Krishna Ashtami: శ్రీకృష్ణుడిని ఎలా అలంకరించాలో తెలుసా? కన్నయ్యకు పిల్లలే ఎందుకు పూజచేయాలి?
కృష్ణాష్టమి రోజున బాలకృష్ణుడిని ఎలా అలంకరించాలి? ఏ పూలు, నైవేద్యాలు సమర్పించాలి? చిన్నారులతో కన్నయ్యకు పూజ చేయించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.
Krishna Ashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి లేదా కృష్ణాష్టమి వస్తోందంటే చాలు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటా దివ్యమైన పండుగ వాతావరణం నెలకొంటుంది. కృష్ణుడిని కేవలం ఒక దైవంగానే కాక తమ ఇంటి బిడ్డగా, ఆనందకారకునిగా భావించి పూజించడం మన సంప్రదాయం. ఈ పవిత్ర పర్వదినాన బాలకృష్ణుడి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ఎలా అలంకరించాలి, పూజలో ఏ వస్తువులు నివేదించాలి, ఇంట్లోని చిన్నారులతో పూజ చేయించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థం ఏమిటో తెలుసుకుందాం.
శ్రీకృష్ణుడి అలంకార విధానం
కృష్ణాష్టమికి రెండు నుండి మూడు రోజుల ముందే పూజా ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. బంగారం, వెండి లేదా ఇత్తడితో చేసిన బాలకృష్ణుని విగ్రహాలను తగిన రీతిలో ముస్తాబు చేస్తారు. వెండి జరీతో కూడిన పట్టు వస్త్రాలు లేదా శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతిపాత్రమైన పసుపు ఆకుపచ్చ రంగు దుస్తులతో స్వామివారిని అలంకరిస్తారు. తలపాగాను సిద్ధం చేసి, దానిపై ప్రధానంగా నెమలి పింఛాన్ని అమర్చుతారు. నుదిటిపై నిలువు శ్రీచూర్ణం/నామం, బుగ్గన దిష్టి చుక్క పెడతారు. ఇక స్వామివారి పక్కన రాధాదేవి, గోమాతల విగ్రహాలను లేదా బృందావనంలో గోపికలతో కూడిన అద్భుతమైన వాతావరణాన్ని ప్రతిబింబించేలా పూజా మందిరాన్ని తీర్చిదిద్దుతారు.
పూజా పుష్పాలు ... నివేదనలు
శ్రీకృష్ణుడు ఆనంద స్వరూపుడు కావడం వల్ల రంగురంగుల సువాసనల పూలతో పూజిస్తారు. స్వామివారికి ఎంతో ఇష్టమైన ఎర్రటి మందారాలు, రోజా పూలు, పరమపవిత్రమైన తెల్లటి సుగంధ పుష్పాలను పూజలో సమర్పిస్తారు. పూజా ద్రవ్యాలలో ఆవుపాలు, స్వచ్ఛమైన వెన్న, అటుకులు తప్పనిసరిగా ఉండాలి. వెన్న చోరుడైన కన్నయ్యకు వెన్న నివేదించడం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు వర్ధిల్లుతాయి.
చిన్నారులతో పూజ ...అంతరార్థం
కృష్ణాష్టమి రోజున ఇంట్లోని చిన్నపిల్లలకు శ్రీకృష్ణుడి లేదా గోపికల వేషధారణ వేసి పూజలో కూర్చోబెట్టడం ఆనవాయితీ. శాస్త్రాల ప్రకారం చిన్నపిల్లలు నిష్కల్మషమైన మనస్కులు, వారిలో సాక్షాత్తు పరమాత్మ నివసిస్తాడు. చిన్నారుల చేత శ్రీకృష్ణాష్టమి పూజ చేయించడం ద్వారా వారిలో ధర్మబద్ధమైన ఆలోచనలు, ఏకాగ్రత, సత్ప్రవర్తన పెరుగుతాయి. బాల్యంలోనే దైవచింతన అలవడటం వల్ల వారి భవిష్యత్తు బంగారుమయంగా మారుతుందని, కుటుంబానికి సకల గ్రహదోషాల నుండి విముక్తి లభిస్తుందని పెద్దలు చెబుతారు. ప్రకృతిని, సమస్త జీవరాశిని ప్రేమించడమే కృష్ణ తత్త్వం. ఈ జన్మాష్టమికి బాలకృష్ణుడిని మనస్ఫూర్తిగా అలంకరించి, చిన్నారుల చేత పూజలు చేయించి ఆ వేణుగోపాలుని దివ్యానుగ్రహాన్ని పొందుదాం.




