర్తయ్యేవరకు వారితోనే ఉంటుంది. అయితే, సువర్ణమత్స్య తన ప్రేమ గురించి హనుమంతుడికి తెలియజేయగా.. బ్రహ్మచారి అని చెప్పి ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు.
విదేశాల్లో అదృష్ట దేవతగా పూజలు
భారతదేశంలో ఈమె ప్రస్తావన తక్కువైనా, థాయ్‌లాండ్‌లో మాత్రం సువర్ణమత్స్యను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. బ్యాంకాక్ వంటి చోట్ల ప్రసిద్ధ ఆలయాల గోడలపై హనుమంతుడు, సువర్ణమత్స్యల చిత్రాలు నేటికీ కనిపిస్తాయి. థాయ్ ప్రజలు తమ ఇళ్లలో వ్యాపార సంస్థల్లో సువర్ణ మత్స్య విగ్రహాలను పెట్టుకుంటారు. సిరి సంపదలు కలుగుతాయని నమ్ముతారు. కాంబోడియాలోని ఆంగ్‌కోర్ వాట్ వంటి చారిత్రక కట్టడాల్లో ఈమె శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మనకు తెలియని రామాయణ అంతరార్థాలు, ఇలాంటి ఆసక్తికరమైన గాథలు దేశ సరిహద్దులు దాటి భక్తిని చాటుతున్నాయి. ఒక రాక్షస రాజు కుమార్తె అయినా, ధర్మం వైపు నిలబడి నేడు ఒక దేశానికే అదృష్ట దేవతగా మారడం నిజంగా విశేషమే కదా.




