Kanchi Kamakshi Temple: తల్లిదండ్రుల వివాహ మహోత్సవానికి గణేషుడి ఆహ్వానం...కంచి కామాక్షి ఆలయంలో అద్భుతం

కంచిలో ఆదిదంపతుల వివాహ మహోత్సవానికి వారి కుమారుడైన గణపతి నగారా వేసి భక్తులను ఆహ్వానిస్తాడు.

Balachander
Published on: 29 May 2026 11:30 AM IST
Kanchi Kamakshi Temple: తల్లిదండ్రుల వివాహ మహోత్సవానికి గణేషుడి ఆహ్వానం...కంచి కామాక్షి ఆలయంలో అద్భుతం
X

Kanchi Kamakshi Temple: భారతదేశంలోని అత్యంత పవిత్రమైన సప్త మోక్షపురుల్లో కంచీపురం ఒకటి. ఈ సమస్త భూమండలానికి కాంచీపురం నాభిస్థానం వంటిది. గర్బంలో ఉన్న బిడ్డకు తల్లి బొడ్డుతాడు ద్వారా పోషణ అందించిన విధంగానే కంచిలో కొలువైన కామాక్షి అమ్మవారు లోకానికి పోషణ అందిస్తుందని అంటారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే భక్తుల సంసార కష్టాలన్నీ తీరి, లోకోత్తరమైన ఆధ్యాత్మిక పోషణ లభిస్తుంది. ఈ ఆలయంలో మరో విశేషమేమంటే... స్వయంగా తల్లిదండ్రులైన శివపార్వతుల వివాహ మహోత్సవానికి భక్తులందరినీ ఆ విఘ్నాధిపతి విఘ్నేశ్వరుడే ఆహ్వానిస్తాడు. అలా ఆహ్వానించే లంబోదరుడిని ఢంకా వినాయకుడు అని పిలుస్తారు.

శివకంచి వైభవం ... ఢంకా వినాయకుని విశిష్టత

కంచి క్షేత్రంలో అడుగుపెట్టాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా కేవలం మానవ ప్రయత్నం ఉంటే సరిపోదు, ఆ జగన్మాత అనుగ్రహం కూడా ఉండాలి. ఇక్కడి ఆలయ ప్రాంగణంలో దర్శనమిచ్చే ఢంకా వినాయకుడికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. శివకంచిలోని ఏకాంబరేశ్వర స్వామి, సుగంధ కుంతలాంబల వివాహ మహోత్సవం జరిగే సమయంలో, ఈ గణనాథుడు స్వయంగా ఢంకా బజాయించి ముక్కోటి దేవతలను, భక్తులను పెళ్ళికి రమ్మని ఆహ్వానించాడట. అందుకే ఈ స్వామిని దర్శిస్తే గృహంలో పెళ్ళిళ్ళు, శుభకార్యాలు త్వరగా జరుగుతాయని భక్తుల నమ్మకం.

ఆలయంలో తప్పక దర్శించాల్సిన రహస్య ఉపాలయాలు

కంచి వెళ్లినవారు కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాలను కూడా తప్పకుండా దర్శించుకోవాలి. ఇందులో ప్రధానమైనది అరూప లక్ష్మీదేవి ఉపాలయం. దేవి రూపంలేని ఈ లక్ష్మీదేవిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయి. అమ్మవారి ప్రధాన ఆలయంలో కుంకుమను ప్రసాదంగా ఇస్తారు. ఇలా ఇచ్చిన కుంకుమను ఎట్టిపరిస్థితుల్లోనూ అరూప లక్ష్మీదేవి ముందు ఉంచకూడదు. అలా ఉంచి ఆ తరువాత కుంకుమను తీసుకెళ్తే...భర్తను నిందించిన దోషం ఏర్పడుతుంది. రెండో ఉపాలయం సైకత లింగం. కాత్యాయనీదేవి ఆ పరమేశ్వరుడి కోసం ఇక్కడే ఇసుకతో లింగాన్ని చేసి తపస్సు చేసింది. గంగా ప్రవాహం నుంచి లింగాన్ని రక్షించేందుకు కాత్యాయనీ లింగాన్ని ఆలింగనం చేసుకోగా అమ్మవారి గాజుల ముద్రలు లింగంపై పడతాయి. నేటికీ ఇక్కడి ఆలయంలో ఆ విశేషాన్ని దర్శించుకోవచ్చు.

జీవితంలో తీవ్రమైన దుఃఖాలు, కష్టాలతో సతమతమయ్యే వారు ఈ ఆలయంలో అమ్మవారిని స్మరిస్తూ "శోకాపహంత్రీ సతాం" అనే శక్తివంతమైన నామాన్ని కనీసం 108 సార్లు పఠించాలి. నిశ్చలమైన మనస్సుతో ఈ నామాన్ని జపించే భక్తుల కన్నీళ్లను తుడిచి, ఆ తల్లి వారికి అఖండ సౌభాగ్యాన్ని, ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. కంచి వెళ్ళినప్పుడు ఈ ఉపాలయాలను, ఢంకా వినాయకుడిని దర్శించడం అస్సలు మరువకండి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story