దండకారణ్యం వల్లూరు లక్ష్మీనరసింహస్వామి రహస్యం...తాకితే సొట్టపడతాడు
Malluru Lakshmi Narasimha Swamy Temple Mystery: తెలంగాణలోని దండకారణ్యంలో కొలువైన మల్లూరు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి విగ్రహం శిలారూపంలో ఉన్నా తాకితే మనిషి శరీరంలా మెత్తగా ఉంటుంది.
Malluru Lakshmi Narasimha Swamy Temple
Malluru Lakshmi Narasimha Swamy Temple Mystery: తెలంగాణలోని దండకారణ్యంలో కొలువైన మల్లూరు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం శిలా రూపంలో ఉన్నప్పటికీ, తాకితే మనిషి శరీరంలా మెత్తగా ఉండి సొట్టపడటం, నాభి నుంచి నేటికీ రక్తం వంటి స్రావం రావడం ప్రపంచాన్నే విస్మయానికి గురిచేస్తున్న ఆధ్యాత్మిక రహస్యం. ఈ రహస్యాన్ని తెలుసుకునేందుకు దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ, ఇప్పటి వరకు ఎవరూ ఈ రహస్యాన్ని చేధించలేకపోయారు.
దండకారణ్యంలో అద్భుతం.. ఈ స్వయంభూ క్షేత్రం!
భారతదేశంలో సైన్స్‌కు కూడా అందని ఆధ్యాత్మిక అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అందులో ములుగు జిల్లా, మంగపేట మండలంలోని వల్లూరు (మల్లూరు) గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం అత్యంత విశిష్టమైనది. సుమారు 4,000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయం, దట్టమైన అడవుల మధ్య కొండపై కొలువై ఉంది. ఇక్కడ స్వామివారు 10 అడుగుల భారీ విగ్రహ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఒకవైపు ప్రకృతి మరోవైపు రహస్యం ఈ రెండింటి మధ్య కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నారు. స్వామిని దర్శించుకుంటే బాధలు తొలగిపోతాయని, కష్టాల నుంచి గట్టెక్కుతామని భక్తులు విశ్వసిస్తారు.
శిల కాదు.. సజీవ మూర్తి!
ఈ క్షేత్రంలోని అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, స్వామివారి విగ్రహం శిలతో నిర్మితమైనప్పటికీ, దానిని వేలితో తాకితే మనిషి చర్మంలాగే లోపలికి సొట్టపడుతుంది. మనం వేలిని తీసేసిన కొద్దిసేపటికే ఆ భాగం తిరిగి యథాస్థితికి చేరుకుంటుంది. రాతి విగ్రహం ఇలా మాంసపు ముద్దలా స్పందించడం వెనుక ఉన్న మర్మాన్ని ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. విగ్రహానికి నుదురు, మీసాలు, తల వెంట్రుకలు కూడా ఎంతో స్పష్టంగా ఉండటం చూస్తుంటే, స్వామి అక్కడ సజీవంగా ఉన్నారనే నమ్మకం కలుగుతుంది. ఈ నమ్మకంతోనే భక్తులు తండోప తండాలుగా స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. శిల రూపంలో స్వామవారు సజీవంగా ఉన్నారని, అందుకే తాకితే మెత్తగా మనిషి శరీరం మాదిరిగా ఉంటుందని అంటారు.
నాభి నుంచి రక్తం.. చందన ప్రసాదం
స్థల పురాణం ప్రకారం, భరద్వాజ, అంగీరస మహర్షులు ఈ విగ్రహాన్ని భూమిలో నుంచి వెలికితీస్తున్న సమయంలో, గునపం పొరపాటున స్వామివారి నాభికి తగిలిందట. అప్పటి నుంచి ఇప్పటికీ ఆ నాభి భాగం నుండి రక్తం వంటి ఎర్రని స్రావం వస్తూనే ఉంటుంది. ఈ స్రావానికి చందనాన్ని పూతగా పూసి, ఆ చందనాన్ని ప్రతి శని, ఆదివారాల్లో భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఈ ప్రసాదం స్వీకరిస్తే సకల వ్యాధులు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ చందనం కోసమే స్వామివారిని అత్యధికమంది దర్శించుకుంటారు. చందనాన్ని ముఖానికి రాసుకున్నా, నుదుటిన పెట్టుకున్నా వ్యాధులు నయమౌతాయని నమ్మకం. చర్మవ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని కూడా నమ్ముతారు. సంతానం లేనివారు స్వామిని దర్శించుకుంటే సంతానభాగ్యం కలుగుతుంది. అటవి ప్రాంతం కావడంతో భద్రతా దృష్ట్యా ఆలయాన్ని ప్రతిరోజూ సాయంత్రం 05:30 గంటలకే మూసివేస్తారు. ఏప్రిల్ మే నెలల్లో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.




