Kanwar Yatra: కన్వర్‌ యాత్ర రహస్యం... జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్రను చేయాలని ఎందుకు చెబుతారో తెలుసా?

కన్వర్‌ యాత్ర ఎందుకు చేయాలి అనే దానిపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిగా కన్వర్‌ యాత్ర చేసింది ఎవరు అనే దానిపై కూడా పలురకాలైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

Balachander
Published on: 31 July 2026 8:57 AM IST
Kanwar Yatra: కన్వర్‌ యాత్ర రహస్యం... జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్రను చేయాలని ఎందుకు చెబుతారో తెలుసా?
X

Kanwar Yatra: శివనామ స్మరణతో ప్రతిధ్వనించే శ్రావణ మాసంలో, భుజాన కావడి మోస్తూ సాగే 'కన్వర్‌ యాత్ర' కేవలం ఒక కాలినడక ప్రయాణం మాత్రమే కాదు. అది పరమశివుని పట్ల భక్తునికి ఉన్న అచంచల విశ్వాసానికి, త్యాగానికి ప్రతీక. వేల కిలోమీటర్ల దూరం నుండి గంగానది పవిత్ర జలాలను బిందెలలో నింపుకుని, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా శివాలయాలకు చేరుకుని స్వామివారికి జలాభిషేకం చేయడమే ఈ యాత్ర అంతరార్థం. ప్రతి ఏటా శ్రావణ మాసంలో ప్రారంభమయ్యే ఈ కన్వర్‌ యాత్రకు కొన్ని వేల సంవత్సరాల దివ్యమైన చరిత్ర ఉంది. లక్షలాది మంది భక్తులు పరమేశ్వరుని అనుగ్రహం కోసం, జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర యాత్రను పూర్తి చేయాలని తపిస్తుంటారు.

యాత్ర వెనుక ఉన్న అసలు రహస్యం... సాగర మథనం

పురాణాల ప్రకారం, దేవతలు, అసురులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు, అమృతానికంటే ముందు ప్రపంచాన్ని నాశనం చేయగల అతి తీవ్రమైన 'హాలాహలం' అనే కాలకూట విషం వెలువడింది. విశ్వ శ్రేయస్సు కోసం ఆ పరమశివుడు ఆ విషాన్ని మింగి, తన గొంతులోనే నిలిపివేశాడు. విష ప్రభావం వల్ల శివుని కంఠం నీల వర్ణంలోకి మారి 'నీలకంఠుడిగా' పేరుగాంచాడు. అయితే ఆ విషం వల్ల ఉత్పన్నమైన విపరీతమైన వేడి, మంట నుండి భగవంతునికి ఉపశమనం కలిగించడానికి దేవతలందరూ పవిత్ర గంగాజలాన్ని తెచ్చి స్వామికి అభిషేకం చేశారు. ఆ దాహాన్ని, తాపాన్ని చల్లార్చేందుకు ప్రారంభమైన ఈ జలాభిషేక సాంప్రదాయమే నేడు శ్రావణ మాసంలో కన్వర్‌ యాత్రగా నిలిచింది.

తొలి కన్వరీయా ఎవరు? పురాణాలు ఏం చెబుతున్నాయి?

ఈ దివ్యమైన యాత్రను మొదట ఎవరు ప్రారంభించారు అనేదానికి సంబంధించి మన పురాణాలలో నాలుగు ప్రధానమైన కథనాలు ఉన్నాయి. ఒకటి పరశురాముడు. ఒక కథనం ప్రకారం, విష్ణువు అవతారమైన పరశురాముడే తొలి కన్వరీయా. ఆయన గఢముక్తేశ్వర్ నుండి పవిత్ర గంగాజలాన్ని కావడిలో తీసుకువెళ్లి, ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్‌లో ఉన్న 'పురా మహదేవ్' శివలింగానికి అభిషేకం చేశారని చెబుతారు. ఇక రెండోది శ్రీరాముడు. త్రేతాయుగంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడితో కలిసి బీహార్‌లోని సుల్తాన్‌గంజ్ నుండి గంగాజలాన్ని తీసుకువచ్చి దేవుఘర్‌లోని ప్రసిద్ధ 'వైద్యనాథ్ ధామ్' శివలింగానికి సమర్పించారని చెబుతారు. ఇక మూడోది రావణుడు. పరమశివుని పరమ భక్తుడైన రావణాసురుడు, సాగర మథనం సమయంలో శివునికి కలిగిన విష తాపాన్ని తగ్గించడానికి కావడి ద్వారా గంగాజలాన్ని తెచ్చి ప్రథమంగా జలాభిషేకం చేశాడని మరొక ప్రసిద్ధ నమ్మకం ప్రచారంలో ఉంది. నాలుగోది శ్రవణ కుమారుడు. తన అంధులైన తల్లిదండ్రులను భుజాలపై కావడిలో మోస్తూ తీర్థయాత్రలకు తీసుకెళ్లిన శ్రవణ కుమారుడు, తిరిగి వస్తూ వారి పూజల కోసం గంగాజలాన్ని కావడిలో తెచ్చాడు. ఈ పితృభక్తి, దైవభక్తి కూడా కన్వర్ సాంప్రదాయానికి ప్రేరణగా నిలిచాయి.

జీవితంలో ఒక్కసారైనా ఎందుకు చేయాలి?

వర్షాకాలంలో ప్రకృతి నూతన ఉత్తేజాన్ని పొందే వేళ, మనస్సులో ఉన్న అహంకారాన్ని, పాపాలను వదిలించుకోవడానికి ఈ యాత్ర ఒక గొప్ప సాధనం. కావడిలో ఒకవైపు గంగాజలాన్ని, మరొకవైపు మన భక్తిని సమతూకంతో మోస్తూ సాగే ఈ ప్రయాణం, మనిషిలోని ఓర్పును, క్రమశిక్షణను పెంచుతుంది. శ్రావణ మాసంలో పవిత్ర గంగాజలంతో బోళాశంకరునికి అభిషేకం చేయడం వల్ల సకల మనోభీష్టాలు నెరవేరి, ఆయురారోగ్యాలు లభిస్తాయని విశ్వసిస్తారు. జీవిత కాలంలో ఒక్కసారైనా ఇలా పవిత్రమైన గంగాజలాన్ని కావడిలో తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story