Kanwar Yatra 2026: శ్రావణంలో ప్రారంభమయ్యే కన్వర్ యాత్ర... ఈ మూడింటి గురించి తప్పక తెలుసుకోవాలి
జులై 30 నుంచి ప్రారంభమయ్యే కన్వర్ యాత్ర కోసం ఉత్తర భారతం సిద్దమౌతున్నది. ఈ యాత్రలో వేలాదిమంది భక్తులు గంగానది నుంచి నీటిని కావడిలో తీసుకొని పాదయాత్రగా సొంత గ్రామాలకు వెళ్తారు.
Kanwar Yatra 2026: పరమశివునికి ఎంతో ప్రీతిపాత్రమైన పవిత్ర శ్రావణ మాసం రాగానే ఉత్తర భారతదేశంలో శివనామస్మరణ మారుమోగిపోతుంది. శివభక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో, కఠిన నియమాలతో చేపట్టే అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణమే ‘కన్వర్ యాత్ర’. గంగానది లేదా ఇతర పవిత్ర నదుల నుంచి నీటిని కావడిలో నింపుకుని, వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ వెళ్లి శ్రావణ శివరాత్రి నాడు శివలింగానికి జలాభిషేకం చేయడం ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ ఏడాది 2026 జులై 30న అత్యంత వైభవంగా ప్రారంభం కానున్న ఈ కన్వర్ యాత్రలో భక్తులు తమ శారీరక సామర్థ్యాన్ని బట్టి చేపట్టే మూడు ప్రత్యేక రకాల యాత్రల గురించి తెలుసుకుందాం.
కన్వర్ యాత్రలో మూడు ప్రధాన రకాలు
కావడిని మోస్తూ సాగే ఈ పవిత్ర యాత్రలో భక్తుల నిష్ఠ, కఠినత్వ ఆధారంగా మూడు రకాలు ఉన్నాయి. ఇందులో మొదటిది డాక్ కన్వర్. ఇది వేగవంతమైన యాత్ర. భక్తులు పవిత్ర గంగాజలాన్ని తీసుకున్న క్షణం నుంచి శివాలయానికి చేరుకునే వరకు ఎక్కడా ఆగకుండా, నిరంతరం పరిగెత్తుతూ లేదా వేగంగా నడుస్తూ ప్రయాణాన్ని పూర్తి చేస్తారు. ఇక రెండోది ఖడీ కన్వర్. ఈ యాత్రలో ప్రధాన నియమం ఏమిటంటే.. కావడిని ఎట్టిపరిస్థితుల్లోనూ నేలపై పెట్టకూడదు. యాత్రలో ఉన్న భక్తుడు అలసిపోతే, వెంటనే తోటి భక్తుడు ఆ కావడిని తన భుజాలపైకి మార్చుకుని ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఇది క్రమశిక్షణకు, పరస్పర సహకారానికి ప్రతీక. ఇక మూడోది దండీ కన్వర్. ఇది అత్యంత కఠినమైన తపస్సు లాంటిది. భక్తులు దారి పొడవునా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ముందుకు సాగుతారు. ఈ యాత్ర పూర్తి కావడానికి కొన్ని రోజుల నుండి వారాల సమయం పడుతుంది. ఈ మూడు యాత్రలు అత్యంత విశిష్టమైనవే. అయితే, భక్తుడి శారీరక సామర్థ్యాన్ని అనుసరించి యాత్రను చేపడతారు.
2026 శ్రావణ శివరాత్రి ప్రత్యేకత
2026 జులై 30 గురువారం రోజున ఈ కన్వర్ యాత్ర ప్రారంభమౌతుంది. అయితే, ఆగస్టు 11 నాటికి కావడి మోస్తూ జిల్లాలు, రాష్ట్రాలు దాటుకొని సొంతప్రాంతాలకు చేరుకుంటారు. ఆగస్టు 11న శ్రావణ శివరాత్రి. ఆరోజున కావడిలో తీసుకొచ్చిన పవిత్ర గంగాజలాలతో మహాశివుడికి అభిషేకం చేస్తారు. ఇలా శివాభిషేకం చేయడంతో ఈ యాత్ర సంపూర్ణమవుతుంది. ఏటా వచ్చే 12 మాస శివరాత్రుల్లో ఉత్తర భారత శ్రావణ కృష్ణపక్ష చతుర్థశి నాడు వచ్చే శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఆరోజున మహాశివుడికి అభిషేకం చేస్తే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, మానసికంగా శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం. నియమాల కఠినత్వం కంటే భక్తుడిలో ఉన్న విశ్వాసం, భక్తిభావమే శివునికి ముఖ్యం. అందుకు భక్తులు తమ శారీరక సామార్థ్యాన్ని బట్టి మార్గాన్ని ఎంచుకుంటారు. కన్వర్ యాత్ర చేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా భావిస్తారు.




