Mahamrityunjaya Mantra: మహామృత్యుంజయ మంత్రం పుట్టింది ఇక్కడే...ఇక్కడ జరిగే ఉత్సవాలు చూసి తీరాల్సిందే

ఎవరికైనా అకాలమృత్యుభయం ఉంటే వెంటనే మహామృత్యుంజయ మంత్రం చదువుతారు. ఆయురారోగ్యాల కోసం మహా మృత్యుంజయ మంత్ర జపం, హోమం చేయిస్తుంటారు.

Balachander
Published on: 25 May 2026 11:10 AM IST
Mahamrityunjaya Mantra: మహామృత్యుంజయ మంత్రం పుట్టింది ఇక్కడే...ఇక్కడ జరిగే ఉత్సవాలు చూసి తీరాల్సిందే
X

Mahamrityunjaya Mantra: ఎవరికైనా అకాలమృత్యుభయం ఉంటే వెంటనే మహామృత్యుంజయ మంత్రం చదువుతారు. ఆయురారోగ్యాల కోసం మహా మృత్యుంజయ మంత్ర జపం, హోమం చేయిస్తుంటారు. ఇంతటి పరమ పవిత్రమైన మంత్రం పుట్టిన భూమి ఎక్కడుందో తెలుసా? గంగాదేవి శీతాకాలంలో ఆరు నెలలపాటు మానవరూపంలో కొలువై పూజలందుకునే ఉత్తరాఖండ్‌లోని మఖ్యాగ్రామంలో ఉంది. దీనినే భక్తులు ముఖీమత్‌ అని కూడా పిలుస్తారు. ఉత్తరకాశీ జిల్లాలోని హర్షిల్‌ లోయలో, హిమగిరుల మధ్య కొలువైన ఈ గ్రామంలో ఆరు నెలల పాటు అద్భుతరీతిలో ఉత్సవాలు జరుగుతాయి.

మాతంగ మహర్షి తపస్సు .. గంగమ్మ రాక

పురాణాల ప్రకారం, భగీరథుడి తపస్సుకు మెచ్చి దివి నుంచి భువికి దిగివచ్చిన గంగమ్మను, మాతంగ మహర్షి తన తపశ్శక్తితో ఈ మఖ్యా గ్రామానికి ఆహ్వానించారు. శీతాకాలంలో గంగోత్రి ధామ్ హిమపాతంతో మూసుకుపోయే సమయంలో, తన గ్రామంలో కొలువై ఉండాలని ఆయన కోరిన వరం వల్లనే ఈ సంప్రదాయం మొదలైంది. మాతంగ ఋషి పేరు మీదుగానే ఈ ప్రాంతానికి ‘మఖ్యా’ అనే పేరు వచ్చింది. ప్రతి ఏటా శరదృతువు ముగిసి శీతాకాలం ప్రారంభమయ్యే ముందు, గంగోత్రి నుంచి గంగాదేవి ఉత్సవ విగ్రహాన్ని అత్యంత వైభవంగా, పల్లకి సేవా రూపంలో ఈ గ్రామానికి తీసుకువస్తారు. ఆరు నెలల పాటు అంటే శీతాకాలంలో మూడు నెలలు, శిశిరకాలంలో మూడు నెలలు అమ్మవారు ఇక్కడే ఉంటూ భక్తుల పూజలు అందుకుంటుంది. గంగోత్రి మాదిరిగానే ఈ మఖ్యా గ్రామాన్ని కూడా గంగాదేవికి మరొక జన్మస్థానంగా పండితులు ఘనంగా కీర్తిస్తారు.

మార్కండేయుడి ముక్తి స్థలం ... మృత్యుంజయ మంత్రం

ఈ క్షేత్రానికి ఉన్న మరొక గొప్ప విశిష్టత ఏమిటంటే, అల్పాయుష్కుడైన మార్కండేయ మహర్షి ఇక్కడే జన్మించి, పరమశివుడిని మెప్పించి చిరంజీవిగా మారారు. ఆయన ఇక్కడి పవిత్ర వాతావరణంలోనే ‘మార్కండేయ పురాణాన్ని’ రచించారు. యముడి పాశం నుంచి తప్పించుకోవడానికి ఆయనకు లభించిన ‘మహా మృత్యుంజయ మంత్రం’ ఈ ధాత్రిపై మొదట ప్రతిధ్వనించింది ఇక్కడే! ఎందరో సిద్ధ పురుషులు, యోగుల తపస్సుకు ఈ గ్రామం సాక్ష్యంగా నిలిచింది.

ఎలా చేరుకోవాలి?

వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆచారం ప్రకారం, ఇక్కడ కొలువై ఉన్న గంగమ్మను దర్శించుకుంటే కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. అంతేకాదు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, జాతకంలో మృత్యు దోషాలు ఉన్నవారు, మానసిక వేదనతో సతమతమయ్యేటటువంటి భక్తులు ఈ ఆరు నెలల కాలంలో మఖ్యా గ్రామానికి వచ్చి అమ్మవారిని సేవిస్తే సమస్త దోషాలు, పీడలు తొలగిపోతాయి. ఈ పవిత్రమైన క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే భక్తులు మొదట రిషికేష్‌ నుంచి ఉత్తర కాశీ మీదుగా హర్షిల్‌ వ్యాలీకి చేరుకోవాలి. అక్కడి నుంచి మఖ్యా గ్రామానికి వెళ్లవచ్చు. అయితే, ఈ మార్గం అత్యంత సాహసోపేతంగా ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన క్షేత్రంలో ఇది కూడా ఒకటి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story