Kanchi: పెరుమాళ్ ఆలయంలో బంగారుబల్లి రహస్యం... పాపాలు తొలగిపోవడానికి మునిశాపమే కారణం
కంచి అనగానే మనకు గుర్తుకు వచ్చేది బంగారు, వెండి బల్లులే. వీటి ఆవిర్భావం వెనుక ఉన్న ఆధ్యాత్మిక కథనం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Kanchi: తమిళనాడులోని ప్రముఖ దివ్యదేశాలలో ఒకటైన కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం అద్భుతమైన వైష్ణవ సంప్రదాయానికి, మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాలకు నిలయం. ఈ క్షేత్రాన్ని భక్తులు "బంగారు బల్లి ఆలయం" అని కూడా పిలుస్తారు. మన శరీరంపై బల్లి పడితే కలిగే ‘బల్లి దోషాలు’, గత జన్మల పాపాలు తొలగిపోవాలంటే కంచిలోని బంగారు, వెండి బల్లులను స్పర్శిస్తే చాలని శతాబ్దాలుగా విశ్వసిస్తున్నారు. గౌతమ మహర్షి ఇచ్చిన మునిశాపమే ఈ దివ్య ప్రతిమల ఆవిర్భావానికి, భక్తుల పాప విమోచనానికి ప్రధాన కారణమైంది.
గౌతమ మహర్షి శాపం ...
పురాణాల ప్రకారం, గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు విద్యనభ్యసించేవారు. ఒకరోజు వారు పూజ కోసం నది నుంచి తీర్థం తీసుకువచ్చే క్రమంలో, ఆ కుండలో ఒక బల్లి పడిన విషయాన్ని గమనించకుండా మహర్షికి అందించారు. శిష్యుల నిర్లక్ష్యానికి ఆగ్రహించిన గౌతమ మహర్షి, వారిద్దరినీ "బల్లులుగా మారిపోవాలని" శపించారు. తమ తప్పును తెలుసుకొని క్షమించమని వేడుకున్న శిష్యులకు మహర్షి ఉపశమనం చెబుతూ ... "కాంచీపురంలోని శ్రీ వరదరాజ పెరుమాళ్ క్షేత్రానికి వెళ్లి దైవారాధన చేస్తే శాపవిమోచనం కలుగుతుంది" అని అభయం ఇచ్చారు.
సూర్యచంద్రుల సాక్ష్యం ... శాపవిమోచనం
శిష్యులిద్దరూ బల్లుల రూపంలోనే కంచి క్షేత్రానికి చేరుకుని సుదీర్ఘకాలం పెరుమాళ్‌ను ప్రార్థించారు. వారి భక్తికి మెచ్చిన స్వామివారు వారికి పూర్వ రూపాలను ప్రసాదించి శాపవిమోచనం కలిగించారు. ఈ ఘట్టానికి సూర్యచంద్రులు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారు. స్వామివారు ఆ శిష్యులను ఆలయ ప్రాంగణంలో బంగారు, వెండి రూపాల్లో శాశ్వతంగా కొలువై ఉండమని ఆదేశించారు. అందుకే ఆలయ మూలలో కప్పుపై బంగారు బల్లి, వెండి బల్లి రూపాలతో పాటు వాటి పక్కనే సూర్యుడు, చంద్రుడు బొమ్మలు చెక్కి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. మరొక పౌరాణిక గాథ ప్రకారం, సరస్వతీ దేవి శాపం నుంచి విముక్తి పొందిన దేవేంద్రుడు స్వామివారికి కృతజ్ఞతగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించాడని అంటారు.
బల్లి దోష నివారణ ... భక్తుల నమ్మకం
సాధారణంగా బల్లిశాస్త్రం ప్రకారం మానవ శరీరంపై బల్లి పడే భాగాన్ని బట్టి శుభ, అశుభ ఫలితాలు ఉంటాయి. అయితే కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయంలోని ఈ బంగారు, వెండి బల్లులను తాకడం వలన అప్పటివరకు ఉన్న సకల బల్లి దోషాలు సమసిపోతాయని విశ్వాసం. అంతేకాదు, ఒకవేళ నేరుగా కంచి వెళ్లలేనివారు, కంచి వెళ్లి ఈ బల్లులను స్పర్శించి వచ్చిన వ్యక్తులను తాకినా కూడా ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. కేవలం భౌతికమైన దోషాలే కాకుండా, మనసులోని అజ్ఞానాన్ని పోగొట్టి ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే పవిత్ర క్షేత్రంగా కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయం విరాజిల్లుతోంది.




