Mehandipur: మెహందీపూర్ బాలాజీ ఆలయంలో వింత ఆచారం... ఇలా చేస్తే కష్టాలకు తాళం వేసినట్టే
దేశంలో విచిత్రమైన ఆచారాలు ఉన్న ఆలయాల్లో ఒకటి మెహందీపూర్ బాలాజీ ఆలయం. ఇక్కడ ఇనుప ద్వారాలకు తాళాలు వేస్తుంటారు. దీని వెనుక అనేక కథనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Mehandipur: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో, జైపూర్‌కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో వెలసిన మెహందీపూర్ బాలాజీ ఆలయం భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంతో విశిష్టమైనది. దేశంలో వేలాది పురాతన ఆలయాలు, అద్భుత శిల్పకళా సంపద ఉన్నప్పటికీ, మెహందీపూర్ బాలాజీ క్షేత్రం మాత్రం తన ప్రత్యేకమైన విశ్వాసాలు, ఆచారాలతో కోట్లాదిమంది భక్తులను ఆకర్షిస్తోంది. దుష్టశక్తుల పీడలు, చేతబడులు, మానసిక అలజడుల నుంచి విముక్తి ప్రసాదించే ఆధ్యాత్మిక న్యాయస్థానంగా ఈ క్షేత్రాన్ని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలో ప్రధానంగా కనిపించే ఒక వింతైన ఆచారం...రక్షణ దారాలు కట్టడం, తాళాలు వేలాడదీయడం. గుడి ప్రాంగణంలోని ఇనుప గ్రిల్స్, బారికేడ్లకు వందలాది తాళాలు వేసి ఉండటం ఇక్కడికి వచ్చే భక్తులకు వింత అనుభవాన్ని కలిగిస్తుంది.
తాళాలు కట్టడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావన
జీవితంలో ఎదురయ్యే కష్టాలు, భయాలు, మానసిక అశాంతిని అక్కడే ముగించి, ప్రశాంతమైన జీవితాన్ని పొందాలనేది ఈ ఆచారం వెనుక ఉన్న ప్రధాన నమ్మకం. అందుకే ఇక్కడ ఇనుప గ్రిల్స్‌కు తాళాలు వేలాడదీస్తారు. తాళం వేసి తాళం చెవిని దగ్గర పెట్టుకుంటారు. తాళం వేయడం వలన కష్టాలకు తాళాలు పడతాయని నమ్ముతారు. పవిత్రమైన దారాలను ఆలయ ప్రాంగణంలో కట్టడం ద్వారా స్వామివారి దైవిక రక్షణ తమకు నిరంతరం ఉంటుందని భక్తులు భావిస్తారు. తమను వేధిస్తున్న ప్రతికూల శక్తులను అక్కడే వదిలేసి, స్వేచ్ఛగా ఇంటికి వెళ్లవచ్చని విశ్వసిస్తారు.
మెహందీపూర్ బాలాజీ ఆలయం ఒక పవిత్రమైన ‘దైవిక దర్బార్’ లాగా పనిచేస్తుందని రాజస్థాన్ ప్రభుత్వం, స్థానిక చరిత్ర కథనాలు పేర్కొంటున్నాయి. ఈ క్షేత్రంలో బాలాజీ ఈయన్నే హనుమంతుడు అని కూడా పిలుస్తారు. ఈయనే ప్రధాన దైవంగా పూజలందుకుంటుండగా, ఆయనతో పాటు ప్రేతరాజ్ సర్కార్, భైరవనాథ్ కూడా కొలువై ఉంటారు. తీవ్రమైన ఆధ్యాత్మిక సమస్యలు లేదా మానసిక పీడలతో బాధపడేవారు ఇక్కడ జరిగే 'పేశీ' అనే ప్రత్యేక పూజా విధానంలో పాల్గొంటారు.
ఈ క్షేత్రంలో పాటించాల్సిన కఠినమైన నియమాలు
ఆలయ ప్రాంగణంలో లేదా పరిసరాల్లో తెలియని వ్యక్తుల నుంచి ఎటువంటి తినుబండారాలు, నీరు తీసుకోకూడదు. వాటి ద్వారా నెగెటివ్ ఎనర్జీ సోకే అవకాశం ఉందని నమ్ముతారు. అంతేకాదు, ఇక్కడి నీటిని లేదా ప్రసాదాన్ని కూడా ఇంటికి తీసుకెళ్లకూడదు. తీర్థంలో దుష్టశక్తుల ప్రభావాన్ని గ్రహించే శక్తి ఉంటుందని, అందుకే దానిని అక్కడే వదిలేయాలని చెప్తారు. ఇక స్వామివారి దర్శనం తరువాత ఆలయం వైపు లేదా వెనుకకు తిరిగి చూడకుండానే నిష్క్రమించాలని చెబుతారు. అయితే, ఇక్కడ ఈ తాళాలు, దారాల ఆచారం ఎప్పుడు ప్రారంభమైందనే దానికి కచ్చితమైన లిఖితపూర్వక ఆధారాలు లేనప్పటికీ, శతాబ్దాలుగా భక్తుల అనుభవాల ద్వారా ఏర్పడిన నమ్మకమే దీనికి మూలం. కేవలం నమ్మకమే కాకుండా, మనసులోని భయాలను దైవ సన్నిధిలో వదిలేసి ప్రశాంతతను పొందేందుకు ఈ క్షేత్రం ఒక గొప్ప ఆధ్యాత్మిక వేదికగా నిలుస్తోంది.




