Devuni Kadapa Temple: తొలిగడప దర్శనం తరువాతే తిరుమల దర్శనానికి వెళ్లాలా?

కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకునే భక్తులు ముందుగా కడపలోని తొలిగడపను ఎందుకు దర్శించుకోవాలని అంటారో తెలుసుకుందాం.

Balachander
Published on: 24 Aug 2026 8:53 AM IST
Devuni Kadapa Temple: తొలిగడప దర్శనం తరువాతే తిరుమల దర్శనానికి వెళ్లాలా?
X

Devuni Kadapa Temple: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమలకు వెళ్లే భక్తులు, పూర్వకాలం నుండి ఒక పవిత్రమైన సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అదే 'దేవుని కడప' శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దర్శనం. కడప నగరంలో కొలువుదీరిన ఈ ఆలయాన్ని తిరుమల క్షేత్రానికి తొలిగడపగా భావిస్తారు. పూర్వకాలంలో కాలినడకన లేదా బండ్లలో తిరుమల యాత్ర చేసే భక్తులు ముందుగా ఈ తొలిగడప స్వామిని దర్శించుకుని, ఆయన అనుమతి పొందిన తర్వాతే శేషాచలం కొండల వైపు పయనించేవారని ప్రతీతి.

దేవుని కడప...హనుమత్‌ క్షేత్రం

పురాణాల ప్రకారం ద్వాపర యుగాంతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత కృపాచార్యులవారు ఇక్కడ స్వామివారి దివ్య మూర్తిని ప్రతిష్టించారని నమ్ముతారు. తిరుమల క్షేత్రం ఎలాగైతే శ్రీ వరాహస్వామి స్థలమో, అలాగే దేవుని కడప 'హనుమత్ క్షేత్రం'గా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహం వెనుక భాగంలోనే క్షేత్రపాలకుడిగా శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం చెక్కబడి ఉండటం ఒక అద్భుతమైన ప్రత్యేకత. పదకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారు ఈ స్వామిని దర్శించి, తరించి తన కీర్తనలలో "కడపరాయుడు"గా కీర్తించారు.

మహిమాన్వితమైన క్షేత్రం విశేషాలు

ఈ ఆలయం రాజగోపురం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ గోపురం ఒకే కాలంలో నిర్మించబడ్డాయని శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రెండు రాజగోపురాలు ఇంచుమించుగా చూసేందుకు ఒకేలా కనిపిస్తాయి. అంతేకాదు, ఇక్కడ ప్రతి ఏడాది మాఘమాసంలో తిరుమల తరహాలోనే ఇక్కడ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఇక, రథసప్తమి రోజున నిర్వహించే 7 వాహన సేవల ఉత్సవానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ ఉత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది.

మతసామరస్యానికి ప్రతీక

ఈ ఆలయానికి ఉన్న మరో గొప్ప విశేషం మతసామరస్యం. స్వామివారి దేవేరులలో ఒకరైన బీబీ నాంచారమ్మను ముస్లింలు తమ ఇంట్లోని ఆడపడుచుగా, స్వామివారిని తమ బావగారిగా భావిస్తారు. అందుకే ప్రతి ఏటా తెలుగు నూతన సంవత్సరాది అయిన ఉగాది పండుగ రోజున వేలాది మంది ముస్లిం భక్తులు దేవుని కడప ఆలయానికి వచ్చి స్వామివారికి పండ్లు, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేయడం ఇక్కడి తరతరాల ఆచారం. ఆధ్యాత్మికంగానూ, ఆధ్యాత్మిక యాత్రల్లోనూ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడం వల్ల యాత్రా ఫలం సంపూర్ణంగా లభిస్తుందని భక్తుల నమ్మకం. పూర్వం తొలిగడప దర్శనం తరువాతే తిరుమల దర్శనం చేసుకునేవారు. కానీ, ఆధునిక కాలంలో ప్రయాణ సౌకర్యాల ఏర్పాటు జరగడం వలన నేరుగా తిరుమల స్వామివారిని దర్శించుకుంటున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story