Peddamma Temple Mystery: పెద్దమ్మతల్లి ఆలయంలో నల్లని సింహాసనం...రాత్రివేళ వింత శబ్దాలు
హైదరాబాద్ నడిబొడ్డున వెలసిన అత్యంత శక్తివంతమైన, మహిమాన్వితమైన పెద్దమ్మ తల్లి ఆలయంలో అద్భుతమైన శక్తులు దాగున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Peddamma Temple Mystery: హైదరాబాద్ మహానగరంలో అత్యంత శక్తివంతమైన, మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలలో జూబ్లీహిల్స్‌లోని శ్రీ పెద్దమ్మతల్లి ఆలయం మొదటి వరుసలో ఉంటుంది. నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడే ఈ ఆలయం వెనుక శతాబ్దాల చరిత్ర, సైన్స్‌కు అందని కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా గర్భగుడిలోని నల్లని సింహాసనం, అర్ధరాత్రి వేళ వినిపించే వింత శబ్దాలు ఈ క్షేత్ర మహత్యానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శతాబ్దాల చరిత్ర ... గిరిజనుల ఆరాధ్యదైవం
నేడు ఎంతో వైభవంగా కనిపిస్తున్న ఈ ఆలయ పునాదులు సుమారు 125 సంవత్సరాల క్రితం, అంటే 1900 వ సంవత్సరం ప్రాంతంలో పడ్డాయి. అప్పట్లో ఈ ప్రాంతంలో నివసించే ఆదివాసి గిరిజన కుటుంబాలు అమ్మవారిని నమ్ముకుని, చిన్నపాటి రాళ్లతో పూజించడం ప్రారంభించారు. గ్రామానికి ఏదైనా ఆపద వస్తే అమ్మవారిని వేడుకునేవారు. భక్తుల కష్టాలను తీరుస్తూ, రక్షణ కవచంలా నిలవడంతో 1980వ దశకం తర్వాత హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న కొద్దీ ఈ ఆలయం ఒక మహోజ్వల శక్తిపీఠంగా రూపాంతరం చెందింది. ఇప్పుడు ప్రతిరోజూ వందలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
రహస్య నల్లని సింహాసనం ... శక్తి నికేతనం
పెద్దమ్మతల్లి గర్భగుడిలోకి వెళ్లినప్పుడు మనకు అమ్మవారి భవ్య మంగళ స్వరూపం మాత్రమే కనిపిస్తుంది. కానీ, నిగూఢమైన రహస్యం ఆమె కూర్చున్న ఆసనంలో ఉంది. అమ్మవారు కొలువై ఉన్న సింహాసనం పూర్తిగా నలుపు రంగులో ఉంటుంది. నిత్యం జరిగే పుష్పాలంకరణలు, పట్టువస్త్రాల వల్ల ఇది భక్తులకు నేరుగా కనిపించదు. కేవలం ప్రత్యేక పూజలు, మూలవిరాట్ అభిషేక సమయాల్లో మాత్రమే అలంకారాలన్నీ తీసివేస్తారు. ఆ సమయంలో ఈ నల్లని సింహాసనాన్ని దర్శించుకోవచ్చు. దీనిని పండితులు 'శక్తి నికేతనం' అని పిలుస్తారు. ఈ పీఠం నుండి అపారమైన విశ్వశక్తి వెలువడుతుందని, అందుకే ఇక్కడ కోరిన కోర్కెలు వెంటనే నెరవేరుతాయని నమ్ముతారు.
అర్ధరాత్రి వేళ వింత శబ్దాలు ... అమ్మవారి నగర సంచారం
ఈ ఆలయంలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, రాత్రి వేళల్లో గర్భగుడి పరిసరాల నుండి వింత శబ్ధాలు వినిపిస్తుంటాయి. ఈ శబ్దాలను విన్న చాలా మంది భయాందోళనలకు గురయ్యారు. ఆలయం మూసివేసిన తర్వాత, అర్ధరాత్రి వేళల్లో గజ్జల రవళి, డమరుకం, కొమ్ము బూరల వంటి మంగళ వాయిద్యాల ధ్వనులు స్పష్టంగా వినిపిస్తాయని ఇక్కడి వారు చెబుతుంటారు. లోక కల్యాణం కోసం, తన భక్తులను రక్షించడం కోసం పెద్దమ్మతల్లి రాత్రి వేళల్లో తన పరివారంతో కలిసి నగర సంచారానికి బయలుదేరుతుందని, ఆ సమయంలోనే ఈ శబ్దాలు వస్తాయని ప్రతీతి. భక్తులు కూడా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే అనుకున్న పనులు పూర్తవుతాయని నమ్మకం. ప్రతి ఆదివారం రోజున అమ్మవారికి పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి. అదేవిధంగా దసరా నవరాత్రుల్లో అమ్మవారిని అద్భుతంగా అలంకరిస్తారు.




