Kannambadi Temple Mystery: కన్నంబాడి ఆలయ రహస్యం...నేటికీ స్పష్టంగా వినిపిస్తున్న వేణుగానం
కన్నంబాడి ఆలయంలో మురళీ కృష్ణుడి వేణుగానం మనందరికీ స్పష్టంగా వినిపిస్తుంది. ఈ వేణుగానం ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు.
Kannambadi Temple Mystery: భారతదేశంలోని పురాతన దేవాలయాలు కేవలం రాతి కట్టడాలు కావు, అవి అపారమైన ఆధ్యాత్మిక శక్తులకు నిలయాలు. ఆకాశం నుంచి వెలువడే దైవిక తరంగాలను ఒడిసిపట్టి భూమిపైకి ప్రసరింపజేసే అద్భుత విజ్ఞానం మన గోపురాల్లో దాగి ఉంది. అలాంటి ఒక పరమ పవిత్రమైన, ఊహకందని దైవిక రహస్యానికి నిలయమే కర్ణాటకలోని హోసా కన్నంబాడి వేణుగోపాలస్వామి ఆలయం. సుమారు 70 ఏళ్ల పాటు పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉన్నా, నేటికీ ఈ ఆలయ గర్భగుడిలో శ్రీకృష్ణుడి మధుర వేణుగానం స్పష్టంగా వినిపించడం ఒక గొప్ప ఆధ్యాత్మిక వింతగా భక్తులు చెబుతున్నారు.
నీటి గర్భం నుంచి బయటపడిన అద్భుతం
శతాబ్దాల క్రితం హోయసల రాజుల కాలంలో అత్యంత వైభవంగా నిర్మితమైన ఈ ఆలయం దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండేది. అయితే, కృష్ణరాజ సాగర్ ఆనకట్టు నిర్మాణ సమయంలో ఈ చారిత్రక క్షేత్రం పూర్తిగా నీటి అడుగునకు వెళ్ళిపోయింది. అలా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 70 సంవత్సరాల పాటు ఈ ఆలయం నీటిలోనే ఉండిపోయింది. కాలగర్భంలో కలిసిపోయింది అనుకున్న ఈ పురాతన ఆలయం 2010లో నీటి మట్టం తగ్గడంతో మళ్లీ బయటపడింది. ఆ తర్వాత 2011లో నాటి శిల్పకళా వైభవం దెబ్బతినకుండా, నేటి తరానికి అనుగుణంగా దీనిని పునరుద్ధరించారు.
ఆలయ నిర్మాణ శైలి ... విశేషాలు
ప్రస్తుతం ఈ ఆలయం సరికొత్త కాంతులతో భక్తులను ఆకర్షిస్తోంది. దీని నిర్మాణంలో ముఖ్యమైన విభాగాలు ఉన్నాయి. ఆలయానికి ఇరువైపులా అందమైన వరండాలతో కూడిన భవనాలు, వాటి చుట్టూ యాగశాలలు ఉన్నాయి. అంతేకాదు, వేడుకలు నిర్వహించుకోవడానికి విశాలమైన హాలు, వసారాలను నిర్మించారు. ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఒకవైపు కేశవుడు ఉన్న గర్భగుడి, దక్షిణంవైపున మురళీలోలుడైన గోపాలకృష్ణుడి గర్భగుడి ఉంటాయి. రెండు గర్భగుల్లోని స్వామివార్లను భక్తులు దర్శించుకుంటారు.
వీడని వేణుగాన రహస్యం
ఇక్కడి అసలు రహస్యం ఏమిటంటే.. గర్భగుడిలోని గోపాలకృష్ణుడి విగ్రహం దగ్గరకు వెళ్లినప్పుడు అత్యంత శ్రావ్యమైన, ఆహ్లాదకరమైన మురళీ నాదం భక్తులకు వినిపిస్తుంది. ఈ శబ్దం ఎక్కడి నుండి వస్తోంది? రాతి విగ్రహం నుంచి నాదస్వరం ఎలా సాధ్యం? అనే ప్రశ్నలకు ఆధునిక విజ్ఞాన శాస్త్రం దగ్గర కూడా సమాధానం లేదు. ఇది ముమ్మాటికీ దైవ రహస్యమని, కన్నయ్య ఇక్కడే కొలువై ఉన్నాడనడానికి ఇదే నిదర్శనమని భక్తులు నమ్ముతారు. పుస్తక పుటల్లో చదువుకునే కథల కంటే మధురమైన ఈ క్షేత్రాన్ని దర్శిస్తే మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందని పెద్దల నమ్మకం. కర్ణాటక వెళ్లిన భక్తులు తప్పకుండా దర్శించే ఆలయాల్లో ఇది ఒకటి.




