Gandala Narasimha Swamy Mystery: గండాల నరసింహస్వామి రహస్యంః దీపం ఆరిపోతే కలియుగం అంతమే
మంగళగిరిలో మూడు రూపాల్లో కొలువైన నరసింహస్వామి భక్తులను ఆపదల నుంచి రక్షించడమే కాకుండా... గండాల నరసింహస్వామిగా శిఖరాగ్రాన కొలువైన స్వామి వారి దీపం కలియుగాంతాన్ని సూచిస్తుంది.
Gandala Narasimha Swamy Mystery: ఆపదల నుంచి గట్టెక్కించమని నారసింహా అని పిలిస్తే చాలు...ఎక్కడున్నా సరే ఆపదలో ఉన్నవారిని రక్షిస్తాడు. ప్రహ్లాదుడిని రక్షించేందుకు శ్రీమహావిష్ణువు నరసింహస్వామి అవతారం ఎత్తాడు. ఎవరు ఎలాంటి అపదలో ఉన్నా ఆర్తితో పిలిస్తే చాలు... వారిని రక్షించే దయామయుడిగా పేరొందాడు. ఇలాంటి నరసింహస్వామికి దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అందులో కృష్ణానదీ తీరంలో మహిమాన్వితమైన ఐదు దేవాలయాలు అత్యంత ప్రసిద్ధి గాంచాయి. వీటిని పంచ నరసింహ క్షేత్రాలుగా చెబుతారు. ఈ ఐదు క్షేత్రాల్లో ఒకటి మంగళగిరిలో వెలసిన నరసింహస్వామి క్షేత్రం. ఈ ఆలయంలో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. స్వామివారు మూడు రూపాల్లో మూడు ప్రదేశాల్లో కొలువై ఉంటాడు. అందులో శిఖరాగ్రాన గంగాల నరసింహస్వామి దీపం రూపంలో కొలువై ఉండటం విశేషం. శిఖరాగ్రాన వెలిగే ఈ దివ్యమైన దీపానికి, కలియుగాంతానికి విడదీయరాని సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా గండదీపం వెలుగుతూనే ఉంటుంది.
మంగళగిరిలోని మూడు నారసింహ రూపాలు
వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన 108 దివ్యధామాల్లో మంగళగిరి ఒకటి. ఈ క్షేత్రాన్ని మంగళాద్రి లేదా తోటాద్రి అని కూడా పిలుస్తారు. ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారు మూడు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. కొండ దిగువున శ్రీ లక్ష్మీనరసింహస్వామిగాను, కొండ మధ్యభాగంలో పానకాల లక్ష్మీనరసింహస్వామి రూపంలోనూ, శిఖరాగ్రాన గండాల నరసింహస్వామి రూపంలో స్వామివారు దర్శనం ఇస్తాడు. ఇలా ఒకేచోట మూడు రూపాల్లో దర్శనం ఇవ్వడం అద్భుతం.
ఆరిపోని గండదీపం... కలియుగాంతం హెచ్చరిక
మంగళగిరి కొండపై ఒక త్రిభుజాకారపు రాతి కట్టడం ఉంటుంది. ఇక్కడ స్వామివారి విగ్రహాలు ఏవీ ఉండవు, కేవలం ఒక ప్రమిద మాత్రమే ఉంటుంది. దీనినే ‘గండాలయం’ లేదా ‘గండదీపం’ అంటారు. ఈ దీపం కృతయుగం నుండి నిరంతరాయంగా వెలుగుతూనే ఉందని పెద్దలు చెబుతారు. కొండపై ఎంతటి ఈదురుగాలులు వీచినా... భారీ వర్షం కురిసినా...ప్రకృతి ఎంత దారుణంగా మారినా సరే దీపం ఆరిపోదు. ఒకవేళ ఈ గండదీపం ఆరిపోతే... కలియుగం అంతం అవుతుందని భక్తుల నమ్మకం. ప్రతిరోజూ భక్తులు పెద్ద సంఖ్యలో కొండ ఎగువ ప్రాంతానికి చేరుకొని ఆవునెయ్యిని గండదీపంలో పోస్తారు. ఎవరైతే గండదీపానికి నెయ్యిని సమర్పిస్తారో వారికి జాతకంలో ఎదురయ్యే గండాలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని చెబుతారు. రాత్రి సమయంలో ఈ దీపం మంగళగిరి ప్రజలకు కిందనుంచే కనిపిస్తుందని అంటారు.
పానకాల స్వామి క్షేత్రంలో మరో వింత
కొండ మధ్యలో ఉన్న పానకాల స్వామికి భక్తులు ఎంత పానకం నైవేద్యంగా పోసినా, అందులో సగం భాగాన్ని స్వామివారు ‘గడగడ’ తాగుతూ వెనక్కి వదిలేస్తారు. అంత తియ్యటి పానకం ఉన్న ఆ ఆలయ ప్రాంగణంలో ఒక్కటంటే ఒక్క ఈగ గానీ, చీమ గానీ కనిపించకపోవడం ఒక అద్భుతం. ఒకవేళ అక్కడ చీమలు లేదా ఈగలు కనిపిస్తే కలియుగం అంతం అవుతుందని భక్తుల విశ్వాసం. భక్తిని, నమ్మకాన్ని గుండెల్లో నింపే ఈ దివ్య క్షేత్రాన్ని దర్శిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. ఇది క్లుప్తంగా మంగళగిని శ్రీ లక్ష్మీనరసింహస్వామి చరిత్ర.




