Ramayana Pakistan Cities: రామాయణంతో ముడిపడిన పాకిస్తాన్ నగరాలు... రామభక్తులు తప్పక దర్శించాలి
పాకిస్తాన్‌లో రామాయణ కాలంనాటి నగరాలు...నేడు ఆ దేశానికి అత్యంత కీలకం. ఈ నాలుగు నగరాల గురించి తెలుసుకుందాం.
Ramayana Pakistan Cities: రామాయణం కేవలం ఒక పురాణ గాథ కాదు, అది మన అఖండ భరతవర్షపు భౌగోళిక సరిహద్దులను చాటిచెప్పే సజీవ సాక్ష్యం. నేడు దేశాల సరిహద్దులు మారవచ్చు కానీ, సనాతన ధర్మం సృష్టించిన చరిత్ర పుటలను ఎవరూ చెరపలేరు. శ్రీరాముని పట్టాభిషేకం అనంతరం రఘువంశపు వారసులు భరతఖండం నలుమూలలా ధర్మరాజ్యాన్ని ఎలా విస్తరించారో, ముఖ్యంగా నేటి పాకిస్తాన్‌లోని ప్రముఖ నగరాలు రామాయణంతో ఎలా ముడిపడి ఉన్నాయో తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. శ్రీరాముని కుమారులైన లవకుశులు, అలాగే భరతుని కుమారులైన తక్ష, పుష్కరులు పశ్చిమ భారతదేశంలో నాలుగు ప్రధాన నగరాలను నిర్మించి పరిపాలించారు. ఆ నగరాల వెనుక ఉన్న ఆసక్తికరమైన ఆధ్యాత్మిక చరిత్రను ఇప్పుడు క్లుప్తంగా పరిశీలిద్దాం.
లవపురి ...నేటి లాహోర్
శ్రీరామచంద్రుని పెద్ద కుమారుడైన లవుడు స్థాపించిన నగరమే ఈ 'లవపురి'. కాలక్రమేణా ఈ పేరు లహౌర్‌గా, ప్రస్తుతం పాకిస్తాన్ రెండవ అతిపెద్ద నగరమైన లాహోర్‌గా రూపాంతరం చెందింది. ఇప్పటికీ లాహోర్ కోటలోని శతాబ్ధాల క్రితంనాటి ఒక పురాతన మందిరాన్ని చూడవచ్చు. దీనిని "లవుని ఆలయం" గా స్థానికులు పిలుస్తారు. అక్కడ లవ్ లైన్, లవ్ గార్డెన్ వంటి పేర్లు నేటికీ వినిపిస్తాయి. ఈ లాహోర్ నగరంలో పరిస్థితులు ఎలా ఉన్నా...శ్రీరాముడి భక్తులు ఎవురైనా లాహోర్‌ను సందర్శించినపుడు తప్పకుండా ఈ లవుని ఆలయాన్ని దర్శించుకోవడం మర్చిపోవద్దు.
కుశపురం ....నేటి కాసూర్
శ్రీరాముని రెండవ కుమారుడైన కుశుడు తన రాజ్యానికి రాజధానిగా నిర్మించుకున్న నగరం 'కుశపురం'. లాహోర్‌కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం, కాలక్రమంలో ఖశుర్‌గా మారి ప్రస్తుతం కాసూర్‌గా పిలవబడుతోంది. కుశ వంశీయుల పరిపాలనకు ఇది ప్రధాన కేంద్రంగా విరాజిల్లింది. ఈ నగరంలోకి అడుగుపెడితే అడుగడుగునా మనకు తెలియకుండానే రామనామం మన హృదయాన్ని కదిలిస్తుంది. ఆ నామంతో మనసు పులకిస్తుంది.
తక్షశిల ... నేటి టాక్సిలా
శ్రీరాముని తమ్ముడైన భరతుని కుమారుడు తక్షుడు. ఈయన పేరిట నిర్మితమైనదే 'తక్షశిల'. వాల్మీకి రామాయణంలో దీని ప్రస్తావన ఉంది. మహాభారత కాలంలో గాంధార దేశానికి ఇది రాజధానిగా ఉండేది. ఆ తరువాతి కాలంలో ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా ప్రపంచ ఖ్యాతి గడించింది. ప్రస్తుత పాకిస్తాన్‌లో దీనిని టాక్సిలా అని పిలుస్తున్నారు.
పుష్కలావతి ...నేటి పెషావర్
భరతుని రెండవ కుమారుడైన పుష్కరుడు స్థాపించిన నగరమే పుష్కలావతి. బౌద్ధ గ్రంథాలలో దీనిని 'పురుషపురం' అని కూడా పిలిచారు. శతాబ్దాల కాలంలో ఈ పురుషపురమే రూపాంతరం చెంది నేడు పాకిస్తాన్‌లోని వ్యూహాత్మక నగరమైన పెషావర్ గా మారింది. పాకిస్తాన్‌కు ఈ నగరం అత్యంత కీలకం. ఇక్కడ ఆ దేశ భద్రతకు సంబంధించిన అనేక కట్టడాలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ నగరం అపారమైన నిధి నిక్షేపాలకు ఆలవాలంగా ఉండేది. కానీ, ఇప్పుడు ఉగ్రవాదుల దాడులతో, స్థానిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.
వాల్మీకి రామాయణ ఉత్తరకాండలోనూ, పురాతన గ్రీకు చరిత్రకారుల గ్రంథాలలోనూ ఈ నాలుగు నగరాల భౌగోళిక ప్రాధాన్యత స్పష్టంగా లిఖించబడింది. నాడు రఘువంశపు రాజులు పాలించిన ఈ పుణ్యభూములు, నేడు సరిహద్దులు దాటి పరాయి దేశంలో ఉన్నప్పటికీ, ప్రతి రామభక్తుడు గుండెల్లో దాచుకోవాల్సిన అపురూప చారిత్రక సత్యాలు. పాకిస్తాన్‌ను సందర్శించే పర్యాటకులు, భక్తులు ఈ నాలుగు నగరాలను తప్పకుండా దర్శించాలని, అక్కడి ఆనాటి అపురూపమైన కట్టడాల గురించి తెలుసుకోవాలని పెద్దలు చెబుతున్నారు.




