Adi Shankaracharya Mother Story: ఆదిశంకరుల ఇంటికి శ్రీకృష్ణుడు...కంటతడి పెట్టించే తల్లికథ

సనాతన ధర్మ ప్రచారకుడు, శివుడి అంశతో జన్మించిన ఆదిశంకరులు తల్లికి ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నాడో తెలియజేసే కథ ఇది.

Balachander
Published on: 26 May 2026 9:17 AM IST
Adi Shankaracharya Mother Story: ఆదిశంకరుల ఇంటికి శ్రీకృష్ణుడు...కంటతడి పెట్టించే తల్లికథ
X

Adi Shankaracharya Mother Story: జగమంతా కలిసి వచ్చినా అమ్మకు సాటిరాదు. అమ్మ ప్రేమను మించినది మరొకటి లేదు...ఉండదు కూడా. ఆ భగవంతుడు కూడా అమ్మకడుపున పుట్టాలని పరిపరివిధాలుగా కోరుకుంటాడు. అమ్మ ప్రేమను తనివితీర పొందాలని అనుకుంటాడు. ఇక ఎంతటి మహోన్నత జ్ఞాని అయినా, చివరకు భగవంతుడైనా సరే కన్నతల్లి రుణం తీర్చుకోవడం సాధ్యం కాదు. ఇక సనాతన ధర్మ ప్రచారకుడు, జగద్గురువు ఆదిశంకరాచార్యుల జీవితంలో జరిగిన ఒక పరమ పవిత్రమైన ఘట్టం ఈ సత్యాన్ని నిరూపిస్తున్నది. అమ్మకోసం సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా దిగివచ్చిన సంఘటన కంటతడి పెట్టిస్తుంది.

శంకరుల ప్రమాణం... అమ్మకు ఇచ్చిన మాట

ఆదిశంకరులు కేవలం 8 సంవత్సరాల చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించేందుకు సిద్ధపడ్డారు. ఆర్యాంబకు ఆయన ఒక్కగానొక్క కుమారుడు. సర్వసంగ పరిత్యాగిగా మారి దేశాటనకు వెళ్తున్న కొడుకును చూసి ఆ తల్లి హృదయం విలవిలలాడింది. "నాయనా! ఇప్పుడంటే నా చేతులు బాగున్నాయి, నా పని నేను చేసుకోగలను. కానీ నా చరమ దశలో, నా ఆఖరి క్షణాల్లో నాకు దిక్కెవరు?" అని కన్నీరు మున్నీరైంది. అప్పుడు ఆ బాల శంకరుడు అమ్మ చేతులు పట్టుకుని గొప్ప ప్రమాణం చేశాడు. "అమ్మా! నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయంలోనైనా సరే... నన్ను మనసారా తలచుకుంటే చాలు, మరుక్షణమే నీ కళ్ల ముందు ఉంటాను." అని మాట ఇస్తాడు. ఆదిశంకరుల మాట అంటే అది శాసనంతో సమానం. అందులోనూ సాక్షాత్తు శివుని అంశగా చెప్పబడే ఆదిశంకరులే స్వయంగా చెప్పాడు అంటే అది ఎక్కడ ఉన్నా, ఏ రూపంలో అయినా జరిగి తీరుతుంది.

ఆసన్నమైన ఆఖరి గడియలు... కృష్ణ పరమాత్ముని రాక

కాలం ఎవరికోసం ఆగదు. తన పనితాను చేసుకుంటూ పోతుంది. కాలంతో పాటుగా పయనిస్తూ ఆదిశంకరులు దేశంలోని నాలుగు దిక్కుల్లో నాలుగు పీఠాలు స్థాపించారు. సనాతన ధర్మాన్ని నిలబెట్టారు. భగవన్నామం, సనాతన ధర్మం ఊపిరిగా జీవిస్తున్న ఆదిశంకరుల తల్లి కాలడిలోని క్షేత్రంలో వృద్దాప్యానికి చేరుకుంది. ఆమె ఆఖరి శ్వాస విడిచే సమయం ఆసన్నమైంది. కళ్లుకూడా తెరవలేని స్థితిలో నోటమాట రాని వేళ తన కుమారుడు తనకు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి మనస్ఫూర్తిగా కుమారుడిని తలచుకుంటుంది. తల్లి పిలుపును తన యోగశక్తితో ఆదిశంకరులు తెలుసుకుంటాడు. తల్లికి ఉత్తమగతులు ప్రసాదించాలని అనుకొని ఆ జగన్నాథుడైన శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తాడు ఆదిశంకరులు.

