Khajrana Ganesh Temple: ఇక్కడ తలక్రిందులుగా నిలబడి స్విస్తిక్ గుర్తు వేస్తారు...ఎందుకో తెలుసా?
ఇండోర్‌లోని ఖజ్రానా గణేష్ ఆలయంలో భక్తులు తలక్రిందులుగా స్వస్తిక్ ఎందుకు వేస్తారు? కోరిక నెరవేరిన తర్వాత మళ్లీ నేరుగా స్వస్తిక్ వేసే సంప్రదాయం వెనుక ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకుందాం.
Khajrana Ganesh Temple: భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ, పురాతన గణపతి క్షేత్రాలలో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో ఉన్న 'ఖజ్రానా గణేష్ ఆలయం' ఒకటి. ఈ పుణ్యక్షేత్రానికి ప్రతిరోజూ దాదాపు 10,000 మందికి పైగా భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఇక్కడి విగ్రహం వెనుక భాగంలో ఒక వినూత్నమైన ఆచారాన్ని పాటిస్తారు. అదేమిటంటే... ప్రతి ఒక్కరూ స్వామివారి విగ్రహం వెనుక తలక్రిందులుగా నిలబడి స్వస్తిక్ గుర్తును వేస్తారు. తమ మనసులోని కోరిక నెరవేరాలని వేడుకుంటూ చేసే ఈ ప్రత్యేక క్రతువు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.
తలక్రిందులుగా స్వస్తిక్ గుర్తు ... కోరికల విన్నపం
ఆలయానికి వచ్చే భక్తులు గణపతి విగ్రహం వెనుక గోడపై లేదా విగ్రహం వెనుక భాగాన తలక్రిందులుగా నిలబడి స్వస్తిక్ గుర్తును చిత్రీకరిస్తారు. తమ మనసులో ఉన్న కష్టాలు, కోరికలు నెరవేరాలని కోరుకుంటూ భక్తులు ముందుగా ఈ విధంగా స్వస్తిక్ గుర్తును ఉల్టాగా వేస్తారు. గణపతి అనుగ్రహంతో అనుకున్న కోరిక నెరవేరిన తర్వాత, భక్తులు మళ్లీ ఈ క్షేత్రానికి చేరుకుంటారు. ఈసారి స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుతూ నేరుగా స్వస్తిక్ గుర్తును గీసి తమ మొక్కు తీర్చుకుంటారు.
చారిత్రక నేపథ్యం ... ఖజ్రానా ఆలయ ప్రాశస్త్యం
ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. మరాఠా సామ్రాజ్యానికి చెందిన గొప్ప పాలకురాలు మాతా అహల్యాబాయి హోల్కర్ 1735 ప్రాంతంలో ఈ గణపతి ఆలయాన్ని నిర్మించారు. ఈ విగ్రహాన్ని ఔరంగజేబు దాడుల నుండి కాపాడేందుకు ముందుగా ఒక బావిలో దాచిపెట్టారని, ఆ తర్వాత అహల్యాబాయికి స్వప్నంలో గణనాథుడు కనిపించడంతో బయటకు తీసి ప్రతిష్ఠించారని కథనం.
భక్తుల నమ్మకం, నిత్య పూజలు
ఈ క్షేత్రంలో కొలువుదీరిన గణనాథుడు అత్యంత శక్తిమంతుడని, ఇక్కడ కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తులు గట్టిగా నమ్ముతారు. ప్రసిద్ధ పండగలు, వినాయక చవితి రోజుల్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. సాధారణ రోజుల్లో సైతం 10,000 మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివస్తారు. సమస్యలు ఉన్నప్పుడు ఉల్టాగా స్వస్తిక్ వేయడం, అది పరిష్కారమయ్యాక నేరుగా వేసి స్వామికి నమస్కరించుకోవడం ఇక్కడి సంప్రదాయంగా వస్తోంది. ఈ వినూత్న విశ్వాసమే ఖజ్రానా క్షేత్రాన్ని దేశంలోనే ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిపింది. ఇక్కడికి వచ్చిన భక్తులు తలక్రిందులుగా స్వస్తిక్ గుర్తును వేయడం ద్వారా తమ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తుంటారు.




