Jambukeswarar Temple: జంబుకేశ్వరం మహాశివుని రహస్యం...శివలింగం నుంచి నిరంతరం నీరు..

Jambukeswarar Temple Mystery: ప్రకృతిలోని పంచభూతాలలో ఒకటైన 'జలం' రూపంలో మహాశివుడు కొలువై ఉన్న పరమ పవిత్రమైన క్షేత్రం జంబుకేశ్వరం.

Balachander
Published on: 26 April 2026 10:33 AM IST
Jambukeswarar Temple Mystery Water from Shiva Lingam
X

Jambukeswarar Temple

Jambukeswarar Temple Mystery: ప్రకృతిలోని పంచభూతాలలో ఒకటైన 'జలం' రూపంలో మహాశివుడు కొలువై ఉన్న పరమ పవిత్రమైన క్షేత్రం జంబుకేశ్వరం. తమిళనాడులోని తిరుచ్చి నగరానికి సుమారు 11 కిమీ దూరంలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం శివుని ఐదు భూతాలలో జలతత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక్కడి స్వామివారి గర్భాలంలో శివలింగం కింద నుంచి నీరు నిరంతరం ఉబికి వస్తుంది. ఎక్కడి నుంచి ఈ నీరు వస్తుందో ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. అందుకే ఇక్కడి స్వామివారిని అప్పు లింగేశ్వరుడు అని పిలుస్తారు.

పంచభూత లింగాలలో అద్భుతమైన 'అప్పులింగం'

పంచభూత లింగాలు అనగానే మనకు శ్రీకాళహస్తి గుర్తుకు వస్తుంది. ఇక్కడ స్వామివారు నిరంతరం శ్వాసిస్తుంటాడు. దీనికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. శ్రీకాళహస్తిని వాయులింగంగా చెబుతారు. అదేవిధంగా తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలో ఉన్న జంబుకేశ్వరాలయం జలతత్వానికి ప్రతీక. దీనిని జలలింగంగా, అప్పులింగంగా పిలుస్తారు. అంతేకాదు, ఇక్కడి స్వామివారిని తిరువనైకావల్‌ అని పిలుస్తారు. అంటే ఏనుగు పూజించిన క్షేత్రం అని అర్ధం.

శంభుడి తపస్సు - జంబు వృక్ష రహస్యం

ఈ జంబుకేశ్వర క్షేత్రం ఏర్పడానికి పురాణాల్లో ఓ కథ ఉంది. శంభుడు అనే పరమ శివభక్తుడు ఈ ప్రాంతంలో ఘోర తపస్సు చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమవ్వగా, శంభుడు స్వామిని తన శిరస్సుపైనే ఉండిపోమని కోరుకున్నాడు. అప్పుడు స్వామి ఇక్కడ లింగరూపంలో వెలవగా, శంభుడు జంబు వృక్షం అంట తెల్ల నేరేడు చెట్టు రూపంలో స్వామికి నీడను ఇస్తూ అక్కడే ఉండిపోయాడు. అందుకే ఈ క్షేత్రానికి 'జంబుకేశ్వరం' అనే పేరు వచ్చింది. నేటికీ ఆలయంలో ప్రాచీన జంబు వృక్షాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ జంబు వృక్షాన్ని ఆరాధిస్తే జలతత్వానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని చెబుతారు.

జలధార రహస్యం

ఈ ఆలయంలోని అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, గర్భాలయం కావేరీ నది మట్టం కంటే తక్కువలో ఉన్నట్లు కనిపిస్తుంది. శివలింగం చుట్టూ ఎప్పుడూ నీరు నిలిచి ఉంటుంది. స్వామివారి శక్తిని భక్తులకు చూపడానికి అర్చకులు ఒక పొడి వస్త్రాన్ని లింగానికి చుడతారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ వస్త్రం పూర్తిగా తడిసిపోతుంది. ఆ వస్త్రాన్ని పిండితే ధారగా నీరు కారుతుంది. భూగర్భం నుండి ఈ నీరు ఎక్కడి నుండి వస్తుందో, ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే స్వామిని ఇక్కడ 'అప్పులింగేశ్వరుడు' అప్పు అంటే నీరు అని అర్ధం. గర్భాలంలోని జలాన్ని ప్రసాదంగా తీసుకుంటే సకల దోషాలు తొలగిపోతాయని చెబుతారు.

ఇక ఈ ఆలయం ఐదెకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఆలయం చుట్టూ ఐదు ప్రాకారాలు ఉండగా, 7 భారీ గోపురాలతో నిర్మించబడింది. ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖంగా ఉండి భక్తులను అనుగ్రహిస్తారు. అంతేకాదు, పార్వతీదేవి అఖిలాండేశ్వరి రూపంలో కొలువై ఉంటుంది. అమ్మవారే స్వయంగా కావేరీ జలంతో లింగాన్ని పూజించినట్టుగా చెబుతారు. ఇప్పటికీ అదృశ్యరూపంలో అమ్మవారు నిరంతరం స్వామిని కావేరీ జలంతో అభిషేకిస్తుందని అంటారు. పరమేశ్వరుడు ఉన్నాడని నమ్మే భక్తులకు జంబుకేశ్వరంలోని జలధానే సాక్ష్యం. భక్తితో కావేరి నదిలో స్నానం చేసి జంబుకేశ్వరుడిని దర్శించుకుంటే మనసులో అశాంతి తొలగి శాంతి కలుగుతుందని భక్తుల నమ్మకం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story