ఆ క్షణంలో జరిగిన అద్భుతం

ఆర్యాంబ పడుకున్న గదిలోకి అడుగుల సవ్వడి వినబడింది. శంకరుడే వచ్చాడనుకుని ఆమె ప్రాణాలు కూడగట్టుకుని మెల్లిగా కళ్లు తెరిచింది. కానీ, అక్కడ ఉన్నది సర్వసంగ పరిత్యాగి కాదు...ఒంటినిండా బంగారు ఆభరణాలతో నెమలి పించంతో...మెలిమి ఛాయతో మెరిసిపోతున్న ఓ బాలుడు కనిపిస్తాడు. ఆయన ఎవరో కాదు..తాను జీవితాంతం తన హృదయంలో నిలుపుకున్న గురువాయూర్‌ శ్రీకృష్ణ పరమాత్మనే. పసివాడుగా ఉన్న ఆయన్ను చూడగానే...కృష్ణా...నా శంకరుడి ఆజ్ఞను మన్నించి నా కోసం వచ్చావా తండ్రీ అంటూ పులకించిపోతుంది.

మాతృప్రేమ ముందు మోకరిల్లిన జగద్గురువు

ఒక్కక్షణం కన్నయ్యను మనసారా చూసిన ఆ తల్లి హృదయం భక్తితో బరువైపోతుంది. కంటినిండా కన్నీళ్లు నింపుకుంటుంది. కళ్లు మూతలు పడతాయి. అదే సమయానికి ఆదిశంకరులు కూడా అక్కడికి చేరుకుంటారు. ఒకవైపు తాను నిత్యం పూజించే కృష్ణపరమాత్ముడు, మరోవైపు తన కడుపున పుట్టిన జ్ఞాననిధి ఆదిశంకరుడు... ఇద్దరిని ఒకేసారి చూసిన ఆ తల్లి కళ్లవెంట ఆనంద భాష్పాలు జలధారగా కారాయి. అప్పుడు శంకరులు తల్లి పాదాలపై శిరస్సు ఉంచి సాష్టాంగ ప్రణామం చేసి... "అమ్మా! ఈ సృష్టిలో అమ్మ ప్రేమకు ప్రతిఫలం ఇవ్వడం ఎవరి తరం కాదు. నవమాసాలు మోసి, నన్ను పెంచి పెద్ద చేసినందుకు నీకు నేనేమీ ఇవ్వలేను. దేవుడైనా సరే కన్నతల్లి రుణం తీర్చుకోలేడు. నేను చేయగలిగింది నీ పాదాలకు నమస్కరించడం ఒక్కటే!" అంటాడు. తన తల్లిపాదాల వద్ద రెండు కన్నీటిబొట్టులు కారుస్తాడు.

సాక్షాత్తు దైవస్వరూపుడైన ఆదిశంకరాచార్యులే కన్నతల్లి సేవ కోసం, ఆమె ఆఖరి కోరిక తీర్చడం కోసం సర్వస్వాన్ని పక్కనబెట్టి వచ్చారు. మరి ఈనాడు మన కళ్ల ముందే ఉన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేయడం ఎంతవరకు న్యాయం? అవసాన దశలో ఉన్న తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడమే మనం దేవుడికి ఇచ్చే అతిపెద్ద కానుక. ఆదిశంకరులా మనం గొప్ప గొప్ప పనులు చేయలేకపోయినా...కనీసం తల్లిదండ్రుల చివరి దశలో వారికంట తడి పెట్టించకుండా జాగ్రత్తగా చూసుకుంటే చాలు. అదే వారికిచ్చే గొప్ప గౌరవం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story