Raksha Bandhan 2026: రాఖి ఒక్కటే కాదు... ఈపూజలు చేస్తేనే అనుబంధం బలపడుతుంది...
రాఖి పౌర్ణమి రోజున రాఖీ కట్టించుకోవడం ఒక్కటే కాదు... ఇలా పూజలు చేయడం వలన కూడా బంధం మరింత బలపడుతుంది. ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
Raksha Bandhan 2026: రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అనేది కేవలం సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతిరూపం మాత్రమే కాదు. అది ఆధ్యాత్మికంగా, వేద సంప్రదాయాల ప్రకారం అత్యంత పవిత్రమైన పుణ్యదినం. పురాణాల ప్రకారం దేవేంద్రుడికి శచిదేవి, విష్ణుమూర్తికి మహాలక్ష్మి రక్షాసూత్రాన్ని కట్టి విజయాన్ని, మంగళకరమైన శుభాలను సిద్ధించేలా చేశారు. ఈ పవిత్ర శ్రావణ పౌర్ణమి రోజున కేవలం రాఖీలు కట్టడమే కాకుండా, కొన్ని విశేషమైన ఆధ్యాత్మిక పూజలు ఆచరించడం ద్వారా అన్నాచెల్లెళ్ల బంధం మరింత బలపడటమే కాకుండా, గృహంలో అష్టైశ్వర్యాలు, ఐశ్వర్య స్థిరత్వం సిద్ధించి ఆయురారోగ్యాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది.
విఘ్నేశ్వరుడి పూజ ... ఐశ్వర్య నాణెం
శ్రావణ పౌర్ణమి నాడు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుని, శుచియై నూతన వస్త్రాలు ధరించాలి. అనంతరం, తొలుత ఒక పళ్లెంలో రాఖీలు, దానితో పాటు ఒక వెండి నాణెం లేదా రూపాయి నాణేన్ని ఉంచి, విఘ్నేశ్వరుడి పాదాల చెంత ఉంచి పూజించాలి. పూజ పూర్తయిన తరువాత ఆ నాణేన్ని ఒక ఎర్రటి పట్టు వస్త్రంలో చుట్టి, మూటగా కట్టాలి. ఈ మూటను ధనం ఉంచే బీరువా లేదా డబ్బుల పెట్టెలో భద్రపరుచుకోవడం వల్ల దారిద్య్రం తొలగి లక్ష్మీకటాక్షం కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు. విఘ్నేశ్వరుడి పాదాల చెంత ఉంచి పూజించిన నాణేం ధనాన్ని, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుందని పండితులు చెబుతున్నారు.
శ్రావణ రుద్రాభిషేకం... శివసాయుజ్యం
రక్షాబంధన్ పర్వదినం శ్రావణ మాసంలో రావడం వల్ల, ఈ రోజు చేసే శివారాధనకు 100 రెట్లు అధిక ఫలితం ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగి, సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి శివలింగానికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారలతో పంచామృతాభిషేకం చేయాలి. అంతేకాకుండా, శివ నామోచ్ఛారణతో అభిషేకం చేయడం వల్ల వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న అడ్డంకులు తొలగి నూతన అవకాశాలు లభిస్తాయి. మన చుట్టూ ఉండే ఆరా విస్తృతి పెరుగుతుంది. ఫలితంగా మనం అనుకున్న పనులు, చేస్తున్న పనులు నెరవేరుతాయి.
మహాలక్ష్మి, గణపతి మంత్రజపం...కుటుంబ సంరక్షణ
గృహంలో శాంతి, ఆనందం వెల్లివిరియడానికి లక్ష్మీదేవిని, మహాగణపతిని ఈ విధంగా ఆరాధించాలి. పూజా సమయంలో లక్ష్మీదేవి మంత్రాన్ని 108 సార్లు, అలాగే విఘ్న వినాశకుడైన గణపతి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. దీనివల్ల సకల దోషాలు నివారించబడతాయి. అంతేకాదు, కుటుంబ సంరక్షణ కోసం ఒక శుభ్రమైన పసుపు లేదా ఎరుపు వస్త్రంలో పసుపు, కుంకుమ, శ్రీగంధం, అక్షతలు, దుర్వ, రూపాయి నాణెం ఉంచి పూజించాలి. ఈ ద్రవ్యాలన్నింటినీ మూటగా కట్టి, పూజా మందిరంలో పవిత్రమైన ప్రదేశంలో ఉంచాలి. వేదోక్తమైన ఈ పూజా విధానాలను ఆచరించడం వల్ల కుటుంబ సభ్యులందరికీ వ్యాధి నివారణ, దీర్ఘాయుష్షు, శాశ్వతమైన ఐశ్వర్యం లభిస్తాయని పండితులు చెబుతున్నారు. మరి ఈ రాఖి పౌర్ణమిరోజున రక్షను బంధంగా కట్టించుకోవడమే కాకుండా, ఇలా పూజలు చేయడం వలన అన్నాచెల్లెళ్ల బంధం మరింత బలపడుతుంది.




