Srirangam Temple Mysteries: శ్రీరంగంలో అంతుచిక్కని రహస్యాలు.. వెయ్యేళ్లైనా ఎండిపోని వరికంకులు
Srirangam Temple Mysteries: దక్షిణ భారతదేశంలో అత్యంత పెద్దదైన, వైభవంగా వెలుగొందుతున్న శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు.. భక్తి, విశ్వాసం.
Srirangam Temple Mysteries: శ్రీరంగంలో అంతుచిక్కని రహస్యాలు.. వెయ్యేళ్లైనా ఎండిపోని వరికంకులు
Srirangam Temple Mysteries: దక్షిణ భారతదేశంలో అత్యంత పెద్దదైన, వైభవంగా వెలుగొందుతున్న శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు...భక్తి, విశ్వాసం, అద్భుతాల కలయికగా నిలిచిన పుణ్యక్షేత్రం. 156 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి, 7 ప్రాంగణాలతో నిర్మితమైన ఈ క్షేత్రాన్ని ‘భూలోక వైకుంఠం’గా పిలుస్తారు. ఇక్కడ సైన్స్‌కు అందని, తర్కానికి దొరకని అనేక అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భూలోక వైకుంఠంలోని అంతుచిక్కని అద్భుతాలు
ఇక్కడి ఆలయాన్ని ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు దర్శిస్తుంటారు. స్వామివారి మేల్కొపు నుంచి ప్రతీ కైంకర్యం ఓ అద్భుతం అనే చెప్పాలి. ఏడాదిలో 250కిపైగా ఉత్సవాలు జరుగుతాయి అంటే అర్ధం చేసుకోవచ్చు ఈ క్షేత్రం మహిమ ఏమిటో. ఈ ఆలయంలో జరిగే కొన్ని అద్భుతమైన సంఘటనలు చూస్తే...సాక్షాత్తు ఆ రంగనాథుడు ఇక్కడే సంచరిస్తున్నాడా అనే భావన కలుగుతుంది.
అరిగిపోయే స్వామివారి పాదరక్షలు
శ్రీరంగంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం స్వామివారి పాదరక్షలు. ఇక్కడ రంగనాథునికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్త పాదరక్షలను సమర్పిస్తారు. అయితే, ఆరు నెలల తర్వాత పాత వాటిని తొలగించే సమయంలో అవి అరిగిపోయి ఉండటం గమనార్హం. స్వామివారు రాత్రి వేళల్లో ఈ పాదరక్షలు ధరించి ఆలయ ప్రాంగణంలో, కావేరీ తీరంలో సంచరిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాయిపై నడిస్తే చెప్పులు ఎలా అరుగుతాయో, ఇక్కడ కూడా అలాగే జరగడం ఇప్పటికీ ఒక రహస్యమే.
వెయ్యేళ్లుగా పెరుగుతున్న వరి కంకులు
ఆలయంలోని చక్రతాళ్వార్ సన్నిధిలో మనకు కొన్ని వరి కంకులు కనిపిస్తాయి. ఇవి సాదాసీదా వరి కంకులు కావు. సుమారు 1000 సంవత్సరాల క్రితం నాటివి. సాధారణంగా వరి కంకులు కొద్ది రోజుల్లోనే ఎండిపోతాయి. కానీ, ఇక్కడ ఉన్న వరి కంకులు నేటికీ పచ్చగా ఉండటమే కాకుండా, అవి కొద్దికొద్దిగా పెరుగుతున్నాయని చెబుతారు. ఇది ప్రకృతి నియమాలకు విరుద్ధమైనా, భక్తులకు మాత్రం స్వామివారి లీలగా చెబుతారు.
రామానుజాచార్యుల అసలు శరీరం
ఈ ఆలయంలో విశిష్టాద్వైత సిద్దాంత కర్త శ్రీ రామానుజాచార్యులవారి భౌతికకాయం నేటికీ ఉన్నట్టుగా చెబుతారు. 1137వ సంవత్సరంలో ఆయన పరమపదించినపుడు ఆయన శరీరాన్ని దహనం చేయకుండా పద్మాసనం భంగిమలో ప్రత్యేకమైన పద్దతిలో అంటే ఆయన శరీరానికి కుంకుమపువ్వు, పచ్చకర్పూరాన్ని లేపనంగా పూసి భద్రపరిచారు. విచిత్రమేమంటే నేటికి కూడా ఆయన భౌతికకాయం చెక్కుచెదరకుండా అలానే ఉన్నది. శ్రీరంగం వెళ్లినవారు స్వామివారి భౌతికకాయాన్ని సందర్శించవచ్చు.
ఆసియాలోనే ఎత్తైన రాజగోపురం
శ్రీరంగం ఆలయ రాజగోపురం సుమారు 236 అడుగుల ఎత్తుతో 13 అంతస్తులను కలిగి ఉంటుంది. ఈ గోపురంపై ఉన్న శిల్పకళ, దాని వైశాల్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 156 ఎకరాల విస్తీర్ణంలో 7 ప్రాంగణాలు ఉండటం విశ్వాంతరాళంలోని 7 లోకాలను సూచిస్తుందని చెబుతారు.
ధన్వంతరి నైవేద్యం – సుక్కు వెన్ని
వైకుంఠ నాథుడైన రంగనాథునికి ప్రతి రోజూ రాత్రి వేళ 'సుక్కు వెన్ని' అనే ఔషధాన్ని నైవేద్యంగా పెడతారు. ఆలయ ఆవరణలోనే ఆరోగ్య ప్రదాత ధన్వంతరి ఆలయం ఉంది. స్వామివారికి జీర్ణం కావడానికి, ఆరోగ్యం బాగుండటానికి ధన్వంతరి స్వయంగా ఈ ఔషధాన్ని ఇస్తారని ఇక్కడి అర్చకులు చెబుతుంటారు. పలురకాలైన కైంకర్యాల నిర్వహణ సమయంలో రంగనాథుడికి వివిధరకాలైన భోగాలను నైవేద్యంగా సమర్పిస్తారు. రాత్రివరకు వివిధ రకాలైన పదార్ధాలను స్వామివారు భుజిస్తారు అనే నమ్మకంతో రాత్రివేళ సుక్కువెన్ని అనే శొఠిపానియాన్ని స్వామికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇక ఇక్కడి స్వామిని శ్రీరాముడు అయోధ్యలో స్వయంగా పూజించేవాడని, అయితే, రావణ సంహారం తరువాత అయోధ్యకు వచ్చిన విభీషణుడికి ఈ విగ్రహాన్ని ఇచ్చాడని, ఆ విగ్రహాన్ని లంకకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తూ శ్రీరంగం చేరుకున్నాడని, అక్కడ కిందపెట్టిన విగ్రహం కదల్లేదని చెబుతారు. అక్కడే స్వామివారికి ఆలయం నిర్మించి విభీషణుడు పూజించినట్టు చెబుతారు. ఒక్కమాటలో చెప్పాలి అంటే శ్రీరంగం స్వామి వారిని దర్శించడం అంటే కేవలం గుడిని చూడటం మాత్రమే కాదు..సాక్షాత్తు ఆ వైకుంఠాన్ని భూమిపై అనుభూతి చెందడం అనే చెప్పాలి.




