Mahanandi: మహానందిలో మౌనశిల రహస్యం...ఒక్కరోజులో దర్శించినవారిదే అదృష్టం
మహానందిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అందులో ఒకటి శివుడిపై గంగాభిషేకం, మౌనశిల, అగ్నిగుండం, పంచాక్షరి శిలలతో పాటు ధ్వని ప్రవాహాలు ముఖ్యమైనవి. వాటి గురించి తెలుసుకుందాం.
Mahanandi: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా, నల్లమల అడవుల ఒడిలో వెలసిన మహానంది క్షేత్రం ప్రకృతి సౌందర్యానికి, పరమశివుని అద్భుత లీలలకు నిలయం. వేల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ దివ్య క్షేత్రంలో ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా శబ్దాన్ని సైతం మింగేసే ‘మౌనశిల’ వింత, ఒకే రోజులో 'నవనందుల' దర్శనం చేసుకోవడం వెనుక ఉన్న మహత్తు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు సైంటిస్టుల పరిశోధనలకు కూడా చిక్కని ఈ క్షేత్రంలోని ప్రధాన రహస్యాలు, విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.
ఇంకిపోని పుష్కరిణి ... శివుని జలాభిషేకం
మహానందిలోని ప్రధాన ఆకర్షణ ఇక్కడి పవిత్ర పుష్కరిణి. ఎండకాలంలో తీవ్రమైన కరువు వచ్చినా, వర్షాలు లేకపోయినా ఈ కోనేరులో నీటి మట్టం ఒక్క అంగుళం కూడా తగ్గకపోవడం విశేషం. గర్భగృహంలోని స్వయంభూ శివలింగం పైభాగం నుంచి నిరంతరం నీటి బిందువులు పడుతూనే ఉంటాయి. శివలింగానికి పైనున్న గోడపై ఎలాంటి రంధ్రం లేకున్నా... నీరు ఎక్కడి నుంచి వస్తోంది... ఎలా వస్తోంది అన్నది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది.
శబ్దాన్ని గ్రహించే 'మౌనశిల' వింత
ఆలయ ప్రాంగణంలో రంధ్రం కలిగి ఉన్న ఒక ప్రత్యేకమైన రాతిశిల ఉంది. సాధారణంగా రంధ్రం ఉన్న రాతిపై కొబ్బరికాయ కొడితే పెద్ద శబ్దం రావాలి. కానీ ఈ రాతిపై కొబ్బరికాయ కొట్టినా ఎటువంటి శబ్దమూ రాదు. అందుకే దీనిని భక్తులు 'మౌనశిల' అని పిలుస్తారు. శబ్ద తరంగాలను పూర్తిగా శోషించుకునే ఒక అరుదైన దైవిక భద్రతా శక్తి ఈ శిలకు ఉందని నమ్ముతారు.
స్వయంభూ ఓంకార ధ్వనులు ... అగ్నికుండం
ఈ రెండే కాదు ఈ ఆలయంలో మరికొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి ఆలయంలోని శిలలు. ఇక్కడ కొన్ని ప్రత్యేక శిలల వద్ద మనసును లగ్నం చేసి వింటే మనకు పంచాక్షరి మంత్రం ఓం నమఃశివాయ వంటి ధ్వని వినిపిస్తుంది. అంతేకాదు, ఇక్కడ పుష్కరిణికి సమీపంలో అగ్నికుండం ఉంటుంది. ఈ అగ్నికుండంలో నిరంతరం మంట మండుతూనే ఉంటుంది. పరమశివుని ప్రచండ తేజస్సుగా భక్తులు భావిస్తారు. స్వామివారు జ్వాలారూపంలో ఉంటారని, అగ్నిలింగమే దానికి ఉదాహరణ అని చెప్పడమే ఈ అగ్నికుండం ప్రత్యేకత. అంతేకాదు, సంవత్సరంలోని కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యక్షదైవం సూర్యభగవానుడు తన కిరణాలతో గర్భగుడిలోని శివలింగానికి అభిషేకం చేస్తాడు. ఈ వింతను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తలు ఈ ప్రత్యేక దినాల్లో తరలివస్తారు.
'నవనందుల' దర్శన అదృష్టం
మహానంది చుట్టూ సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి. వీటిని 'నవనందులు' అని పిలుస్తారు. అవే ప్రథమ నంది, నాగ నంది, సోమ నంది, సూర్య నంది, శివ నంది, విష్ణు నంది, వినాయక నంది, మహానంది,గరుడ నంది. ఈ నవనందులను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు, అంటే ఒకే ఒక్క రోజులో ఈ 9 నంది క్షేత్రాలను దర్శించుకోవడం అత్యంత పుణ్యఫలంగా, పూర్వజన్మ సుకృతంగా భక్తులు విశ్వసిస్తారు.
ఈ పుష్కరిణి నుంచి వచ్చే పవిత్రమైన నీటి ప్రవాహ ధ్వని తరంగాలు మానసిక ఒత్తిడిని తగ్గించి, మనస్శాంతిని కలిగిస్తాయని నమ్ముతారు. సైన్స్‌కు అందని ఇటువంటి ఆధ్యాత్మిక అద్భుతాలు మహానందిని దేశంలోనే అత్యంత మహిమాన్వితమైన శివక్షేత్రాలలో ఒకటిగా నిలబెట్టాయి.




