Kondagattu: తెలంగాణ ఇలవేల్పు కొండగట్టు అంజన్న రహస్యం...ఇలాంటి విగ్రహం మరెక్కడా కనిపించదు
కొండగట్టు ఆంజనేయ స్వామిని తెలంగాణ ఇలవేల్పుగా ఎందుకు కొలుస్తారో, స్వామివారి విగ్రహం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాం.
Kondagattu: తెలంగాణ జానపదాల గుండెచప్పుడు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయం. త్రేతాయుగపు సంజీవిని పర్వత శకలంతో ముడిపడిన ఈ దివ్య క్షేత్రంలో ఒకే విగ్రహంలో ముగ్గురు దేవతల శక్తులు దాగి ఉండటం విశ్వంలోనే అత్యంత అరుదైన ఆధ్యాత్మిక రహస్యం. ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి దుష్టశక్తులైనా పటాపంచలు కావాల్సిందేనని భక్తుల నమ్మకం. ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఇక్కడ 41 రోజుల పాటు నిష్ఠతో మండలపూజ దీక్ష చేస్తే తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుందనేది ఎన్నో కుటుంబాల జీవితాల్లో నిరూపితమైన సత్యం. కొండగట్టు అంజన్నను తెలంగాణ ప్రజలు తమ ఇలవేల్పుగా పూజిస్తారు.
ఆవుల కాపరి కల... కొరంద పొదలో లభించిన నిధి
సుమారు 400 సంవత్సరాల క్రితం కొడిమ్యాల పరిగణాలో సింగం సంజీవుడు అనే ఒక సాధారణ ఆవుల కాపరి ఉండేవాడు. ఒకరోజు అతని మందలోని ఒక ఆవు తప్పిపోగా, దానికోసం వెతికి వెతికి అలసిపోయి కొండపై ఉన్న ఒక చింతచెట్టు కింద నిద్రపోయాడు. ఆ సమయంలో ఆంజనేయస్వామి అతని కలలోకి వచ్చి...తాను ఇక్కడే కొరంద పొదల్లో ముళ్ల మధ్య ఉన్నానని, తనను బయటకు తీసి ఎండ, వానల నుంచి రక్షణ కల్పించాలని చెబుతాడు. అదే విధంగా తప్పిపోయిన ఆవుజాడ కూడా చెబుతాడు. నిద్రనుంచి మేల్కొన్న సంజీవుడు స్వామివారు కలలో కనిపించి చెప్పిన చోటికి వెళ్లి పొదలను తొలగించగా అక్కడ విగ్రహం లభిస్తుంది. అప్పటికప్పుడు అక్కడ దొరికిన వాటితో స్వామివారికి చిన్న ఆలయం నిర్మిస్తాడు. ఆ తరువాత దాదాపు 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశముఖ్ అనే భక్తుడు ఇప్పుడున్న ఆలయాన్ని నిర్మించాడు.
జగమంత వింత... ఈ విగ్రహం ప్రత్యేకతలు
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కొండగట్టు అంజన్న విగ్రహం అత్యంత విలక్షణమైనది. సాధారణంగా ఆంజనేయుడు చేతులు జోడించి లేదా గద పట్టుకుని కనిపిస్తాడు. కానీ ఇక్కడ స్వామివారికి ఒకవైపు ఆంజనేయ వక్త్రం, మరోవైపు నారసింహ వక్త్రం ఉంటాయి. శంఖు, చక్రాలు మరియు గదతో స్వామివారు అలంకృతుడై ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తారు. స్వామివారి వక్షస్థలంలో స్వయంగా సీతారాముల రూపాలు ముద్రించబడి ఉంటాయి.
ఈ క్షేత్రానికి మరో విశేషం కూడా ఉంది. ఆలయానికి రక్షకుడిగా భేతాళస్వామి క్షేత్రపాలకుడిగా ఉంటాడు. ఈ భేతాళునికి కల్లు, జంతు బలులను నైవేద్యంగా సమర్పించడం ఇక్కడి ఆచారం. అలాగే, ఇక్కడి రావిచెట్టుకు దుష్టశక్తులు పట్టిన వారిని కట్టేస్తే, స్వామివారి పరాక్రమానికి ఆ శక్తులు వదిలిపోతాయని భక్తులు నమ్ముతారు. ఆలయం ముందు సీతమ్మవారి కన్నీటి చారలు కూడా నేటికీ కనిపిస్తాయి.
సాధారణ రోజుల్లో మధ్యాహ్నం విరామం ఉన్నప్పటికీ, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మంగళవారం, శనివారాల్లో మాత్రం ఆలయాన్ని అస్సలు మూసివేయకుండా రోజంతా దర్శనాలకు అనుమతిస్తారు. ఈ రెండు రోజుల్లో స్వామివారికి విశేష అభిషేకాలు జరుగుతాయి. జీవితంలో ఒక్కసారైనా కొండగట్టు అంజన్నను దర్శించుకుంటే సకల రోగాలు, మానసిక బాధలు తొలగిపోయి ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని పెద్దల నమ్మకం.




