Nizamabad Gol Hanuman: లక్ష్యం ఏదైనా నెరవేర్చే నిజామాబాద్ గోల్ హనుమాన్... అరుదైన స్వయంభూవుగా పూజలు
నిజామాబాద్‌లో వెలసిన గోల్ హనుమాన్ భక్తుల కష్టాలను గుర్తించి... వారిని ఆపదల నుంచి రక్షిస్తుంటాడని భక్తుల నమ్మకం. శతాబ్ధం క్రితం రావిచెట్టు కింద వెలసిన ఈ స్వయంభూవు లీలల గురించి తెలుసుకుందాం.
Nizamabad Gol Hanuman: ఎంతటి కష్టానైనా ఒక్కెబ్బతో నివారించి, భక్తులలో ఆత్మవిశ్వాసం నింపే అభయ హస్తం నిజామాబాద్‌లోని ప్రసిద్ధ గోల్ హనుమాన్. తెలంగాణ ప్రాంతంలో వెలసిన అత్యంత అరుదైన స్వయంభూ హనుమద్ క్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయం గడచిన 100 సంవత్సరాలుగా భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతోంది.
ప్రత్యేక నిర్మాణ శైలి ... గోల్ హనుమాన్ పేరు వెనుక రహస్యం
నగరం నడిబొడ్డున నాలుగు రహదారుల కూడలిలో వృత్తాకారంలో ఈ ఆలయం నిర్మించబడటం వల్ల స్వామివారికి 'గోల్ హనుమాన్' అనే పేరు వచ్చింది. స్వామివారు తూర్పు దిశగా వెలిసినప్పటికీ, హనుమంతుడి ముఖమండలం మాత్రం దక్షిణ దిశగా భక్తుల వైపు చూస్తూ అభయమివ్వడం ఇక్కడి విశేషం. ఆలయం చుట్టూ ఉన్న గోడలపై సమగ్ర రామాయణ ఘట్టాలు, శ్రీమహావిష్ణువు యొక్క దశావతార చిత్రాలు అద్భుతంగా చిత్రీకరించబడ్డాయి. ఈ చిత్రాల ద్వారా దర్శనానికి వచ్చే భక్తులకు ధార్మిక జ్ఞానం సులభంగా అవగతమవుతుంది. ఈ క్షేత్రంలో స్వామివారికి భక్తిశ్రద్ధలతో 11, 21, 41 లేదా 108 ప్రదక్షిణలు చేస్తే ఎంతటి జటిలమైన సమస్యలైనా తొలగిపోయి అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని భక్తుల దృఢ విశ్వాసం. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు. ఎందరి జీవితాలనో మార్చిన సత్యం కూడా అని భక్తులు చెబుతున్నారు.
ఆవిర్భావ రహస్యం
సుమారు శతాబ్దం క్రితం ఒక ప్రాచీన రావిచెట్టు కింద స్వయంభూవుగా వెలిసిన ఈ స్వామికి శనివారాలు, అష్టమి, త్రయోదశి, అమావాస్య, కార్తీక పౌర్ణమి రోజుల్లో వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. హనుమాన్ జయంతి ఉత్సవాల వేళ ఈ ఆలయం భక్తజనసందోహంతో నిండిపోతుంది. నిజామాబాద్‌లో దర్శించవలసిన అత్యంత ముఖ్యమైన వాటిల్లో ఈ గోల్ హానుమాన్ ఆలయం కూడా ఒకటి. సీతమ్మ జాడను కనిపెట్టి రామయ్య చింతను తీర్చినట్టుగానే... మన కష్టాలను గుర్తించి గట్టించే దైవం ఈ గోల్ హనుమాన్ అని పండితులు చెబుతున్నారు.




