Kottiyoor Shiva Temple: భక్తుల కోసం నెల రోజులే స్వామివారి దర్శనం...11 నెలలు ప్రకృతి స్వాధీనం

ఏడాదిలో కేవలం 28 రోజులు మాత్రమే ఆలయం తెరుచుకుంటుంది. మిగతా 11 నెలలు ప్రకృతిలో కలిసిపోతుంది. ఈ అద్భుతమైన ఆలయం దర్శించాలంటే కేరళ వెళ్లాల్సిందే.

Balachander
Published on: 22 Jun 2026 10:50 AM IST
Kottiyoor Shiva Temple: భక్తుల కోసం నెల రోజులే స్వామివారి దర్శనం...11 నెలలు ప్రకృతి స్వాధీనం
X

Kottiyoor Shiva Temple: భూమి మీద వెలసిన కోట్లాది పుణ్యక్షేత్రాలలో కేరళలోని కన్నూర్ జిల్లా దట్టమైన అరణ్యాల మధ్య ఉన్న కొట్టియూర్ శివాలయం అత్యంత విలక్షణమైనది. ఈ ఆలయ ప్రధాన విశేషం ఏమిటంటే...సంవత్సరంలోని 365 రోజులలో కేవలం 28 రోజులుమాత్రమే ఇక్కడ స్వామివారి దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన 11 నెలల కాలం ఈ పవిత్ర స్థలం పూర్తిగా ప్రకృతి స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది. దక్షిణ కాశీగా పిలవబడే ఈ క్షేత్రం వెనుక ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు, ఆచారాలు ప్రతి ఒక్కరినీ భక్తిభావంలో ముంచెత్తుతాయి. జీవితంలో ఒక్కసారైనా కన్నూర్‌ అడవుల్లోని ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుంటే చాలు అనుకుంటారు శివభక్తులు.

బావళి నది తీరం ... రెండు ఆలయాల నిర్మాణం

బావళి నదికి ఇరువైపులా రెండు ఆలయాలు మనకు దర్శనం ఇస్తాయి. ఈ రెండు చోట్ల స్వామివారు భిన్నమైన రూపాల్లో దర్శనం ఇస్తాడు. నదికి ఒకవైపున సాధారణమైన ఇక్కరె కొట్టియార్‌ ఆలయం ఉంటుంది. ఇక్కడ అన్ని ఆలయాల్లో మాదిరిగానే నిత్య పూజలు జరుగుతాయి. ఇక నదికి అవతలివైపున అక్కరె కొట్టియార్‌ అనే ఆలయం ఉంటుంది. దట్టమైన అడవి మధ్యలో చెరువులో రాళ్ళతో నిర్మించిన ఆలయం ఇది. ఇక్కడ స్వామివారు స్వయంభూవుగా వెలిశారు. ఈ ఆలయానికి ఎలాంటి పైకప్పు ఉండదు. వైశాఖ ఉత్సవం జరిగే 28 రోజులు మాత్రమే ఆలయాన్ని దర్శించుకునేందుకు అనుకూలం. ఈ 28 రోజులు ఇక్కరె కొట్టియార్‌ ఆలయాన్ని మూసేసి...అడవిలో ఉన్నా అక్కరె ఆలయాన్ని తెరుస్తారు. భారీ ఎత్తున పూజలు నిర్వహిస్తారు.

మానవ నిర్మితం కాదు... ప్రకృతి ప్రసాదం!

ఈ ఆలయానికి ఉన్న ఒకే ఒక్క ఆశ్చర్యకరమైన ఆధ్యాత్మిక నియమం ఏమిటంటే...ఇక్కడ శాశ్వత కట్టడాలు ఏవీ నిర్మించకూడదు. ఉత్సవాలు ప్రారంభమయ్యే ముందు, అడవిలోని వెదురు, చెట్ల ఆకులతో తాత్కాలిక పందిళ్ళు మాత్రమే వేస్తారు. భక్తులు భృగు మహర్షి జటలను పోలిన ఓరపోలను స్వామివారికి సమర్పిస్తారు. 28 రోజుల ఉత్సవం ముగిసిన వెంటనే తాత్కిలిక వెదురు తడకల్నింటినీ తొలగిస్తారు. 28 రోజుల తరువాత అడవిలో వర్షం కురుస్తుంది. శివలింగం ఉన్న ప్రాంతం ప్రకృతిలో కలిసిపోతుంది. మళ్లీ ఆ ప్రాంతంలోకి ఎవరూ అడుగుపెట్టరు. వైశాఖం వచ్చే వరకు నరమానవుడు ఎవరూ కూడా ఆ ఆలయం పక్కకు కూడా వెళ్లకపోవడం విశేషం. 28 రోజులు మాత్రం అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. భగవంతుడు ప్రకృతి స్వరూపుడే అని చాటిచెప్పే ఈ అద్భుత దృశ్యాన్ని దర్శించడమే మానవ జన్మకు సార్థకత.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story