Kiradu Temple Curse: కిరాడులో మహా ఘోరమైన శాపం...రాత్రివేళ తలుపులు తెరిస్తే శిలగా మారిపోతారు
రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో కిరాడు గ్రామంలో అత్యంత భయానకమైన దృశ్యాలు మనకు కనిపిస్తుంటాయి. అందంగా, అద్భుతమైన శిల్పవాస్తు కలిగిన కిరాడు దేవాలయం వెనుక అత్యంత విషాధకరమైన సంఘటనలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Kiradu Temple Curse: మనదేశంలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ఎన్నో ఆలయాలు నిదర్శనంగా ఉన్నాయి. అదేవిధంగా గొప్ప సాధువులు కోపాగ్నికి శాపంగా మారిన ఆలయాలు ఉన్నాయి. ఆలయాలతో పాటు గ్రామాలు కూడా శాపానికి గురయ్యాయి. ఇదంతా ఓ చందమామ కథలా అనిపించవచ్చు. కానీ, ఇప్పటికీ ఆ గ్రామాన్ని సాధువు శాపం పట్టి పీడిస్తోంది. రాత్రిపూట బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. ఎప్పుడో పూర్వకాలంలో ముని ఇచ్చిన శాపం కారణంగా గ్రామంలో లెక్కలేనన్ని శిలలు, రాతి విగ్రహాలు కనిపిస్తుంటాయి. అంతేకాదు, గ్రామంలోనే ఓ మహిళ విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది. గ్రామంలోని ఆలయంలో వింత వింత శబ్దాలు వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఆ గ్రామానికి దేశవ్యాప్తంగా పేరొచ్చింది. అంతకు మించి భయం కలిగిస్తోంది.
కిరాడు గ్రామం...సాధువు శాపం
ఈ ఘోరమైన శాపం గురించి తెలియాలంటే మనం రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా కిరాడు గ్రామానికి వెళ్లాలి. ఇక్కడి గ్రామం చాలా చిన్నది. కానీ, దేశవ్యాప్తంగా పేరుగాంచింది. 11వ శతాబ్దంలో ఈ గ్రామంలో అందమైన వాస్తు, శిల్పకళతో ఓ అద్భుతమైన దేవాలయం నిర్మించారు. చిన్న గ్రామంలో అంత అద్భుతమైన ఆలయం ఉండటం గొప్ప విషయమే కదా. పేరుకే ఇది గ్రామం...పూర్వం రోజుల్లో సంపన్నమైనదిగా చుట్టుపక్కల ప్రసిద్ది. ఈ నేపథ్యంలో ఓ సాధువు తన శిష్యులతో కలిసి గ్రామానికి విచ్చేసి కిరాడు ఆలయంలో ఉన్నారట. అయితే, అనుకోకుండా సాధువుకు పని కలగడంతో కొన్నిరోజులు బయటకు వెళ్లవలసి వచ్చింది. గ్రామస్తులను పిలిచి తన శిష్యులను జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతాడు. ఆరోజుల్లో సాధువులపై నమ్మకం, గౌరవం ఉండేది. కానీ, అనుకోకుండా, సాధువు వెళ్లిన తరువాత కొన్ని కారణాల వలన శిష్యులు అనారోగ్యం బారిన పడతారు. దీంతో గ్రామస్తులు వారిని పట్టించుకోవడం మానేస్తారు. కొంతమంది అనారోగ్యంతో మరణిస్తారు. అయితే, శిష్యులు అనారోగ్యంగా ఉన్న సమయంలో గ్రామంలోని ఓ మహిళ మాత్రం వారికి సేవ చేస్తుంది.
సాధువు తిరిగి వచ్చేసరికి శిష్యుల్లో కొందరు అనారోగ్యంతో మరణిస్తారు. దీంతో ఆగ్రహించిన సాధువు గ్రామంలోని ప్రజలంతా శిలలుగా మారిపోవాలని శపిస్తాడు. అయితే, శిష్యులకు సేవచేసిన మహిళను మినహాయించి వెనక్కి తిరిగి చూడకుండా గ్రామం విడిచి వెళ్లిపోవాలని చెబుతాడు.
శిలగా మారిన మహిళ...రాత్రివేళ తలుపులు తెరిస్తే
సాధువు మాటలపై నమ్మకంతో మహిళ వెనక్కి చూడకుండా కొంతదూరం వెళ్తుంది. కానీ, ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలంతో వెనక్కితిరి చూస్తుంది. దీంతో ఆ మహిళ కూడా శిలగా మారిపోతుంది. నేటికీ ఈ శిలను గ్రామంలో గమనించవచ్చు. కాలక్రమేణా ఈ గ్రామం శిథిలావస్తకు చేరుకుంది. గ్రామంలో ఎవరూ నివశించేందుకు ముందుకు రాలేదు. కాలం మారింది...కానీ, గ్రామంలో నివశించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పటికీ ఈ గ్రామం నిర్జనంగానే ఉంటుంది. పర్యాటకులు ఎవరైనా సరే ఉదయం మాత్రమే సందర్శిస్తారు. గ్రామం పొలిమేరలో నివశించే ప్రజలు కూడా రాత్రి సమయం కాగానే తలుపులు మూసేస్తారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవరు. తెరిస్తే శిలలుగా మారిపోతారేమో అనే భయం. అంతేకాదు, కిరాడు ఆలయంలో నుంచి రాత్రివేళ భయంకరమైన శబ్దాలు వస్తాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు. మీరెప్పుడైనా రాజస్థాన్ వెళితే తప్పకుండా ఈ కిరాడు ఆలయాన్ని సందర్శించండి.




