Adi Shankaracharya: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు...ఆదిశంకరాచార్యులు చెప్పిన రహస్యం
Adi Shankaracharya: దేవుడు ఉన్నాడా లేదా అనే సందేహం మనుషుల్లో ఎప్పటినుంచో ఉంది. ఇది కొత్త ప్రశ్న కాదు. వేదకాలం నుంచే ఈ చర్చ కొనసాగుతూనే ఉంది
Adi Shankaracharya: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు...ఆదిశంకరాచార్యులు చెప్పిన రహస్యం
Adi Shankaracharya: దేవుడు ఉన్నాడా లేదా అనే సందేహం మనుషుల్లో ఎప్పటినుంచో ఉంది. ఇది కొత్త ప్రశ్న కాదు. వేదకాలం నుంచే ఈ చర్చ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ సందేహాలకు స్పష్టమైన సమాధానం ఇచ్చిన మహానుభావుల్లో ఆది శంకరాచార్యులు ఒకరు. ఆయన చెప్పిన ఓ సంఘటన ఈ ప్రశ్నకు సరళమైన లోతైన అర్ధాన్ని అందిస్తుంది.
ఒకసారి ఆది శంకరాచార్యులు ఓ రాజును దర్శించడానికి వెళ్లారు. రాజు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి, ఆధ్యాత్మిక విషయాలపై చర్చ మొదలుపెట్టాడు. ఆ సమయంలో రాజు ఓ ప్రశ్న అడిగాడు. వేదకాలంలో విగ్రహారాధన లేకపోతే, ఇప్పుడు ఎందుకు విగ్రహాలను పూజించాలి? అని ప్రశ్నించాడు.
సాధారణంగా ఈ ప్రశ్నకు నేరుగా సమాధానం చెబితే సరిపోతుంది. కానీ, లోకకళ్యాణం కోసం, భగవంతుని ఉనికిని ప్రతి ఒక్కరికీ తెలియజేయడం కోసం ఆదిశంకరాచార్యులు ఓ చిన్న ప్రయోగం చేశారు. రాజుగారి చిత్రపటాన్ని చూపిస్తూ ఇది మీ తండ్రిగారా లేక కేవలం చిత్రపటమా అని అడుగుతారు. చిత్రపటమేనని రాజు చెప్పడంతో వెంటనే ఆదిశంకరాచార్యులు ఆ చిత్రపటంపై ఉమ్మేస్తారు.
ఆ సంఘటనతో ఆశ్చర్యపోయిన రాజు...ఆగ్రహంతో ఉడికిపోతాడు. ఇది నా తండ్రి చిత్రపటమని తెలిసి కూడా ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తాడు. ఆదిశంకరాచార్యులు చిరుమందహాసంతో... ఇది కేవలం చిత్రంపటం అని చెప్పినా...మీ భావనలో అది మీ తండ్రినే ప్రతిబింబిస్తోంది. అందుకే ఆ పటంపై మీరు గౌరవం చూపిస్తున్నారు. అదేవిధంగా ఆలయంలోని విగ్రహం రాతితో చేసినప్పటికీ..మన భక్తి, మన నమ్మకం వలన అందులో భగవంతుడిని దర్శిస్తున్నాము. యద్భావం తద్భవతి అనే సూత్రం ఇదే. మనం ఎలా భావిస్తామో అదే మనకు అనుభవంగా మారుతుందని చెబుతాడు ఆదిశంకరులు. ఈ ప్రయోగం ద్వారా విగ్రహారాధన వెనుక ఉన్న అసలు అర్ధం స్పష్టమౌతుంది. భక్తి ఉంటే రాయిలో కూడా భగవంతుడు కనిపిస్తాడు. భక్తి లేకుంటే దేవాలయంలో కూడా భగవంతుడు కనిపించడు. శరణాగతితో కూడిన భక్తి మనలో ఉంటే భగవంతుడు గుడిలోనే కాదు మన హృదయంలో కూడా ఉంటాడు.




