Nemaligundla Ranganayaka Swamy: ఈ రంగనాయకుడికి తేనెటీగలే కాపలా... ఆలయం లోపల అడుగుపెట్టాలంటే ఈ నియమాలు పాటించాల్సిందే

నల్లమల అడవుల గర్భంలో, జలపాతాల సవ్వడి మధ్య కొలువుదీరిన ఒక అద్భుత ఆధ్యాత్మిక రహస్యం "నెమలిగుండ్ల రంగనాయక స్వామి" ఆలయం.

Balachander
Published on: 10 May 2026 10:08 AM IST
Nemaligundla Ranganayaka Swamy: ఈ రంగనాయకుడికి తేనెటీగలే కాపలా... ఆలయం లోపల అడుగుపెట్టాలంటే ఈ నియమాలు పాటించాల్సిందే
X

Nemaligundla Ranganayaka Swamy: నల్లమల అడవుల గర్భంలో, జలపాతాల సవ్వడి మధ్య కొలువుదీరిన ఒక అద్భుత ఆధ్యాత్మిక రహస్యం "నెమలిగుండ్ల రంగనాయక స్వామి" ఆలయం. సాధారణంగా ఏ గుడికైనా వెళ్లాలంటే భక్తి ఉంటే చాలు, కానీ ఈ క్షేత్రానికి వెళ్లాలంటే భక్తితో పాటు నియమ నిబద్ధత, అంతకు మించి ధైర్యం కూడా ఉండాలి. ఎందుకంటే, ఇక్కడ స్వామివారికి మనుషులు కాదు, వేలాది తేనెటీగలు కాపలా కాస్తుంటాయి! మహత్తరమైన ఈ ఆలయాన్ని ఎలా దర్శించుకోవాలో, ఈ క్షేత్రం వెనుక ఉన్న రహస్యమేంటో తెలుసుకుందాం.

మయూర మహర్షి తపస్సు - క్షేత్ర పురాణం

పురాణాల ప్రకారం, పూర్వకాలంలో మయూర మహర్షి శ్రీమహావిష్ణువు కోసం అడవిలో ఘోర తపస్సు చేశారు. నెమలి తల వంటి ఆకారం కలిగి ఉండటంతో ఆయన తన ముక్కుతో ఓ గుండాన్ని తవ్వాడు. దీంతో ఆ గుండానికి నెమలిగుండం అనే పేరు వచ్చింది. ఇక, ఈ ప్రాంతంలో నివశించే గిరిజన బిడ్డ రంగలక్ష్మి ఎలాగైనా శ్రీమహావిష్ణువును వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. తల్లిదండ్రులను ఎదిరించి మయూర మహర్షి చెంతకు వచ్చి ఆయన పర్యవేక్షణలో తపస్సు చేస్తుంది. రంగలక్ష్మి తపస్సుకు మెచ్చిన శ్రీమహావిష్ణువు రంగనాథుడి రూపంలో అవతరించి రంగలక్ష్మిని వివాహం చేసుకుంటాడు. ఆ ప్రాంతంలో రంగనాథుడు స్వయంగా వెలిసినట్టుగా చెబుతారు. అంతేకాదు, లక్ష్మీదేవి స్వామిని వెతుక్కుంటూ వచ్చి శిలగా మారిందని, ఆమె కన్నీరే నేటికీ ఇక్కడ బొట్టు బొట్టుగా జలపాతంలా ప్రవహిస్తోందని భక్తుల నమ్మకం.

తేనెటీగల పహారా.. ఆ నియమాలు పాటిస్తేనే దర్శనం!

ఈ ఆలయంలో వెలసిన వింతలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఈ క్షేత్రం గురించిన మూడు ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి. ఆ ఆలయం కేవలం శనివారం మాత్రమే తెరుస్తారు. మిగిలిన ఆరు రోజులు ఆలయం తలుపులు మూసే ఉంటాయి. ఎవరికీ అనుమతి ఉండదు. అంతేకాదు, ఆలయంలో ప్రవేశించేవారు శుద్ధిగా ఉండాలి. అలా కాకుండా అశౌచంగా ఉంటే ఆలయంలోని తేనెటీగలు దాడి చేస్తాయి. మద్యం, మాంసం సేవించి అపవిత్రంగా ఆలయంలోకి అడుగుపెట్టాలని చూస్తే తేనెటీగల దాడికి బలికావలసి వస్తుంది. నియమనిష్టలతో, శుచిగా, భక్తితో ఉండేవారికి మాత్రమే అనుమతి ఉంటుంది. అశౌచంగా ఆలయానికి వచ్చిన ఎందరినో ఇక్కడి తేనెటీగలు దాడి చేసినట్టుగా భక్తులు చెబుతారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని జె.పుల్లలచెరువు గ్రామానికి సమీపంలో ఈ క్షేత్రం ఉంది. ఏటా చైత్ర మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. సుమారు 100 కి పైగా మెట్లు ఎక్కి, ప్రకృతి అందాలను దాటుకుంటూ స్వామిని చేరుకోవాలి. ప్రకృతి ఒడిలో సెలయేళ్ల మధ్య కొలువుదీరిన రంగనాయకుడు కోరిన కోరికలు తీర్చు కల్పవృక్షంగా ప్రసిద్ది పొందాడు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story