Navagraha Remedies: నవగ్రహ దోషాలకు పూర్వీకులు సూచించిన అత్యంత సులభమైన పరిష్కారం...అత్యుత్తమ ఫలితాలకు మార్గం
జీవితంలో ఏ పని ముందుకు సాగకుంటే జాతకంలో నవగ్రహ దోషాలు ఉన్నాయని అర్ధం చేసుకోవాలి. నవగ్రహ దోషాల నుంచి విముక్తి పొందాలంటే గోమాతకు ఆహారం తినిపించాలని పెద్దలు చెబుతున్నారు.
Navagraha Remedies: నవగ్రహ దోషాలతో సతమతమవుతున్నారా? పూర్వీకులు చూపిన అత్యంత సులభమైన పరిష్కారం ఏమిటో తెలుసా? వారంలో మూడు రోజులు గోవులకు సేవ చేస్తే నవగ్రహాలు శాంతిస్తాయా? ఏ గోవుకు ఎలాంటి ఆహారం తినిపించాలి... తెలుసుకుందాం.
మానవ జీవితంలో చేపట్టిన ఏ పనీ ముందుకు సాగకపోయినా, పదేపదే అడ్డంకులు ఎదురవుతున్నా, ఆరోగ్య లేదా మానసిక సమస్యలు వెంటాడుతున్నా జాతకంలోని నవగ్రహ దోషాలే ప్రధాన కారణమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ గ్రహ దోషాల నివారణకు మన పూర్వీకులు, పండితులు అత్యంత సులభమైన, శక్తివంతమైన మార్గాన్ని సూచించారు. అదే గోసేవ. సకల దేవతలు నివసించే గోమాతకు భక్తిశ్రద్ధలతో ఆహారాన్ని అందించడం ద్వారా గ్రహాల అనుగ్రహం లభించి, జీవితంలోని కష్టాలన్నీ పటాపంచలవుతాయి.
ఏ గ్రహ దోషానికి గోమాతకు ఏమి తినిపించాలి?
జాతకంలో ఏ గ్రహం బలహీనంగా ఉందో తెలుసుకుని, దానికి తగిన సాత్విక ఆహారాన్ని గోమాతకు తినిపించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం తగ్గడం, అధికారిక సమస్యలు ఉన్నవారికి సూర్యదోషం ఉన్నట్టుగా చెబుతారు. దీనికి పరిష్కారంగా ఆవుకు బెల్లం తినిపించాలి. చంద్రదోషంతో బాధపడుతున్నవారు గోమాతకు అన్నం తినిపించాలి. ముఖ్యంగా పౌర్ణమిరోజున ఇలా చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఇక కుజదోషంతో బాధపడేవారు గోమాతకు రోటి, బెల్లం కలిపి తినిపించాలి. బుధదోషంతో బాధపడేవారు గోవుకు పచ్చగడ్డి, పాలకూరను అందించాలని పెద్దలు చెబుతున్నారు. అంతేకాదు, గురుదోషం నుంచి విముక్తి పొందాలంటే నెయ్యితో కూడిన రోటీలను గోవులకు తినిపించాలి. శనిదోషం నుంచి ఉపశమనం కోసం గోధుమ రొట్టెలను, రాహుకేతు దోషాల నుంచి విముక్తి పొందేందుకు నువ్వుల రోటీని, ఉడికించిన పెసలలను గోవులకు ఆహారంగా పెట్టాలి.
గోసేవ చేయాల్సిన పవిత్ర నియమాలు
గోమాతకు ఆహారం అందించే సమయంలో కేవలం పదార్థం మాత్రమే కాకుండా మనలోని భావం కూడా ముఖ్యమైనది. ఆహారాన్ని ఎంతో ప్రేమతో, నిర్మలమైన మనస్సుతో, పవిత్ర భావనతో అందించాలి. వారంలో మూడు రోజులు క్రమం తప్పకుండా గోసేవ చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా సోమవారం, గురువారం, శనివారం రోజుల్లో గోవుకు ఆహారం అందించడం అత్యంత ఫలదాయకమని పండితులు స్పష్టం చేస్తున్నారు. సకల దేవతా స్వరూపిణియైన గోమాతను సేవించడం ద్వారా నవగ్రహాల ప్రతికూల ప్రభావాలు తొలగిపోయి, కుటుంబంలో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయి.




