Onam 2026: మహాబలి కోసం ఓనం... పండుగ వెనుకనున్న అసలు రహస్యం
కేరళలో వైభవోపేతంగా జరుపుకునే ఓనం పండుగ వెనుక ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. బలిచక్రవర్తి రాకను సూచిస్తూ పదిరోజులపాటు ఈ పండుగ ఆంతర్యం ఏంటో తెలుసుకుందాం.
Onam 2026: కేరళ రాష్ట్రంలో అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక నిష్ఠతో జరుపుకునే పవిత్ర పండుగ 'ఓనం'. శ్రీమహావిష్ణువు యొక్క ఐదవ అవతారమైన శ్రీ వామనమూర్తి అనుగ్రహం, దానగుణానికి ప్రతీక అయిన చక్రవర్తి మహాబలి యొక్క వార్షిక పునరాగమనాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను జరుపుకుంటారు. మలయాళ సౌరమానం ప్రకారం 'చింగం' మాసంలో శ్రవణా నక్షత్రం రోజున పండుగ పరాకాష్ఠకు చేరుకుంటుంది. 2026 సంవత్సరంలో ఓనం పండుగను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. భక్తి, సమసమాజ భావన, ప్రకృతి పట్ల కృతజ్ఞత కలగలసిన ఈ పండుగ వెనుక ఒక అద్భుతమైన భాగవత కథ దాగి ఉంది.
ఓనం పండుగ ఎలా జరుపుకుంటారు
ఓనం ఒక్కరోజు పండుగ కాదు. మొత్తం పది రోజులపాటు ఓనం పండుగను జరుపుకుంటారు. అత్తం నక్షత్రంతో ఈ పండుగ మొదలౌతుదంది. పదో రోజైన తిరువోణం నక్షత్రం అంటే శ్రవణా నక్షత్రంతో పండుగ పూర్తవుతుంది. శ్రీమహావిష్ణువు వామనుడిగా అవతరించి మహాబలిని పాతాళ లోకానికి తొక్కేస్తాడు. కాగా, మహాబలి చక్రవర్తి భక్తికి మెచ్చిన శ్రీమహావిష్ణువు ఏడాదిలో ఒకరోజు పాతాళలోకం నుంచి భూమి మీదకు వచ్చి ప్రజలను సందర్శించేలా అనుగ్రహించినట్టుగా చెబతారు. ఓనం పండుగ జరిగే పదిరోజులు ఇళ్ల ముంగిట రంగవల్లులు, పూల అలంకరణలు చేస్తారు. అంతేకాదు, ఓనం పండుగ రోజున అరటి ఆకులో 26 రకాలైన సంప్రదాయ శాఖాహార పిండి వంటలను వడ్డిస్తారు. ధనిక పేద అనే తేడా లేకుండా ఈ వంటలు చేయడం విశేషం.
ఓనం అవతరణ ... స్థల పురాణ ప్రాశస్త్యం
రాక్షస రాజైనప్పటికీ మహాబలి తీవ్రమైన దానగుణం, సత్యపాలనతో ముల్లోకాలను ఏలేవాడు. ఆయన ధర్మానికి సంతోషించిన శ్రీమహావిష్ణువు, దేవతల కోరిక మేరకు వామన రూపంలో వచ్చి మూడడుగుల నేలను దానంగా కోరతాడు. ఒక అడుగుతో భూమిని, రెండవ అడుగుతో ఆకాశాన్ని కొలిచిన వామనుడికి మూడవ అడుగు కోసం మహాబలి తన శిరస్సును సమర్పిస్తాడు. ఈ అద్భుత సత్యనిష్ఠకు మెచ్చిన సర్వేశ్వరుడు మహాబలిని సుతల లోకానికి అధిపతిగా చేసి, ప్రతీ సంవత్సరం తన ప్రజలను చూసేందుకు భూలోకానికి వచ్చే వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ విధంగా ప్రజా రంజకుడైన రాజా మహాబలి తమ ఇళ్లకు వచ్చే రోజే ఓనం పండుగ.
పవిత్ర ఆచారాలు ... దైవిక రూపాలు
పది రోజులపాటు వివిధ వర్ణాలతో కూడిన పువ్వులతో ఇంటిముందు డిజైన్లు వేస్తారు. దీనిని పూకళం అలంకరణ అని పిలుస్తారు. శ్రీమహాలక్ష్మీదేవికి స్వాగతం పలకడానికి గృహంలో మంగళకరమైన వాతావరణానికి ఇది సంకేతం. ఇక ఓనం రోజున వామన పూజను చూసి తీరాల్సిందే. తృక్కాకర అప్పన్ అని పిలిచే మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పూజిస్తారు. అంతేకాదు, పంపానదిలో జరిగే పడవ పందాలు కేవలం క్రీడలగా కాకుండా ఆరున్ముల పార్థసారథి ఆలయ ఉత్సవాల్లో అంతర్భాగంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో మరో అద్భుత ఘట్టం కైకొట్టికళి నాట్యం. స్త్రీలు సాంప్రదాయ ముండు ధరించి శ్రీకృష్ణుని లీలలను, రాధాకృష్ణుల భక్తిని కీర్తిస్తూ నాట్యం చేస్తారు. ఓనం కేవలం పంటల పండుగ మాత్రమే కాదు. మానవత్వానికి, దానగుణానికి, భగవంతుని పట్ల సమర్పణ భావానికి నిదర్శనం. అహంకారాన్ని వీడి శ్రీహరి పాదపద్మాలకు శరణాగతి వేడాలనే ఆధ్యాత్మిక సత్యాన్ని ఓనం మనకు ప్రబోధిస్తుంది.




