Faith in God: దేవుళ్లను కాదు...మనం మారినపుడే భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది... ఈ కథే నిదర్శనం

ఇంట్లో దేవుడి పటాలను లేదా విగ్రహాలను పదేపదే మార్చే వారికి ఈ కథ ఓ కనువిప్పు అవుతుంది. పూజించేవాటిని విగ్రహాలుగా కాకుండా భగవంతుడు అందులో ఉన్నాడని భావించి ఆరాధించాలి.

Balachander
Published on: 28 July 2026 8:03 AM IST
Faith in God: దేవుళ్లను కాదు...మనం మారినపుడే భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది... ఈ కథే నిదర్శనం
X

Faith in God: కష్టాలు రాగానే దేవుళ్లను, విగ్రహాలను మార్చడం కాదు.. భగవంతుని పట్ల మనలో ఉండే 'విశ్వాసాన్ని' మార్చుకున్నప్పుడే ఆయన అనుగ్రహం లభిస్తుంది. భగవంతుడు కేవలం రాతి విగ్రహం కాదని, సజీవంగా మన ముందే ఉన్నాడనే అచంచల నమ్మకం కుదిరిన క్షణానే దివ్యకృప ప్రాప్తిస్తుందని నిరూపించే ఒక అద్భుతమైన పౌరాణిక నీతి కథ ఇది.

దేవుళ్లను మారుస్తూ సాగిన ఓ భక్తుడి ప్రయాణం

పూర్వం ఒక ఊరిలో తీవ్రమైన కష్టాలు అనుభవిస్తున్న ఒక వ్యక్తి ఉండేవాడు. తన బాధలు తీరాలంటే భగవంతుడిని పూజించాలని నిర్ణయించుకున్నాడు. కానీ సరైన అవగాహన లేక, ఒక్కొక్కరి మాట విని విగ్రహాలను మారుస్తూ వచ్చాడు. మొదట శివుడు భోళాశంకరుడని తెలిసి శివలింగానికి పూజలు, అభిషేకాలు చేశాడు. స్వామివారికి పూజలు, అభిషేకాలు చేసినా ఫలితం రాలేదని చెప్పి శివలింగాన్ని తీసేసి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెట్టి పూజించడం మొదలుపెట్టాడు. అప్పటికీ ఫలితం రాకుంటే విఘ్నేశ్వరుడు, ఆ తరువాత ఆంజనేయుడి విగ్రహాలను పెట్టి పూజించాడు. అయితే, ఎవరో చెప్పిన మాట విని, పురుష దేవతలు అంత త్వరగా కరుణించరని, జగన్మాతను ఆరాధించమని చెప్పడంతో ఆ విధంగానే జగన్మాత విగ్రహాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. విచిత్రంగా కొంతకాలం అయ్యాక అతని కష్టాలు కరిగిపోవడం మొదలయ్యాయి. అదృష్టం కలిసి వచ్చింది.

ముఖాలకు గుడ్డలు ... ప్రత్యక్షమైన మహాశివుడు

అమ్మవారిపై అమితమైన నమ్మకం పెరిగిన ఆ భక్తుడు.. నేను అమ్మవారికి వేసే ధూపం మిగతా దేవుళ్లకు సోకకూడదు అని భావించి, పక్కన పెట్టిన శివుడు, కృష్ణుడు, వినాయకుడు, హనుమంతుల విగ్రహాల ముఖాలకు గుడ్డలు కట్టేశాడు. కళ్ళు మూసుకుని ధ్యానం చేసి కళ్ళు తెరిచేసరికి, ఎవరైతే తన ప్రార్థనలు ఆలకించలేదో ఆ దేవుళ్లందరూ ప్రత్యక్షమయ్యారు! ఆశ్చర్యపోయిన భక్తుడు నేను పూజించినప్పుడు రాక, ఇప్పుడు ఎందుకు వచ్చారు? అని అడిగాడు. దానికి మహాశివుడు...నాయనా! ఇన్నాళ్లూ మమ్మల్ని కేవలం ప్రాణం లేని రాతి విగ్రహాలుగానే భావించి పూజించావు. కానీ ఈ రోజు ధూపం మా ముక్కులకు తగలకూడదని విగ్రహాల ముఖాలకు గుడ్డలు కట్టావు. అంటే మేము నిజంగా ఇక్కడే ఉన్నామనే సజీవ భావన నీకు కలిగింది. విగ్రహంలో దేవుడిని చూడటం కాదు.. విగ్రహమే దేవుడనే నీ అచంచలమైన 'విశ్వాసమే' మమ్మల్ని నీ ముందుకు రప్పించింది అని భోళాశంకరుడు స్పష్టం చేశాడు.

రామకృష్ణ పరమహంస కాళీమాతకు నైవేద్యం పెట్టినప్పుడు, అమ్మవారే స్వయంగా ఆరగించే వరకు ఎదురుచూసేవారు. దేవుళ్ల రూపాన్ని బట్టి కాక, మనలో ఉండే భక్తి తీవ్రతను బట్టే భగవంతుడి కరుణ లభిస్తుంది. కష్టాలు మన పూర్వజన్మ కర్మఫలం వల్ల వస్తాయి. కాలగమనంలో అవి కరిగిపోతాయి. భగవంతుడిని మార్చడం కాదు.. మన అంతరంగంలో నిజమైన విశ్వాసాన్ని నింపుకోవడమే అసలైన భక్తి. ఇలాంటి భక్తి ఉన్న ప్రతి భక్తుడి కష్టాలు తప్పకుండా తీరుతాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story