Ishtakameswari Temple Mystery: నల్లమల ఇష్టకామేశ్వరిదేవి రహస్యం... నుదురుపై ఇలా ముట్టుకొని బొట్టుపెడితే చాలు
శ్రీశైలంలో దండకారణ్యంలో ఇష్టకామేశ్వరీ దేవి దర్శనం...అదృష్టం ఉన్నవారికే లభ్యం. నుదురు మనిషి చర్మంలా మెత్తగా ఉండటం ఈ క్షేత్రం విశేషం.
Ishtakameswari Temple Mystery: శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తుల యాత్ర ఇష్టకామేశ్వరి దేవి దర్శనంతోనే సంపూర్ణమౌతుంది. దట్టమైన నల్లమల అడవుల మధ్య, అత్యంత ప్రమాదకరమైన లోయల గుండా సాగే ప్రయాణం ఇది. కేవలం అదృష్టం ఉన్నవారికే లభించే ఈ అమ్మవారి దర్శనంలో ఒక పరమ అద్భుతం దాగి ఉంది. లోకంలో ఎక్కడా లేని విధంగా, ఇక్కడి రాతి విగ్రహం నుదుటిపై భక్తులు బొట్టు పెడుతుంటే... అది మనిషి చర్మంలా అత్యంత మెత్తగా తగలడం ఈ అమ్మవారి రహస్యం.
మనిషి నుదురులా మెత్తని శిల్పం - అసలు రహస్యం ఏమిటి?
సాధారణంగా దైవ విగ్రహాలు రాతితోనో, లోహంతోనో నిర్మితమై గట్టిగా ఉంటాయి. కానీ, ఇష్టకామేశ్వరి దేవి విగ్రహం మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. అమ్మవారి నుదుటిపై మనం వేలితో తాకినప్పుడు, అది రాయిలా కాకుండా.... జీవించి ఉన్న స్త్రీ నుదురులా మెత్తగా, స్పర్శకు స్పందిస్తున్నట్లుగా అనిపిస్తుంది. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారి నుదుట కుంకుమ దిద్ది, తమ మనసులోని కోరికలను చెప్పుకుంటారు. ఇష్టపడి కోరిన కోర్కెలు ఎటువంటివైనా సరే, ఈ తల్లి నిమిషాల్లో నెరవేరుస్తుందని భక్తుల బలమైన నమ్మకం. పూర్వం కేవలం సిద్ధులు, యోగులు మాత్రమే రహస్యంగా వచ్చి పూజించిన ఈ క్షేత్రాన్ని ప్రస్తుతం అటవీ శాఖ అధికారుల ప్రత్యేక అనుమతితో సామాన్య భక్తులు కూడా దర్శించుకుంటున్నారు.
చతుర్భుజ ధారిణి - తపః ముద్రలో అమ్మవారి స్వరూపం
ఈ ఆలయంలో అమ్మవారు శివపార్వతుల ఏకరూపంగా భక్తులకు కనువిందు చేస్తారు. శిల్పకళా చాతుర్యంతో అలరారే ఈ విగ్రహం చతుర్బుజాలతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. పై రెండు చేతులలో పవిత్రమైన తామర పుష్పాలను ధరించి ఉంటుంది. మూడో చేతిలో శివుని ప్రతిరూపమైన శివలింగం, నాలుగో చేతిలో నిరంతర నామస్మరణకు సూచికగా రుద్రాక్షమాల కనిపిస్తుంది. ప్రశాంతమైన ముఖవర్చస్సుతో, కళ్లుమూసుకొని తపస్సు చేస్తున్నట్లుగా ఉండే ఈ మాతను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా చెబుతారు.
శ్రీశైలం ప్రధాన ఆలయం నుండి దట్టమైన అడవి గుండా దాదాపు 20 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గం లేని కఠినమైన రాళ్ళపై ప్రయాణించి ఈ గుడికి చేరుకోవాలి. ఎంతటి అలసటతో వెళ్లినా, ఆ దేవాలయ ప్రాంగణంలో కేవలం ఐదు నిమిషాల పాటు కూర్చుని ధ్యానం చేస్తే... మనసులోని ఆందోళనలన్నీ పటాపంచలై, అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించి తీరాల్సిందే. ఈసారి శ్రీశైలం వెళ్తే తప్పకుండా ఇష్టకామేశ్వరీదేవిని దర్శనం చేసుకోండి.




